బ్యాంకింగ్‌కు మరింత మూలధనం!
♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
♦ వర్షపాతంపై ఆశావహ ధోరణి
కాలిఫోర్నియా : బ్యాంకింగ్‌కు తాజా మూలధనం కేటాయింపులపై నిర్దిష్టంగా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. భారత్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో 10 రోజుల పర్యటన జరుపుతున్న జైట్లీ, తాజాగా ప్రతిష్టాత్మక స్టన్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిపై ప్రసంగించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలకమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకులకు తాజా మూలధనం కేటాయింపులకు సంబంధించి ఇంకా నిర్దిష్టంగా ఒక నిర్ణయం ఏదీ తీసుకోలేదని వెల్లడించారు. బడ్జెట్‌లో కొంత మొత్తాలను (దాదాపు రూ.7,940 కోట్లు) ప్రకటించినా, అంతకుమించి మరింత తాజా మూలధనం అందించాలన్నది లక్ష్యమని తెలిపారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించి, ప్రైవేటు కేపిటల్‌ను సైతం భారీగా వ్యవస్థలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రైవేటు రంగ బ్యాంకులు సైతం పోటీతత్వంతో ధీటుగా పనిచేస్తున్నాయని జైట్లీ అన్నారు. దేశంలో ప్రస్తుత వర్షపాత పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని ఆర్థిక వ్యవస్థకు కలిసివచ్చే అంశం ఇదని పేర్కొన్నారు.