FSDC
-
ఇక పై ఒకే KYC తో అన్ని ఆర్థిక లావాదేవీలు.
-
అనధికారిక రుణ యాప్‌ల పని పట్టండి
న్యూఢిల్లీ: అనధికారిక రుణాల యాప్‌లను కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆర్థిక స్థిరత్వానికి పొంచి ఉన్న రిస్కులను గుర్తించేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, క్రియాశీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) 28వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. స్థూల ఆర్థిక స్థిరత్వం, సవాళ్లను ఎదుర్కొనడంలో భారత్ సన్నద్ధత, నియంత్రణ సంస్థల మధ్య సమస్యాత్మక అంశాలు మొదలైన వాటి గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సమ్మిళిత వృద్ధి సాధనకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చేలా ఆర్థిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలని ఎఫ్ఎస్డీసీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్, ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశీష్ పాండా, ఆర్థిక సాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఫైనాన్షియల్ రంగంపై నిరంతర అప్రమత్తత: ఎఫ్ఎస్డీసీ
ముంబై: అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా నిలువరించడానికి ఫైనాన్షియల్ రంగం, దానికి ఎదురయ్యే ఇబ్బందులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని అత్యున్నత స్థాయి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశం ఉద్ఘాటించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇక్కడ జరిగిన ఈ సమావేశం, ఎకానమీపై కీలక సమీక్ష జరిపింది. సకాలంలో తగిన చర్యలు తీసుకునేలా వ్యవస్థల సంసిద్ధత అవసరాన్ని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రులు, రెగ్యులేటర్ల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఆర్థిక రంగంపై నిరంతరం నిఘా పెట్టండి
ముంబై: దేశీ, అంతర్జాతీయ పరిణామాలతో పలు సవాళ్లు తలెత్తుతున్న నేపథ్యంలో ఆర్థిక రంగంపై నిరంతరం నిఘా పెట్టాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే సమ్మిళిత వృద్ధి సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. మంగళవారం 25వ ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ఈ భేటీలో ఆర్థిక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. ‘ఎఫ్ఎస్డీసీ లక్ష్యాలు, దేశ విదేశ పరిణామాలతో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లపై కౌన్సిల్ చర్చించింది. అలాగే ఎకానమీలో పరిస్థితులు, కీలక ఆర్థిక సంస్థల పనితీరుపై అన్ని నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం నిరంతరం ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది‘ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ (సెబీ) చైర్మన్ అజయ్ త్యాగి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్, ఆర్థిక విభాగం కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేఠ్, రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2022–23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ అత్యున్నత స్థాయి మండలి సమావేశం కావడం ఇదే ప్రథమం. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 3న ఇది భేటీ అయ్యింది. ఆర్థిక స్థిరత్వ నిర్వహణకు, నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు, ఆర్థిక రంగ అభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకునేందుకు ఫైనాన్షియల్ మార్కెట్ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎస్డీసీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం.. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో (ఎన్ఎస్ఈ) చోటు చేసుకున్న పాలనాపరమైన అవకతవకలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్.. విలేకరులకు తెలిపారు. దీని గురించి పూర్తిగా సమాచారం తనకు వచ్చే వరకూ, ఈ విషయంలో విధించిన జరిమానాలు, తీసుకున్న దిద్దుబాటు చర్యలు మొదలైనవి సరైన స్థాయిలోనే ఉన్నాయా అన్న అంశంపై తాను స్పందించలేనన్నారు. ఎల్ఐసీ ఇష్యూపై మార్కెట్లో ఆసక్తి.. ప్రతిపాదిత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూపై మార్కెట్ వర్గాల్లో భారీగా ఆసక్తి నెలకొందని మంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవో పూర్తి కాగలదని ఆమె సూత్రప్రాయంగా తెలిపారు. మార్చిలోనే లిస్ట్ చేయాలని భావిస్తున్నప్పటికీ.. భౌగోళిక, రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామంటూ ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ చెప్పిన నేపథ్యంలో సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఎకానమీ రికవరీ ఊహించిన దానికన్నా బాగుంది
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధికి రానున్న బడ్జెట్ (2021–22)లో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) చర్చించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం ఎఫ్ఎస్డీసీ 23వ సమావేశం వర్చువల్‌గా జరిగింది. ‘‘ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత పుంజుకుంటోంది. గతంలో ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతోంది’’ అని సమావేశం అనంతరం వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సమావేశంలో మాట్లాడుతూ, ఆర్థిక ఒడిదుడుకులు తత్సంబంధ అంశాలపై నియంత్రణా సంస్థల మరింత జాగరూకత, నిరంతర నిఘా అవసరమని అన్నారు. ప్రభుత్వం, ఫైనాన్షియల్ సెక్టార్ నియంత్రణా సంస్థలు తీసుకున్న చర్యల వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణ రేటు గణనీయంగా 7.5 శాతానికి తగ్గిందని (మొదటి త్రైమాసికంలో 23.9 శాతం) సమావేశం అభిప్రాయపడింది. ఎఫ్ఎస్డీసీ సభ్యులయిన ఆర్బీఐ, ఇతర రెగ్యులేటర్లు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలను సమావేశం చర్చించింది. ఆర్బీఐ గవర్నర్‌తో పాటు, సెబీ, ఐఆర్డీఏఐ, ఐబీబీఐ, పీఎఫ్ఆర్డీఏ, ఐఎఫ్ఎస్సీఏ చైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ఫైనాన్షియల్ సెక్రటరీ దేబాశిష్ పాండా తదితర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. గత ఏడాది నరేంద్రమోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎఫ్ఎస్డీసీ నాల్గవ సమావేశం ఇది. దేశం కరోనా కోరల్లో చిక్కుకున్న తర్వాత జరిగిన రెండవ సమావేశం. ఇంతక్రితం మేలో ఎఫ్ఎస్డీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేంద్రం రూ.21 లక్షల కోట్ల స్వావలంభన భారత్ ప్యాకేజ్ ప్రకటించింది. కొత్త బడ్జెట్లో మౌలిక రంగానికి పెద్దపీట ఆర్థిక మంత్రి సీతారామన్ సూచన అసోచామ్ ఫౌండేషన్ వీక్‌లో ప్రసంగం మౌలిక రంగానికి 2021–22 వార్షిక బడ్జెట్లో పెద్దపీట వేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆర్థిక పునరుద్ధరణ చర్యలు కొనసాగేందుకు బడ్జెట్లో తగిన చర్యలు ఉంటాయని వివరించారు. కోవిడ్–19 మహమ్మారి ప్రభావంతో నెమ్మదించిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ రానున్న నెలల్లో తిరిగి వేగవంతమవుతుందని ఆమె అన్నారు. పార్లమెంటులో ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే అవకాశమున్న బడ్జెట్‌ను సీతారామన్ ప్రస్తావిస్తూ, ‘‘మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు మరింతగా కొనసాగుతాయి. బహుళ ప్రయోజనాలకు ఈ చర్య దోహదపడుతుంది. ఆర్థిక పునరుద్ధరణకు సహాయపడుతుంది’’ అని అసోచామ్ (భారత వాణిజ్య, పరిశ్రమల మండళ్ల సమాఖ్య) ఫౌండేషన్ వీక్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆమె పేర్కొన్నారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... 1.ప్రభుత్వ వాటాల అమ్మకం కార్యక్రమం మరింత ఊపందుకోనుంది. ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం పొందిన కంపెనీల నుంచి పెట్టుబడుల ఉపసంహరణలను మరింత వేగవంతం చేయడం జరుగుతుంది. 2.ప్రభుత్వ బ్యాంకులు, కంపెనీల నుంచి పెట్టుబడుల ఉపంసహరణ వల్ల ఆయా కంపెనీలు మార్కెట్ నుంచి నిధులను సమీకరించుకోగలుగుతాయి. బాండ్, మార్ట్‌గేజ్‌కి సంబంధించి డెట్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేయడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. 3.ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణ లక్ష్యం రూ.12 లక్షలకోట్లలో ఇప్పటికే రూ.9.06 లక్షల కోట్లు సాకారమైంది. దీనివల్ల ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వ్యయాలు అనుకున్న విధంగా జరుగుతాయి. -
అది ‘బ్యాడ్’ ఐడియా..!
న్యూఢిల్లీ: కొన్ని కీలక అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా మొండిబాకీల వసూళ్ల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ (బ్యాడ్ బ్యాంక్) ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. ‘వ్యవస్థ స్థాయిలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రెండు, మూడు కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మొండిబాకీలను బ్యాడ్ బ్యాంక్‌కు ఏ రేటుకు విక్రయిస్తారనేది మొదటి అంశం. పారదర్శకంగా, సముచితమైన విధంగా విలువను నిర్ధారించడం జరగాలి. ఇక బ్యాడ్ బ్యాంక్ గవర్నెన్స్‌పై అత్యంత స్పష్టత ఉండాలి. చివరిగా రికవరీ రేటు ఎలా ఉంటుందనే దానిపైనా స్పష్టత ఉండాలి. ఇదంతా ప్రజాధనం. రికవరీ బాగా ఉంటుందంటే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే అర్థం లేదు’ అని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా సోమవారం కొటక్ తెలిపారు. గతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కూడా ఇలాగే మొండి బాకీల వసూలు కోసం స్ట్రెస్డ్ అసెట్స్ స్థిరీకరణ ఫండ్ (ఎస్‌ఏఎస్‌ఎఫ్) ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2004–05లో ఏర్పాటైన ఎస్‌ఏఎస్‌ఎఫ్‌కు 636 మొండి పద్దులకు సంబంధించి సుమారు రూ. 9,000 కోట్ల ఎన్పీఏలను బదలాయించారు. 2013 మార్చి ఆఖరునాటికి దీని ద్వారా సగానికన్నా తక్కువగా కేవలం రూ. 4,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఎన్పీఏల రికవరీకి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మూడు–నాలుగేళ్లకోసారి తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా గత నెలలో జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో కూడా ఇది చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కార్పొరేట్లు మారాలి..: ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా దేశీ కార్పొరేట్లు ఆలోచనా ధోరణిని కొంత మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని కొటక్ చెప్పారు. పెట్టుబడుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. స్థాయికి మించిన రుణాలు లేని కంపెనీలు ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభంలోనూ కనిపిస్తున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని కొటక్ సూచించారు. కొత్తగా వ్యూహాత్మక రంగాల్లో సాహసోపేతంగా మరిన్ని పెట్టుబడులు పెట్టాలన్నారు. కరోనా పరిణామాలతో గణనీయంగా కన్సాలిడేషన్ జరగవచ్చని, పలు రంగాల్లో కేవలం కొన్ని సంస్థలు మాత్రమే మిగలవచ్చని కొటక్ చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నిర్వహణ వ్యయాలు, తక్కువ రుణభారం ఉన్న సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నాయని విశ్వసిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్యంపై పెట్టుబడులు పెరగాలి.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే వైద్యం, విద్య, పర్యావరణం, గ్రామీణ మౌలిక సదుపాయాలు మొదలైన సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని కొటక్ తెలిపారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.3%గా ఉన్న వైద్య రంగ పెట్టుబడులు కనీసం 5 నుంచి 10%కి పెరగాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్మెంట్లు ఉండాలని కొటక్ సూచించారు. -
ఆర్థిక వ్యవస్థపై నిర్మలా సీతారామన్ కీలక సమీక్ష
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఈ రంగంలో ఉన్న ఒత్తిళ్లు తదితర అంశాలపై ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్’ (ఎఫ్ఎస్డీసీ) 21వ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష చేశారు. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ తదితర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎఫ్ఎస్డీసీ అనేది ఆర్థిక రంగానికి సంబంధించి నియంత్రణ సంస్థల అత్యున్నత మండలి. దీనికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. దేశ జీడీపీ వృద్ధి జూన్ త్రైమాసికంలో 5%కి క్షీణించడం, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు ఆశావహంగా లేకపోవడంతో ఈ సమీక్షకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘స్థూల ఆర్థిక అంశాలతోపాటు ఆర్థిక రంగ పరిస్థితులపై వివరంగా చర్చించడం జరిగింది. నియంత్రణ పరంగా అంతర్గత అంశాలతోపాటు, సైబర్ భదత్రపైనా సమీక్ష జరిగింది’’అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు తెలిపారు. ‘‘అధిక శాతం ఎన్బీఎఫ్సీలు చక్కగా పనిచేస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలను సమీకరించుకోగలుగుతున్నాయి. కొన్ని అయితే విదేశాల నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి’’ అని దాస్ తెలిపారు. సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి, ఐఆర్డీఏఐ చైర్మన్ సుభాష్‌చంద్ర కుంతియా తదితరులు పాల్గొన్నారు. -
నిత్యావసరాల ధరలు దిగొస్తాయ్!
♦ కేంద్ర ప్రభుత్వం ధీమా... ♦ తగిన వర్షపాతం సహకరిస్తుందని భరోసా ♦ పరిస్థితిని సమీక్షించిన ఎఫ్ఎస్డీసీ న్యూఢిల్లీ: దేశంలో తగిన వర్షపాతం నమోదైతే నిత్యావసర వస్తువుల ధరలు దిగివస్తాయన్న అంచనాలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిల సమస్యలు, నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలో సవాళ్లేనని ఆయన అంగీకరించారు. ఆర్థికమంత్రి అధ్యక్షతన మంగళవారం నాడు ఇక్కడ ఆర్థిక స్థిరత్వ అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశం జరిగింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడ్డంసహా అంతర్జాతీయంగా ఆర్థిక రంగానికి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికి భారత్ సిద్ధంగా ఉందని జైట్లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్, సెబీ చైర్మన్ యూకే సిన్హాసహా ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు సమావేశానికి హాజరయ్యారు. 2010లో ఏర్పాటయిన తరువాత 15వ దఫా జరిగిన ఈ సమావేశంలో చర్చల ముఖ్యాంశాలు చూస్తే... ⇒ భారత స్థూల ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై ప్రధానంగా దృష్టి. ⇒ మొండిబకాయిల సమస్యను ఎదుర్కొనడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష. ⇒ అంతర్జాతీయ అనిశ్చితి ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు జాగరూకతతో గమనించాలని నిర్ణయం. ⇒ ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్) డిపాజిట్ల ద్వారా 2013లో సేకరించిన మొత్తాలకు సంబంధించి 2016 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య జరపాల్సిన పునఃచెల్లింపుల సందర్భంలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ⇒ ఆర్థిక పరిస్థితిని సమావేశంలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం వివరించారు. ⇒ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో.. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు, విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు, సంస్కరణలు వంటి పలు అంశాల్లో భారత్ తోటి వర్ధమాన దేశాల కన్నా మెరుగైన పరిస్థితిలో ఉందని సమావేశం అభిప్రాయపడింది. ⇒ భారత్ వద్ద ప్రస్తుత విదేశీ మారక ద్రవ్య నిల్వల ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్లో ఒడిదుడుకులను భారత్ పటిష్టంగా ఎదుర్కొనగలదనీ అభిప్రాయపడింది. ⇒ 2015-16లో సాధించిన 7.6 శాతం కన్నా, 2016-17లో వృద్ధి రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనీ అంచనావేసింది. ⇒ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత, అలాగే బ్యాంకింగ్‌లో ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై సమావేశం చర్చించింది. లక్ష్యం ఇదీ... ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా ఏర్పాటయిన కమిటీలో ఆర్బీఐ, సెబీ, పీఎఫ్ఆర్డీఏ, ఐఆర్డీఏ, ఎఫ్‌ఎంసీల చీఫ్‌లు సభ్యులుగా ఉన్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థికశాఖలో సీనియర్ అధికారులు కూడా ఈ కమిటీ చర్చల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక కార్యదర్శి అశోక్ లావాసా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులీ ఛబ్ దుగ్గల్ నేటి సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. ఐఆర్డీఏ చైర్మన్ టీఎస్ విజయన్, పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్ జీ కాంట్రాక్టర్లూ పాల్గొన్నారు. ఎఫ్ఎస్డీసీ క్రితం సమావేశం జనవరి 13న జరిగింది.