
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలతో ప్రయోజనాలు పొందాలే తప్ప వాటిపై అతిగా ఆధారపడరాదని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఈ సాంకేతికతలతో ఆర్థిక సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి వల్ల ఆర్థిక స్థిరత్వానికి రిస్కులు కూడా పొంచి ఉన్నాయని ఆర్‌బీఐ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.
ఏఐ వినియోగం అతిగా పెరిగే కొద్దీ సైబర్‌దాడులు, డేటా ఉల్లంఘనలు వంటి రిస్కులు కూడా పెరిగే అవకాశం ఉందని వివరించారు. అంతే గాకుండా, ఏఐ పారదర్శకంగా ఉండకపోవడం వల్ల, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను ప్రభావితం చేసే అల్గారిథంలను ఆడిట్ చేయడం లేదా అన్వయించుకోవడం కూడా కష్టతరమవుతుందని దాస్ చెప్పారు. దీనితో మార్కెట్లలో అనూహ్య పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!
డిజిటలీకరణతో మనీ ట్రాన్స్‌ఫర్ ఎంత వేగంగా క్షణాల వ్యవధిలో జరుగుతోందో అంతే వేగంగా సోషల్ మీడియా ద్వారా వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయని, ఇలాంటివి లిక్విడిటీపరమైన ఒత్తిళ్లకు దారి తీసే అవకాశం ఉందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో రిసు్కలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.