స్కాం పుట్టలో... బయటపడని పాములెన్నో | Huge scam bye the Nirav Modi | Sakshi
Sakshi News home page

స్కాం పుట్టలో... బయటపడని పాములెన్నో

Published Sun, Feb 18 2018 4:21 AM | Last Updated on Sun, Feb 18 2018 10:51 AM

Huge scam bye the Nirav Modi - Sakshi

ఏడేళ్లు ఒకేచోట ఎలా సాధ్యం? 
గోకుల్‌నాథ్‌ శెట్టి దాదాపు ఏడేళ్లపాటు ఒకే స్థానంలో కదలకుండా ఉండి.. నీరవ్‌ మోదీకి, గీతాంజలి జెమ్స్‌కు బ్యాంకు తరఫున లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌లను (ఎల్‌ఓయూ) జారీ చేశారు. ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా విషయం బయటకు రాలేదు. ఎవరికంటా పడలేదు. పోనీ ఈ ఏడేళ్లలో ఆయన కొన్నిరోజులు సెలవు పెట్టడం చేసుంటారు కదా? అప్పుడైనా ఆయన స్థానంలో వచ్చినవారికి విషయం తెలియాలి కదా? అయినా తరచూ కీలక స్థానాల్లోని వారిని మార్చే బ్యాంకుల్లో.. గోకుల్‌ శెట్టి ఏడేళ్ల పాటు ఒకే స్థానంలో ఎలా ఉండగలిగారు? అసలు మార్చేదే రుణగ్రహీతలతో సంబంధాల్ని దూరం చేయటానికి కదా! మరి గోకుల్‌ శెట్టిని మాత్రం ఎందుకు మార్చలేదు? కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌లో ప్రతి లావాదేవీ నమోదవుతుంది కదా? స్విఫ్ట్‌ ఆధారిత లావాదేవీలూ సీబీఎస్‌లో భాగమే కదా? వీటిలో ఏ ఒక్కటీ జరగలేదెందుకు? 

పెద్దలకు తెలియకుండానే జరిగిందా? 
ఈ కేసులో మనోజ్‌ కారత్‌ అనే మరో సింగిల్‌ విండో అధికారిని కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఆయన గోకుల్‌ శెట్టితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఈ ఇద్దరినీ ఏడేళ్ల పాటు మార్చకుండా అదే ఉద్యోగాల్లో కొనసాగించారా? పైపెచ్చు ప్రతి అధికారికీ తన పరిధిలో ఎంత రుణాన్ని ఆమోదించాలి? ఎంత మేరకు ఎల్‌ఓయూలను జారీ చేయొచ్చు? అన్న నిబంధనలుంటాయి కదా! వీరిద్దరూ వారి పరిమితులను దాటి వందలు, వేల కోట్ల మేర ఎల్‌ఓయూలను జారీ చేసినా వేరెవరికీ తెలియలేదంటే ఏమనుకోవాలి? పెద్దలు కొందరికి సంబంధం లేదనుకోవాలా? 

సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారా?
స్విఫ్ట్‌ ఆధారిత లావాదేవీల్లోనూ అన్నీ ప్రశ్నలే! వివిధ బ్యాంకుల్లోని సీనియర్‌ అధికారుల సమాచారం ప్రకారం.. కొన్నాళ్ల కిందటివరకూ స్విఫ్ట్‌ లావాదేవీల్ని ధ్రువీకరించటానికి కనీసం ఇద్దరు అధికారుల అనుమతి ఉండాలి. అంటే ఎవరైనా ఒకరు తప్పు చేస్తే మరో అధికారి సరిదిద్దటానికన్న మాట. దీన్ని బట్టి గోకుల్‌ శెట్టి ఒక్కరే ఈ లావాదేవీలకు ఆమోదం తెలపలేరన్నది నిజం. మరి వాటిని ఆమోదించిన రెండో అధికారి ఎవరు? ఒకవేళ రెండో అధికారి లేకుండా శెట్టి ఒక్కరే ఇలా చేసి ఉంటే.. అది సాఫ్ట్‌వేర్‌ను మార్చటం వల్లే సాధ్యమవుతుంది. అలా చేసి ఉంటారా? మరి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తే ఆ విషయం కోర్‌ బ్యాంకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను అందజేసిన ఇన్ఫోసిస్‌కు తెలియకుండా ఉంటుందా? లేదా ఇన్ఫోసిస్‌ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదా? 

ఆడిట్‌ నుంచి మినహాయించారా?
సీనియర్‌ బ్యాంకు అధికారులు చెప్పే మరో విషయమేంటంటే.. ఎల్‌ఓయూ అంటే బ్యాంకు గ్యారంటీ లాంటిదే. దాదాపు 110 శాతం మొత్తాన్ని మార్జిన్‌ మనీగా డిపాజిట్‌ చేస్తే తప్ప వీటిని జారీ చెయ్యరు. అంటే మనకు కోటి రూపాయల మేర ఎల్‌ఓయూ కావాలంటే... సదరు బ్యాంకులో రూ.1.10 కోట్లు డిపాజిట్‌ చేసి ఉండాలి. వాటిని హామీగా ఉంచుకునే సదరు బ్యాంకు ఈ ఎల్‌ఓయూను జారీ చేస్తుంది. తాజాగా నీరవ్‌ మోదీ కంపెనీలు పీఎన్‌బీలో ఎల్‌ఓయూ కావాలని అడిగితే.. బ్యాంకు ఈ డిపాజిట్‌ కోసమే పట్టుబట్టింది. అదేమీ లేదని తమకు చాన్నాళ్ల నుంచీ డిపాజిట్లు లేకుండానే ఎల్‌ఓయూ జారీ చేస్తున్నారని మోదీ గ్రూపు చెప్పటంతోనే తీగ కదిలి... డొంక బయటపడింది! మరి మార్జిన్‌ మనీ ఏమాత్రం లేకుండానే ఎల్‌ఓయూలను జారీ చేశారనే విషయం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా.. బ్యాంకు విధిగా జరిపే ఆడిటింగ్‌లో కూడా బయట పడలేదెందుకు? బహుశా!! నీరవ్‌ మోదీలాంటి కుబేరుల ఖాతాలుండే బ్రాంచీలను ఆడిట్‌ నుంచి మినహాయిస్తారేమో! ఏమో!! 

అదృశ్య హస్తాలు లేవా?
అంతర్గత ఆడిటర్లు గానీ, ఆర్‌బీఐ గానీ ఎవ్వరూ ఆరేడేళ్ల పాటు ఇంతటి భారీ లావాదేవీలను ఏమాత్రం కనుగొనలేదంటే ఏమనుకోవాలి? విదేశాల్లోని భారతీయ బ్యాంకులు సైతం ఇన్ని నిబంధనల్ని ఉల్లంఘించిన ఎల్‌ఓయూలపై కిమ్మనకుండా నగదు మంజూరు చేసేశాయంటే ఏమనుకోవాలి? పై స్థాయిలో అదృశ్య హస్తాలు లేవనుకోవాలా? 

‘విన్‌సమ్‌’ నుంచి పాఠం నేర్వలేదెందుకు?
కొన్నాళ్ల కిందట విన్‌సమ్‌ డైమండ్స్‌ సైతం లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌లను దుర్వినియోగం చేసి భారతీయ బ్యాంకులకు ఏకంగా రూ.6,800 కోట్ల మేర టోపీ పెట్టింది. దీన్లో పీఎన్‌బీ వాటా రూ.1,800 కోట్లు. అవన్నీ ఇపుడు ఎన్‌పీఏలుగా మారిపోయాయి. మరి అంతటి దారుణం జరిగాక కూడా పీఎన్‌బీలో నియంత్రణ వ్యవస్థలు ఏమాత్రం మెరుగుపడలేదనుకోవటానికి తాజా ఉదాహరణ చాలదా?  

కొసమెరుపు..
కీలకమైన ఇలాంటి కుంభకోణాలన్నీ ప్రధాన నిందితులు దేశం దాటిపోయాకే బయటపడతాయెందుకు? నీరవ్‌ మోదీ దేశం వదిలివెళ్లాకే వ్యవహారం బయటికొచ్చిందంటే ఆయనకు ఇవన్నీ ముందే తెలుసా? ఇవన్నీ సందేహాలే. ఇప్పటిదాకా సాగిన దర్యాప్తులో వీటిలో ఏ ఒక్కదానికీ జవాబు లేదు.  

విదేశాల్లోని మన బ్యాంకులు ఎలా ఇచ్చాయి? 
విదేశాల్లోని మన భారతీయ బ్యాంకులు ఈ ఎల్‌ఓయూల ఆధారంగా అక్కడి ఎగుమతిదారులకు చెల్లింపులు చేసేశాయి. నిజానికి ఈ ఎల్‌ఓయూలను 90 రోజుల గడువుకే జారీ చేయాలన్నది నిబంధన. అంటే ఆ 90 రోజుల్లోగా ఎల్‌ఓయూ జారీ చేయించుకున్న కంపెనీ/వ్యక్తి బ్యాంకుకు ఆ మొత్తం నగదు చెల్లించి వాటిని వెనక్కు తీసుకోవాలి. లేకపోతే తను మార్జిన్‌ మనీగా ఉంచిన మొత్తాన్ని బ్యాంకు మినహాయించుకుంటుంది. కాకపోతే ఇక్కడ మార్జిన్‌ మనీగా రూపాయి కూడా లేకుండా వేల కోట్ల ఎల్‌ఓయూలను జారీ చేశారు. పైపెచ్చు ప్రతి ఎల్‌ఓయూను ఏడాది కాల వ్యవధికి జారీ చేశారు. 90 రోజుల వ్యవధికి జారీ చేయాల్సిన ఎల్‌ఓయూను ఏడాదికి జారీ చేశారంటే దాన్ని ఉంచుకుని డబ్బులిచ్చిన విదేశాల్లోని భారతీయ బ్యాంకులకు విషయం తెలిసి ఉంటుంది కదా!! వీటిని నిబంధనలకు విరుద్ధంగా జారీ చేశారనే విషయాన్ని ఏ బ్యాంకూ గమనించలేదా? ఒకటి రెండు సార్లంటే గమనించకపోయి ఉండొచ్చు. కానీ ఆరేడేళ్ల పాటు ఆ నిబంధనను పట్టించుకోకుండా... వాటి ఆధారంగా అక్కడి ఎగుమతిదార్లకు నిధులిచ్చేశాయంటే ఏమనుకోవాలి? ఆయా బ్యాంకుల్లోని పెద్దలకు ఈ కుంభకోణంతో సన్నిహిత సంబంధాలు లేవనుకోవాలా? 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)ను నీరవ్‌ మోదీ, గీతాంజలి జెమ్స్‌ కలిసి ముంచేసిన వ్యవహారంలో రోజులు గడుస్తున్న కొద్దీ.. దొరుకుతున్న జవాబులకన్నా పుట్టుకొస్తున్న ప్రశ్నలే ఎక్కువవుతున్నాయి! ఈ స్కాంలో బ్యాంకుకు సంబంధించి ఇప్పటిదాకా సీబీఐ అరెస్టు చేసింది ఇద్దరినే. ఒకరు రిటైర్డ్‌ డిప్యూటీ మేనేజర్‌ గోకుల్‌నాథ్‌ శెట్టి, రెండోది సింగిల్‌ విండో ఆపరేటర్‌ 
మనోజ్‌ కారత్‌.
– సాక్షి, బిజినెస్‌ విభాగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement