
అహ్మదాబాద్: దేశంలోని బ్యాంకింగ్ రంగం మెరుగైన సేవలు అందివ్వాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ ముఖ్య పాత్ర పోషించాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. అహ్మదాబాద్‌లో మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ‍్యలు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ పుంజుకోవాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ సమర్థవంతమైన పాత్ర పోషించాలని లేకుంటే గదిలోని ఏనుగులా ఏమి ఉపయోగముండదని వ్యాఖ్యానించారు. మరోవైపు నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) మూలధన కొరత, నిర్వహణ నైపుణ్యం కొరవడటం లాంటి సమస్యలు తలెత్తుతాయని అన్నారు. స్వతంత్ర బోర్డులను ఏర్పాటు చేసి వ్యాపార వృద్ధిని పెంచుకోవాలని అన్నారు.
బ్యాంకింగ్ రంగంలో సరైన నియంత్రణ వ్యవస్థలు, సమర్థవంతమైన ఆడిట్ నిర్వహించాలని పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా ఎన్‌పీఏలు 60.5శాతం నుంచి 48.3శాతం తగ్గాయని దాస్ తెలిపారు. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో మూలధన నిష్పత్తి బాసిల్ అవసరాల కంటే ఎక్కువగానే నమోదయిందన్నారు.