పంట రుణాలు రీ షెడ్యూలు చేసుకోవాల్సిందేనన్న ప్రభుత్వ ప్రకటనతో రుణాల మాఫీ వ్యవహారం మరోమారు తెరమీదకొచ్చింది. రీషెడ్యూలు గడువు రెండు రోజులు మాత్రమే ఉండటంతో రైతులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. రుణాల మాఫీ ప్రక్రియపై మొదటి నుంచి అధికారులు అస్పష్ట ప్రకటనలు చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు అధికారుల హెచ్చరికలు, మరోవైపు బ్యాంకర్ల వైఖరితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ ప్రక్రియపై రైతులకు అవగాహన లేకపోవడం, కొందరు చనిపోవడం, మరికొందరు వలస వెళ్లడం వంటి కారణాలతో పంట రుణాల రీ షెడ్యూలు జిల్లాలో పూర్తిస్థాయిలో జరగలేదు.
జిల్లాలో 6.07లక్షల మంది రైతులు రూ.2725.83 కోట్ల మేర పంట రుణాల మాఫీకి అర్హులుగా తేల్చారు. అయితే ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీకి శ్రీకారం చుట్టడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో తొలి విడత కింద రూ.681.45 కోట్లు బ్యాంకుల ఖాతాల్లో జమచేశారు. 4.55 లక్షల మంది రైతులు రూ.1917 కోట్ల మేర రుణాలను రీ షెడ్యూలు చేసుకున్నారు. సుమారు 1.50లక్షల మంది రైతుల్లో కొందరు అవగాహన లోపంతో, మరికొందరు మళ్లీ రుణం అవసరం లేదనే ఉద్దేశంలో రీ షెడ్యూలు చేసుకోలేదు. పంట రుణాలు రీ షెడ్యూలు చేసుకుంటేనే రుణమాఫీ వర్తిస్తుందని తాజాగా అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. లేనిపక్షంలో తొలి విడత కింద రైతుల ఖాతాలో జమ చేసిన 25శాతం రుణ మొత్తం తిరిగి తీసుకుంటామని చెబుతున్నారు. కొన్నిచోట్ల రీ షెడ్యూలు ఫారాలపై సంతకాలు చేయాలంటూ బ్యాంకర్లు తమ ఏజెంట్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
సహకరించని బ్యాంకర్లు
రుణమాఫీ వ్యవహారంతో తమకు సంబంధం లేదని బహిరంగంగా చెబుతున్న బ్యాంకర్లు రీ షెడ్యూలు కోసం వెళ్తున్న రైతులను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. తగినన్ని కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారు. ఓ వైపు రీ షెడ్యూలు గడువు ముంచుకొస్తుండడం, మరోవైపు బ్యాంకర్ల సహాయ నిరాకరణతో లబ్ధి పొందలేక పోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. రుణమాఫీ లబ్ధిదారుల్లో సుమారు 56వేల మంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఆంధ్రాబ్యాంకుతో సహా కొన్ని బ్యాంకులు బంగారం రుణాలను రీ షెడ్యూలు చేస్తుండగా ఎస్‌బీఐ మాత్రం నిరాకరిస్తోంది.
పంట రుణాల మాఫీని సాకుగా చూపుతూ వార్షిక ప్రణాళికలో నిర్దేశించిన పంట రుణాల లక్ష్యాన్ని కూడా బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు. జిల్లాలో వివిధ బ్యాంకులకు 349 శాఖలుండగా ఖరీఫ్, రబీలో కలిపి రూ.2804 కోట్లను పంట రుణాల లక్ష్యం గా నిర్దేశించారు. ఖరీఫ్‌లో రూ.1542 కోట్ల లక్ష్యానికి రూ.625 కోట్లు, రబీలో రూ.1262 కోట్లకు రూ.860 కోట్లు మాత్రమే పంట రుణాల వితరణ జరి గింది. కొత్త రుణాల మంజూరు, పంట రుణాల రీ షెడ్యూలుపై అంతా సానుకూలంగా ఉన్నట్లు బ్యాంకర్లు ప్రకటనలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రీ షెడ్యూలు గడువు పెంచడంతో పాటు బ్యాంకుల్లో శాఖల వారీగా పంట రుణాల మంజూరు, రైతుల కోసం బ్యాంకులు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష జరిగితేనే ప్రయోజనం నెరవేరేలా ఉంది.