
న్యూఢిల్లీ: ఆర్థికంగా బలహీనంగా ఉన్న బ్యాంకులను చక్కదిద్దడానికి ఉద్దేశించిన ‘దిద్దుబాటు చర్యల’ (పీసీఏ) మార్గదర్శకాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు, వాటి ఫలితాలను సమీక్షించిన అనంతరం, బ్యాంకింగ్ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు ఉంటాయి. కొద్ది వారాల్లో ఇందుకు సంబంధించి నిర్ణయాలు వెలువడతాయి. మంగళవారం జరిగిన ఆర్‌బీఐ 18 మంది సభ్యుల బోర్డ్ సమావేశం ఈ వార్తల నేపథ్యం. పీసీఏ నిబంధనల గురించి ఈ బోర్డ్ సమావేశం చర్చించినట్లు తెలుస్తోంది. పీసీఏ మార్గదర్శకాల పరిధిలో దాదాపు 11 బ్యాంకులు ఉన్నాయి.
దేనాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌తోపాటు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ పదకొండు బ్యాంకుల్లో ఉన్నాయి. వీటిలో రెండు బ్యాంకులు– దేనాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ వ్యాపార విస్తరణ నియంత్రణలను సైతం ఎదుర్కొంటున్నాయి. ఈ మార్గదర్శకాలు కొంత సరళతరం చేయాలని బ్యాంకులు ఇప్పటికే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇందుకు ఆర్‌బీఐ ససేమిరా అంది. కాగా జూన్ త్రైమాసికం ముగిసేనాటికి బ్యాంకింగ్ వ్యవస్థ రుణాల్లో మొండిబకాయిలు 11.6 శాతం దాటిన (రూ.12 లక్షల కోట్లు) సంగతి తెలిసిందే. పలు భారీ మొండి అకౌంట్లు ఎన్‌సీఎల్‌టీ విచారణలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment