బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత ప్రధాన ధ్యేయంగా త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక చర్య తీసుకునే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక ఒకటి బుధవారం తెలిపింది.
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత ప్రధాన ధ్యేయంగా త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక చర్య తీసుకునే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక ఒకటి బుధవారం తెలిపింది. ఇందులో భాగంగా నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్) కొంత తగ్గించవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 7 తదుపరి పాలసీ సమీక్షకు ముందే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవచ్చనీ అభిప్రాయపడింది. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సి ఉంటుంది.
దీనినే సీఆర్‌ఆర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 4%గా ఉంది. సీఆర్‌ఆర్‌ను అర శాతం తగ్గిస్తే, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.45,700 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. గడచిన రెండు నెలల్లో ఆర్‌బీఐ కీలకమైన రెపో రేటును రెండు దఫాలుగా పావుశాతం చొప్పున తగ్గించింది. దీనితో ఈ రేటు ప్రస్తుతం 7.5 శాతానికి చేరింది.