
రాహుల్ గాంధీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏటీఎంల్లో నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. మోదీజీ దేశ బ్యాంకింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. పీఎన్‌బీ స్కామ్‌ను ప్రస్తావిస్తూ డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ రూ 30,000 కోట్లతో విదేశాలకు ఉడాయించినా ప్రధాని మౌనంగా ఉన్నారని ట్వీట్ చేశారు. నోట్ల రద్దులో భాగంగా రూ 500, రూ 1000 నోట్లను నిర్మూలించిన ప్రధాని వాటిని నీరవ్ మోదీకి అప్పగించారని ఆరోపించారు.
మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వారణాసి, వదోదర, భోపాల్, పాట్నా, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏటీఎంలో నగదు నిల్వలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంక్ బ్రాంచ్‌లకూ ఖాతాదారులు నగదు కోసం బారులు తీరుతున్నారు. కాగా బెయిల్‌ఇన్ బిల్లు ఆందోళన నేపథ్యంలో ప్రజలు భారీ మొత్తంలో నగదు విత్‌డ్రాలకు దిగుతుండటంతో నగదు కొరత ఏర్పడిందని బ్యాంకు అధికారులు చెబుతున్నట్టు వార్తలు రావడం కలకలం రేపుతోంది.