
97.92 శాతం తిరిగివచ్చేశాయ్
ముంబై: ఉపసంహరించిన రూ. 2000 డినామినేషన్ బ్యాంకు నోట్లలో 97.92 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం తెలిపింది. ప్రజల వద్ద ఇప్పటికీ రూ.7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్‌బీఐ ప్రకటించింది.
ఉపసంహరణ ప్రకటించిన గత ఏడాది మే 19న బిజినెస్ వ్యవహార సమయం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఈ ఏడాది జూలై 31న ఇదే సమయానికి ఈ విలువ రూ.7,409 కోట్లకు తగ్గింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం, లేదా మార్చుకునే సౌకర్యం దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లలో 2023 అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంది.
అటుపై 2023 అక్టోబర్ 9వ తేదీ నుండి ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2000 నోట్లను స్వీకరిస్తున్నాయి. ప్రజలు రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపడానికి తగిన సౌలభ్యతను కూడా కలి్పంచడం జరిగింది. 2016 నవంబర్‌లో అప్పుడు అమలులో ఉన్న రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది.