రుపీ షాక్.. మార్కెట్ క్రాష్ | Sensex crashes 340 points, rupee tumbles to record low | Sakshi
Sakshi News home page

రుపీ షాక్.. మార్కెట్ క్రాష్

Published Thu, Aug 22 2013 1:52 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

రుపీ షాక్.. మార్కెట్ క్రాష్

రుపీ షాక్.. మార్కెట్ క్రాష్

  •  గరిష్టం నుంచి సెన్సెక్స్ 760 పాయింట్లు పతనం
  •      నిఫ్టీ నష్టం 245 పాయింట్లు
  •      ఎగిసిపడిన బ్యాంకింగ్ షేర్లు
  •      ఎఫ్‌ఐఐల అమ్మకాలు రూ.792 కోట్లు
  • విధానకర్తలు, ఇన్వెస్టర్లు, కార్పొరేట్లు.. ఇలా అందరినీ ఆందోళనలో ముంచెత్తుతూ ఇటు స్టాక్‌మార్కెట్లు, అటు రూపాయి అడ్డూ, అదుపూ లేకుండా అదే పనిగా క్షీణిస్తున్నాయి. పతనానికి వెన్స్‌డే వర్రీ లాంటి కొంగొత్త విశేషణాలను జోడించుకుంటూ పడిపోతున్నాయి. బుధవారం మార్కెట్లు సానుకూలంగానే ప్రారంభమైనప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు యథాప్రకారం అమ్మకాలకు దిగడంతో ప్రధాన సూచీ సెన్సెక్స్ గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 760 పాయింట్ల మేర పతనమైంది. ఇన్వెస్టర్ల సంపద మరో రూ. 1 లక్ష కోట్లు హరించుకుపోయింది. ఇక, డాలర్‌తో పోలిస్తే ఇంకో కొత్త కనిష్టం 64.54 స్థాయినీ తాకిన రూపాయి.. బ్రిటిష్ పౌండ్‌తో పోలిస్తే సెంచరీ దాటేసింది.
     
     బ్లాక్ ఫ్రైడే..పానిక్ మండే...ఆ రెండురోజుల్లో నిలువునా పతనమైన మార్కెట్ తీరును ఇన్వెస్టర్లు మర్చిపోకముందే...వెన్స్‌డే వర్రీని పెంచేసింది. మూడు రోజుల క్షీణత తర్వాత బుధవారం ట్రేడింగ్ తొలిదశలో 321 పాయింట్లు ర్యాలీ జరిపిన బీఎస్‌ఈ సెన్సెక్స్ మధ్యాహ్న సెషన్ నుంచి నాటకీయంగా పతనబాటపట్టి మరో 340 పాయింట్లు పతనమయ్యింది. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడానికి క్రితం రోజు రిజర్వుబ్యాంక్ బాండ్ల కొనుగోలును ప్రకటించడంతో తొలుత 18,567 పాయింట్లకు ర్యాలీ జరిపింది. అటుతర్వాత విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెరిపిలేకుండా అమ్మకాలు జరపడంతో 17,807 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు 340 పాయింట్ల నష్టంతో 11 నెలల కనిష్టస్థాయి 17.906 పాయింట్ల వద్ద ముగిసింది.
     
     రోజులో గరిష్టస్థాయి నుంచి 760 పాయింట్లు సూచీ పతనమయ్యింది. గతేడాది ఆగస్టు 21న 17,885 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్, ఈ ఏడాది ఇదేరోజున అదేస్థాయి వద్ద క్లోజ్‌కావడం కాకతాళీయంగా జరిగింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5,504 పాయింట్ల గరిష్టం నుంచి 5,260 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు 99 పాయింట్ల నష్టంతో ఏడాది కనిష్టస్థాయి 5,302 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం సైతం రూ. లక్ష కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.  రూపాయిని బలోపేతం చేసే ఉద్దేశ్యంతో రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, కరెన్సీ విలువ నానాటికీ కొత్త కనిష్టస్థాయికి పతనంకావడంతో ఆందోళన చెందుతున్న ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతున్నారని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా అధిక నష్టాల్ని చవిచూస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో షేర్లను కుమ్మరిస్తున్నారని ఆ వర్గాలు వివరించాయి.  బుధవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 792 కోట్ల విలువైన నికర విక్రయాలు జరపగా, దేశీయ సంస్థలు రూ. 775 కోట్ల షేర్లను నికరంగా కొనుగోలుచేశాయి. ఆర్థిక ఉద్దీపనలో భాగంగా బాండ్ల కొనుగోళ్ల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రతీ నెలా అమెరికా కేంద్ర బ్యాంక్ విడుదల చేస్తున్న భారీ నిధుల మొత్తాన్ని వచ్చే నెల నుంచి క్రమేపీ తగ్గిస్తుందన్న భయాలు కూడా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమని,  దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి వీరి నిధుల ఉపసంహరణ ఫలితంగా రూపాయి మరింత పడిపోతున్నదని విశ్లేషకులు చెప్పారు.  
     
     రిలయన్స్, ఐటీసీ కలిసి...
     3-4% క్షీణించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీలు కలిసి సెన్సెక్స్‌లో 176 పాయింట్లను నష్టపర్చాయి. అన్నింటికంటే అధికంగా ర్యాన్‌బాక్సీ 10% పతనంకాగా, మరో ఫార్మా షేరు సన్‌ఫార్మా 4% తగ్గింది. సిమెంటు షేర్లు ఏసీసీ, గుజరాత్ అంబూజా 5% చొప్పున పతనమయ్యాయి. సేసా గోవా 9%, భారతీ 5% తగ్గాయి. బ్యాంకింగ్ షేర్లు స్వల్పలాభాలతో ముగిసినా, రోజులో గరిష్టస్థాయి నుంచి 5% పైగా పడిపోయాయి. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ తదితర పీఎస్‌యూ బ్యాంకు షేర్లయితే గరిష్టం నుంచి 15 శాతంపైగా పతనమయ్యాయి. 193 షేర్లు 52 వారాల కనిష్టస్థాయికి పడిపోయాయి.
     
     100 బిలియన్ డాలర్లు...4.35 లక్షల కోట్లు
     ఇన్వెస్టర్ల సంపద ఈ నాలుగు రోజుల్లో 100 బిలియన్ డాలర్లకుపైగా ఆవిరైపోయింది. రూపాయిల్లో ఈ విలువ రూ. 4.35 లక్షల కోట్లు.  గత 4 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,400 పాయింట్లు పతనంకాగా, 1,025 బిలియన్ డాలర్ల నుంచి 900 బిలియన్ డాలర్లకు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ హరించుకుపోయింది. రూపాయిల్లో మార్కెట్ ప్రస్తుత విలువ రూ. 58,60,000 కోట్లు. రూపాయి క్షీణించిన కారణంగా విదేశీ ఇన్వెసర్లకు నష్టం ఎక్కువగా వచ్చింది. శుక్రవారం నుంచి ఇప్పటివరకూ భారత్ స్టాక్ మార్కెట్ 7.56 శాతం నష్టపోగా, రూపాయి మారకపు విలువ 61.80 నుంచి 64.11 స్థాయికి పతనంకావడంతో విదేశీ ఇన్వెస్టర్లకు నష్టం 11 శాతంపైగా వుంది. ఇది ఎలాగంటే...ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్ 100 షేర్లను గత గురువారం రూపాయి విలువ 61.80 వున్నపుడు రూ. 900 ధరతో కొంటే 1456 డాలర్లు (90,000) అవసరమవుతుంది. ఈ బుధవారం ఆ షేరును రూ. 830 వద్ద విక్రయిస్తే 1,294 డాలర్లు మాత్రమే (రూపాయి విలువ 64.11 ప్రకారం) వస్తాయి. అంటే ఆ షేరులో 162 డాలర్లు (11.12%) నష్టపోవాల్సివస్తుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement