నిత్యావసరాల ధరలు దిగొస్తాయ్!
♦ కేంద్ర ప్రభుత్వం ధీమా...
♦ తగిన వర్షపాతం సహకరిస్తుందని భరోసా
♦ పరిస్థితిని సమీక్షించిన ఎఫ్‌ఎస్‌డీసీ
న్యూఢిల్లీ: దేశంలో తగిన వర్షపాతం నమోదైతే నిత్యావసర వస్తువుల ధరలు దిగివస్తాయన్న అంచనాలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిల సమస్యలు, నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలో సవాళ్లేనని ఆయన అంగీకరించారు. ఆర్థికమంత్రి అధ్యక్షతన మంగళవారం నాడు ఇక్కడ ఆర్థిక స్థిరత్వ అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశం జరిగింది.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడ్డంసహా అంతర్జాతీయంగా ఆర్థిక రంగానికి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికి భారత్ సిద్ధంగా ఉందని జైట్లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్, సెబీ చైర్మన్ యూకే సిన్హాసహా ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు సమావేశానికి హాజరయ్యారు. 2010లో ఏర్పాటయిన తరువాత 15వ దఫా జరిగిన ఈ సమావేశంలో చర్చల ముఖ్యాంశాలు చూస్తే...
⇒ భారత స్థూల ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై ప్రధానంగా దృష్టి.
⇒ మొండిబకాయిల సమస్యను ఎదుర్కొనడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష.
⇒ అంతర్జాతీయ అనిశ్చితి ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు జాగరూకతతో గమనించాలని నిర్ణయం.
⇒ ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్‌సీఎన్‌ఆర్) డిపాజిట్ల ద్వారా 2013లో సేకరించిన మొత్తాలకు సంబంధించి 2016 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య జరపాల్సిన పునఃచెల్లింపుల సందర్భంలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది.
⇒ ఆర్థిక పరిస్థితిని సమావేశంలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం వివరించారు.
⇒ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో.. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు, విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు, సంస్కరణలు వంటి పలు అంశాల్లో భారత్ తోటి వర్ధమాన దేశాల కన్నా మెరుగైన పరిస్థితిలో ఉందని సమావేశం అభిప్రాయపడింది.
⇒ భారత్ వద్ద ప్రస్తుత విదేశీ మారక ద్రవ్య నిల్వల ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఒడిదుడుకులను భారత్ పటిష్టంగా ఎదుర్కొనగలదనీ అభిప్రాయపడింది.
⇒ 2015-16లో సాధించిన 7.6 శాతం కన్నా, 2016-17లో వృద్ధి రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనీ అంచనావేసింది.
⇒ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత, అలాగే బ్యాంకింగ్‌లో ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై సమావేశం చర్చించింది.
లక్ష్యం ఇదీ...
ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా ఏర్పాటయిన కమిటీలో ఆర్‌బీఐ, సెబీ, పీఎఫ్‌ఆర్‌డీఏ, ఐఆర్‌డీఏ, ఎఫ్‌ఎంసీల చీఫ్‌లు సభ్యులుగా ఉన్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థికశాఖలో సీనియర్ అధికారులు కూడా ఈ కమిటీ చర్చల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక కార్యదర్శి అశోక్ లావాసా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులీ ఛబ్ దుగ్గల్ నేటి సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. ఐఆర్‌డీఏ చైర్మన్ టీఎస్ విజయన్, పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ హేమంత్ జీ కాంట్రాక్టర్‌లూ పాల్గొన్నారు. ఎఫ్‌ఎస్‌డీసీ క్రితం సమావేశం జనవరి 13న జరిగింది.