ఆర్‌బీఐ పాలసీపైనే దృష్టి
రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) చేపట్టనున్న పరపతి విధాన సమీక్ష, ఏప్రిల్-జూన్(క్యూ1) కాలానికి వెల్లడికానున్న బ్లూచిప్ కంపెనీల ఫలితాలు సమీప కాలానికి మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని స్టాక్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్‌బీఐ మంగళవారం(5న) పాలసీ సమీక్షను నిర్వహించనుంది.
మరోవైపు ఈ వారం బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐతోపాటు, ఆటో దిగ్గజాలు ఎంఅండ్‌ఎం, హీరోమోటో ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇవికాకుండా అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు వివరించారు. ఇక రుతుపవనాల పురోగతి, చమురు ధరలు కూడా కీలకంగా నిలుస్తాయని తెలిపారు.
మార్పులుండవు...
మార్కెట్ వర్గాలలో అత్యధిక శాతం మంది ఆర్‌బీఐ విధాన సమీక్షలో పెద్దగా మార్పులుండకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. రెపో వంటి కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అలాకాకుండా అనూహ్య నిర్ణయాలుంటే వీటికి అనుగుణంగా మార్కెట్లు స్పందిస్తాయని తెలిపారు. గడిచిన వారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 646 పాయింట్లు పతనమై 25,481 పాయింట్ల వద్ద నిలవగా, 188 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 7,603 వద్ద స్థిరపడింది. ర ష్యా, పశ్చిమ దేశాలమధ్య కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, శిఖరాల నుంచి వెనక్కి జారుతున్న అమెరికా మార్కెట్లు, బలహీనపడుతున్న రూపాయి వంటి అంశాల నేపథ్యంలో దేశీ మార్కెట్లో కరెక్షన్ కొనసాగే అవకాశముందని సియాన్స్‌అనలిటిక్స్ సీఈవో అమన్ చౌదురి చెప్పారు.
ఫలితాల జాబితాలో...
ఈ వారం క్యూ1 ఫలితాలు ప్రకటించనున్న ప్రధాన కంపెనీలలో జిందాల్ స్టీల్, పవర్‌గ్రిడ్, ఎన్‌హెచ్‌పీసీ తదితరాలున్నాయి.వీటితోపాటు, ఆర్‌బీఐ పాలసీ ప్రకటన, హెచ్‌ఎస్‌బీసీ తయారీ రంగ గణాంకాలు వంటివి కీలకంగా నిలవనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ పేర్కొన్నారు. రెండు వారాలుగా ఆందోళనలు రేపుతున్న గాజా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య అనిశ్చితి ఇతరత్రా విదేశీ అంశాలనూ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు.
జూలైలో రూ. 32,000 కోట్ల విదేశీ నిధులు
కేంద్రంలో పెట్టుబడులకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పాటవడంతో దేశీ మార్కెట్లపై విదేశీ న్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) ఆసక్తి మరింత పెరిగింది. జూలైలో స్టాక్స్, డెట్ సెక్యూరిటీల్లో 6 బిలియన్ డాలర్లు(రూ.32,000 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. దీంతో 2014 జనవరి నుంచి జూలై వరకూ ఎఫ్‌ఐఐల మొత్తం పెట్టుబడులు 26.4 బిలియన్ డాలర్లను(రూ.1.59 లక్షల కోట్లు) తాకాయి.