వర్షాలు బాగుంటే 7.5 శాతంపైగా వృద్ధి
♦ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
♦ ఏడు రోజుల అమెరికా పర్యటన ప్రారంభం
వాషింగ్టన్: భారత్‌లో తగిన వర్షపాతం నమోదయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7.5 శాతం దాటుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా... ఎగుమతులు మందగమనంలో కొనసాగుతున్నా... గడచిన ఆర్థిక సంవత్సరంలో దేశం 7.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటోందని ఆయన అన్నారు. ఇక్కడ ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2016 స్ప్రింగ్ సమిట్‌ను పురస్కరించుకుని జైట్లీ ఏడు రోజుల అమెరికా పర్యటన ప్రారంభించారు. భారత్ వృద్ధి ధోరణికి సంబంధించి ఇక్కడ ఒక సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి జైట్లీ ప్రసంగించారు. ముఖ్యాంశాలు...
♦ ప్రపంచమంతా మందగమన ధోరణిలో ఉన్న నేపథ్యంలో భారత్ మాత్రం మంచి వృద్ధిని సాధిస్తోంది. ధరల పరిస్థితి, కరెంట్ అకౌంట్ లోటు అదుపులో ఉన్నాయి. ద్రవ్యలోటు కట్టుతప్పలేదు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తగిన అవకాశాలు ఉన్నాయి.
♦ ప్రస్తుతం 7.5% స్థాయి వృద్ధి సాధిస్తున్నా... మా అవసరాలకు ఇది తగినది కాదు. మరింత వృద్ధి అవసరం. సరళీకరణ విధానాల ద్వారా మంచి వృద్ధిని సాధిండానికి కేంద్రం కట్టుబడి ఉంది.
♦ తన పర్యటనలో భాగంగా జైట్లీ చైనా, అమెరికా ఆర్థికమంత్రులతోనూ సమావేశం కానున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా న్యూయార్క్‌లోనూ పర్యటించనున్నారు.