ప్రజలపై మొండి బాకీల బండ ! | RBI governor Raghuram Rajan urges global crisis 'safety net' | Sakshi
Sakshi News home page

ప్రజలపై మొండి బాకీల బండ !

Published Fri, Apr 11 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

ప్రజలపై మొండి బాకీల బండ !

ప్రజలపై మొండి బాకీల బండ !

విశ్లేషణ: బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్‌బీఐకి సంపూర్ణ నియంత్రణాధికారం ఉంటుంది. ప్రతి బ్యాంకు నిర్వహణకు ఒక బోర్డు, దానిలో ఆర్‌బీఐ అధికారి సభ్యుడిగా ఉంటారు. బ్యాంకింగ్ వ్యవస్థ దారితప్పుతుంటే ఆర్‌బీఐ ప్రతినిధులు నిద్రపోతున్నారా లేక వారు కూడా బ్యాంకుల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారా? బకాయిలు పెరిగిపోతుంటే ఆర్‌బీఐ ఏం చేస్తోంది?
 
 అమెరికాలో 2008లో బడా బ్యాంకుల్లో మొండి బాకీలు పేరుకుపోవడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు మన దేశంలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థను మొండి బకాయిలు తీవ్రంగా కుదిపేస్తున్నాయన్న విషయంలో స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో మూడునాలుగుసార్లయినా ఆయన బ్యాంకర్లతో సమావేశాలు జరిపి బ్యాంకులను హెచ్చరిస్తూ వచ్చారు. ఒకపక్క ఎన్ని హెచ్చరికలు చేసినా మరోవైపు మొండి బకాయిలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉదాహరణకు నాలుగేళ్ల క్రితం బ్యాంకులిచ్చిన రుణాల్లో మొండి బకాయిల శాతం 2.4 శాతం ఉండగా నేడది 4.5 శాతానికి పెరిగింది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తాయి. బ్యాంకుల అస్తవ్యస్త నిర్వహణ, రాజకీయ ఒత్తిళ్లు, రిజర్వు బ్యాంకు వైఫల్యం, అవినీతి అసలు కారణాలు. దేశంలో మాంద్య పరిస్థితులు నెలకొనటంతో రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించలేకపోవడం వల్లనే మొండి బాకీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న చిదంబరమే పరోక్షంగా అప్పులు ఎగవేస్తున్నవారికి వత్తాసు పలుకుతున్నారు.
 
 ఈ మొండి బకాయిలు రూ. లక్షల కోట్లలో ఉన్నాయి. రుణాలమీద వడ్డీలను తగ్గించాలని గట్టిగా పట్టుబడుతున్న కార్పొరేట్లు వడ్డీల భారాన్ని తట్టుకోలేక తాము రుణాలను చెల్లించలేకపోతున్నామని చెపుతున్నారు. దువ్వూరి సుబ్బారావు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించడం కన్నా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. కాని ఆర్థిక మంత్రి చిదంబరం మాత్రం కార్పొరేట్ రంగానికి దన్నుగా నిలిచారు. వడ్డీ రేట్లు తగ్గించి కార్పొరేట్లకు ఉపశమనం కలిగించాలని బాహాటంగా ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఆయన్ని దువ్వూరి ఖాతరు చే యలేదు. వీరిద్దరి మధ్య వివాదం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఈ వివాదాన్ని వాటంగా తీసుకున్న కార్పొరేట్లు అసలుకూ, వడ్డీకీ ఎసరు పెట్టడం ప్రారంభించారు. ఇలా మొండి బకాయిలు పెరగడానికి కేంద్రమే కారణమని చెప్పాలి.
 
 ప్రపంచ కుబేరుల జాబితాలోకి ఎక్కిన కార్పొరేట్లకూ, సంపన్నులకూ ఈ దేశంలో రూ. రెండు లక్షల కోట్లకుపైగా ఉన్న మొండి బకాయిలను చెల్లించడం ఒక లెక్కా? వీరు ఆఫ్రికాలో భూములు కొనడానికీ, విదేశాల్లో కంపెనీలను కొనేయడానికీ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తాము ఎన్నికకావటానికి, తమ విధానాన్ని సమర్థించేవారికి రూ. లక్షల కోట్ల అందించేవారికి బ్యాంకులకు రూ. రెండు లక్షల కోట్లు చెల్లించటం ఒక లెక్కా? ప్రభుత్వ నేతలే తమకు వత్తాసు పలుకుతుంటే వారు బ్యాంకులను ఎందుకు ఖాతరు చేస్తారు? రాజకీయ నాయకులకూ, మంత్రులకూ, ఇటు కేంద్రంలో, అటు బ్యాంకుల్లో ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులకు ఉన్న సంబంధాల దృష్ట్యా బ్యాంకుల్లో కూడా అవినీతి చోటుచేసుకుంది. ప్రభుత్వరంగంలో బ్యాంకులు ఉండటం కేంద్రంలో నేతలకు ఎంతో అవసరం. అయి తే ఇక్కడ మరో వాదన ఉంది. విదేశీ బ్యాంకులు మన దేశంలో అనుబంధ బ్యాంకులను తెరవడానికీ, దేశంలో ప్రైవేటురంగంలో కొత్త బ్యాంకింగ్ లెసైన్సులు ఇవ్వడానికీ ప్రభుత్వరంగ బ్యాంకులు అవరోధాలు కల్పించాయి.
 
 ప్రభుత్వరంగంలోనే బ్యాంకింగ్ వ్యవస్థ కొనసాగాలని ఉద్యోగులు కూడా గట్టిగా పోరాడుతున్నారు. మొండిబకాయిలను ఇలాగే పెరగనిచ్చి ప్రభుత్వరంగ బ్యాంకులకు అసమర్థత అంటగట్టి ప్రైవేటీకరణ కూ, విదేశీ బ్యాంకుల ప్రవేశానికీ రాచబాట వేస్తున్నారా? పెరుగుతున్న మొండి బకాయిలను మరిం తగా పెరగనివ్వటంలో ఇలాంటి కుట్ర ఏమైనా ఉందా? నయా ఉదారవాదవిధానాన్ని తమ ప్రభుత్వవిధానంగా చేపట్టడంలో ఇలాంటి మతలబులు అతిసామాన్యం. బ్యాంకింగ్ వ్యవస్థపై రిజర్వు బ్యాంకుకు సంపూర్ణ నియంత్రణాధికారం ఉంటుంది. ప్రతి బ్యాంకు నిర్వహణకు ఒక బోర్డు, దానిలో ఆర్‌బీఐ అధికారి సభ్యుడిగా ఉంటారు. బ్యాంకింగ్ వ్యవస్థ దారితప్పుతుంటే ఆర్‌బీఐ ప్రతినిధులు నిద్రపోతున్నారా లేక వారు కూడా బ్యాంకుల యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్నారా? మొండి బకాయిలు కొండలా పెరిగిపోతుంటే ఆర్‌బీఐ ఏం చేస్తోంది?
 
 మీ ఇంట్లో చోరీ చేయబోయిన వ్యక్తి పట్టుబడితే ఓ స్తంభానికి కట్టేసి చిత గ్గొడతారు. తర్వాతే పోలీసులకు అప్పగిస్తారు కదా. ఇదే బ్యాంకింగ్ రంగానికి వర్తింప చేయండి. కంపెనీలు బ్యాంకుల నుండి కోట్లాది రూపాయలు రుణాలు తీసుకుని మాంద్య పరిస్థితులను బూచిగా చూపించి తిరిగి చెల్లించకుండా తాత్సారం చేస్తున్నాయి. కాని ఆ కంపెనీల లాభాలు మాత్రం తగ్గటం లేదు. రుణం చెల్లించనివారెవరో తెలుసు. ఎంత చెల్లించాలో కూడా తెలుసు. అయినా గప్‌చుప్ సాంబారుబుడ్డి అన్నట్లు ఆ రుణాల మొత్తం పెరిగిపోతోం ది. అలా ఎగ్గొట్టినవాళ్లు భుజాలెగరేసుకుని తిరుగుతున్నారు. వారి ఆస్తులను వేలం వేసి రుణం చెల్లింపులో జమ చేయవచ్చుకదా? పైన చెప్పిన ఉదాహరణలో దొంగను పోలీసుకు అప్పచెప్పినట్లు ప్రభుత్వంగాని, బ్యాంకు యాజమాన్యాలుగాని  ఎందుకు చర్య తీసుకోవు? ఒక బడుగు రైతు అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే, అతని ఇంట్లో వస్తువులను బయటకు విసిరేసి, ఇంటికి తాళం వేస్తారే! అదే పని కార్పొరేట్ల విషయంలో ఎందుకు చెయ్య రు? పాలకులకూ, కార్పొరేట్లకూ మధ్య ఉన్న బీరకాయ పీచు చుట్టరికం అలాంటిది. రుణం తీర్చలేక పరువు పోతుందని లక్షలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్లకు ఆపాటి పరువుమర్యాదలుండవా?
 
 రుణ గ్రహీతలు సకాలంలో చెల్లించకపోతే ఏం చేయాలో ఆర్‌బీఐ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వడ్డీ చెల్లించనక్కర్లేదు, అసలైనా చెల్లించవచ్చని రుణగ్రహీతలకు వెసులుబాటు కల్పించింది. సకాలంలో చెల్లించని వారి రుణాల పునర్‌వ్యవస్థీకరణకు బ్యాంకు బోర్డులకు అధికారమిచ్చింది. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయిలే రూ. 67,799 కోట్లుగా ఉన్నాయని అంచనా. దేశంలో మొత్తం బ్యాంకుల మొండి బాకీలు రూ.రెండు లక్షల కోట్లు. ఇలాంటి రుణాలను కొన్ని సంస్థలు రిస్కుతో తక్కువ రేటుకు కొనుగోలు చేసి తర్వాత తమదైన పద్ధతిలో వాటిని వసూలు చేసుకుంటాయి. భవిష్యత్తులో బ్యాంకులు కూడా తమ రుణాలను ఈ దారిలో అమ్మకానికి పెట్టుకుని తమ భారాన్ని వదిలించుకుంటాయి. దీనర్ధం ఏమంటే... కార్పొరేట్లపై ఎలాంటి భారం పడదు. వారు క్షేమంగానే ఉంటారు. పోయేది ప్రజల డబ్బే.
 
 పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్లు బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు క్షేమంగానే ఉంటారని ఈ విశ్లేషణ తెలియజేస్తుంది. అసలు కేంద్రమే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ప్రపంచబ్యాంకు బిలియన్ డాలర్లమేర రుణాలిస్తూనే ఉంది. వాటిపై ఏటా కేంద్రం కోట్లాది రూపాయలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ బ్యాంకు అసలు మొత్తం వసూలు గురించి పట్టించుకోదు. ఎందుచేతనంటే అసలు చెల్లింపు పట్టించుకోనంతకాలం కేంద్రప్రభుత్వం జుట్టు ఆ బ్యాంకు చేతుల్లో ఉంటుంది మరి.
 
 ప్రభుత్వరంగ బ్యాంకులో తమ సొమ్ముకు భద్రత ఉంటుందన్న నమ్మకంతో దేశంలోని ప్రజలు తమ డిపాజిట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలను దాచుకుంటున్నారు. కార్పొరేట్లకూ, కుబేరులకూ బ్యాంకులు ఇచ్చే రుణాలు ఈ మొత్తం నుంచే. వారు రుణం చెల్లించకపోతే ప్రమాదంలో పడేది ప్రజల డబ్బే. ప్రజల డబ్బు సురక్షితంగా ఉండాలన్న లక్ష్యం కోసమే బ్యాంకు అధికారులూ, ఉద్యోగులూ సమ్మెలు చేస్తుంటారు. ఈ రుణాల వసూలు విషయంలో ప్రస్తుత సర్కారు మెతకవైఖరి అవలంబిస్తోంది. ఈ మొండి బకాయిలు చెల్లించనివారే మోడీ పల్లకీ మోస్తున్నారు. ఆ మోడీతో ఈ ఎన్నికల్లో చేతులు కలుపుతున్నది చంద్రబాబు, లోక్‌సత్తా, కుర్ర‘నాయకుడు’ పవన్. వీరిని మళ్లీ గద్దెనెక్కించి మరో ఐదేళ్లు కుంపటినెత్తిన పెట్టుకుంటారో... లేదో... మీ ఇష్టం.
- (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
 వి.హనుమంతరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement