New Rules For Bank Cheque Payments From 1st January 2021, in Telugu - Sakshi
Sakshi News home page

జనవరి 1నుంచి చెక్కులకు కొత్త రూల్స్‌

Published Mon, Dec 14 2020 8:26 AM | Last Updated on Mon, Dec 14 2020 12:44 PM

New rules to Cheque payments from January 1st 2021 - Sakshi

ముంబై, సాక్షి: వచ్చే(2021) జనవరి 1నుంచి చెక్కుల చెల్లింపులకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సానుకూల చెల్లింపుల(పాజిటివ్‌ పే) విధానం పేరుతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా నిబంధనలలో భాగంగా ఇకపై రూ. 50,000కు మించిన చెక్కుల చెల్లింపుల విషయంలో బ్యాంకులు కొన్ని కీలక అంశాలను మరోసారి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఇతర వివరాలు ఇలా.. (బ్యాంకింగ్‌: డిజిటల్‌ సేవల్లో సవాళ్లేంటి?)

అవకతవకలకు చెక్‌
పాజిటివ్‌ పేలో భాగంగా క్లియరింగ్‌ కోసం వచ్చిన చెక్కుకు సంబంధించి ప్రధాన సమాచారాన్ని బ్యాంకులు తిరిగి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు చెక్కు సంఖ్య‌, తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబర్‌, చెల్లించవలసిన మొత్తం వంటి అంశాలను పునఃసమీక్షించవలసి ఉంటుంది. తద్వారా మోసపూరిత లావాదేవీలకు చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ పాజిటివ్‌ పే వ్యవస్థను రూపొందించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ విధానం రూ. 50,000.. అంతకుమించిన పెద్ద మొత్తాల చెక్కులకు మాత్రమే వర్తింపచేయనున్నట్లు తెలుస్తోంది. (హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ షాక్‌)

పలు విధాలుగా
చెక్కును జారీ చేసిన వ్యక్తి లేదా సంస్థ లబ్దిదారుడి పేరు, సొమ్ము మొత్తం తదితర వివరాలను వివిధ మార్గాల ద్వారా చెల్లించే(డ్రాయీ) బ్యాంకుకు తెలియజేయవలసి ఉంటుంది. ఈ వివరాలను ఎస్‌ఎంఎస్‌, మొబైల్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం తదితరాల ద్వారా అందించవచ్చు. ఈ సమాచారాన్ని జమ చేసిన చెక్కు వివరాలతో చెక్‌ క్లియరింగ్‌ సిస్టమ్స్‌(సీటీఎస్‌) పోల్చి చూసుకునేందుకు వీలుంటుంది. ఎప్పుడైనా సమాచారం సరిపోలకుంటే డ్రాయీ బ్యాంకు, ప్రెజంటింగ్ బ్యాంకులకు సీటీఎస్‌ తెలియపరుస్తుంది. తద్వారా చెక్కుల  పరిష్కారానికి బ్యాంకులు తగిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. 

ఎన్‌పీఎస్‌ ద్వారా
సీటీఎస్‌లలో పాజిటివ్‌ పే వ్యవస్థను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి చేయడంతోపాటు.. పార్టిసిపేటింగ్‌ బ్యాంకులకు సైతం అందించవలసి ఉంటుంది. వెరసి ఈ వ్యవస్థను బ్యాంకులు ఖాతాదారులందరికీ అమలు చేయవలసి ఉన్నట్లు బ్యాంకింగ్‌ నిపుణులు పేర్కొన్నారు. రూ. 50,000, అంతకుమించి విలువగల చెక్కులకు ఈ వ్యవస్థ అమలుకానుంది. అయితే ఈ వ్యవస్థను రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో ఖాతాదారుని అభీష్టంమేరకే అమలు చేయవలసి ఉంటుందని తెలుస్తోంది. రూ. 5 లక్షల మొత్తానికి మించిన చెక్కులకు బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement