8 శాతం వృద్ధి సాధ్యమే: జైట్లీ
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, మెరుగైన వర్షపాతం తదితర సానుకూల అంశాలతో వచ్చే ఆర్థిక సంవత్సరం 8 శాతం వృద్ధి సాధించగలమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. కీలక సంస్కరణల అమలును విపక్షాలు అడ్డుకోకూడదని, ఆయా బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందేలా సహకరించాలని ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సూచించారు.
పెరిగిన జీడీపీ... ఇపుడు తగ్గింది!: గణాంకాలు సవరించిన ప్రభుత్వం
ప్రభుత్వం శుక్రవారం గత రెండు ఆర్థిక సంవత్సరాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేట్లను స్వల్పంగా తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) వృద్ధి రేటును 7.3 శాతం నుంచి 7.2 శాతానికి కుదించింది. 2013-2014 వృద్ధి రేటును 6.9 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది.
వ్యవసాయం, పరిశ్రమల ఉత్పత్తులకు సంబంధించి తాజాగా అందిన సమగ్ర సవరిత సమాచారం ప్రాతిపతికన ఈ రేట్లు కుదిస్తున్నట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) పేర్కొంది. జీడీపీ విలువను 2013-14లో 98.39 లక్షల కోట్లుగా పేర్కొనగా... 2014-15లో ఈ విలువ రూ.105.52 లక్షల కోట్లుగా వివరించింది.