V. Hanumanthu rao
-
ప్రజలపై మొండి బాకీల బండ !
విశ్లేషణ: బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐకి సంపూర్ణ నియంత్రణాధికారం ఉంటుంది. ప్రతి బ్యాంకు నిర్వహణకు ఒక బోర్డు, దానిలో ఆర్బీఐ అధికారి సభ్యుడిగా ఉంటారు. బ్యాంకింగ్ వ్యవస్థ దారితప్పుతుంటే ఆర్బీఐ ప్రతినిధులు నిద్రపోతున్నారా లేక వారు కూడా బ్యాంకుల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారా? బకాయిలు పెరిగిపోతుంటే ఆర్బీఐ ఏం చేస్తోంది? అమెరికాలో 2008లో బడా బ్యాంకుల్లో మొండి బాకీలు పేరుకుపోవడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు మన దేశంలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థను మొండి బకాయిలు తీవ్రంగా కుదిపేస్తున్నాయన్న విషయంలో స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో మూడునాలుగుసార్లయినా ఆయన బ్యాంకర్లతో సమావేశాలు జరిపి బ్యాంకులను హెచ్చరిస్తూ వచ్చారు. ఒకపక్క ఎన్ని హెచ్చరికలు చేసినా మరోవైపు మొండి బకాయిలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉదాహరణకు నాలుగేళ్ల క్రితం బ్యాంకులిచ్చిన రుణాల్లో మొండి బకాయిల శాతం 2.4 శాతం ఉండగా నేడది 4.5 శాతానికి పెరిగింది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తాయి. బ్యాంకుల అస్తవ్యస్త నిర్వహణ, రాజకీయ ఒత్తిళ్లు, రిజర్వు బ్యాంకు వైఫల్యం, అవినీతి అసలు కారణాలు. దేశంలో మాంద్య పరిస్థితులు నెలకొనటంతో రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించలేకపోవడం వల్లనే మొండి బాకీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న చిదంబరమే పరోక్షంగా అప్పులు ఎగవేస్తున్నవారికి వత్తాసు పలుకుతున్నారు. ఈ మొండి బకాయిలు రూ. లక్షల కోట్లలో ఉన్నాయి. రుణాలమీద వడ్డీలను తగ్గించాలని గట్టిగా పట్టుబడుతున్న కార్పొరేట్లు వడ్డీల భారాన్ని తట్టుకోలేక తాము రుణాలను చెల్లించలేకపోతున్నామని చెపుతున్నారు. దువ్వూరి సుబ్బారావు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించడం కన్నా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. కాని ఆర్థిక మంత్రి చిదంబరం మాత్రం కార్పొరేట్ రంగానికి దన్నుగా నిలిచారు. వడ్డీ రేట్లు తగ్గించి కార్పొరేట్లకు ఉపశమనం కలిగించాలని బాహాటంగా ఆర్బీఐకి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఆయన్ని దువ్వూరి ఖాతరు చే యలేదు. వీరిద్దరి మధ్య వివాదం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఈ వివాదాన్ని వాటంగా తీసుకున్న కార్పొరేట్లు అసలుకూ, వడ్డీకీ ఎసరు పెట్టడం ప్రారంభించారు. ఇలా మొండి బకాయిలు పెరగడానికి కేంద్రమే కారణమని చెప్పాలి. ప్రపంచ కుబేరుల జాబితాలోకి ఎక్కిన కార్పొరేట్లకూ, సంపన్నులకూ ఈ దేశంలో రూ. రెండు లక్షల కోట్లకుపైగా ఉన్న మొండి బకాయిలను చెల్లించడం ఒక లెక్కా? వీరు ఆఫ్రికాలో భూములు కొనడానికీ, విదేశాల్లో కంపెనీలను కొనేయడానికీ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తాము ఎన్నికకావటానికి, తమ విధానాన్ని సమర్థించేవారికి రూ. లక్షల కోట్ల అందించేవారికి బ్యాంకులకు రూ. రెండు లక్షల కోట్లు చెల్లించటం ఒక లెక్కా? ప్రభుత్వ నేతలే తమకు వత్తాసు పలుకుతుంటే వారు బ్యాంకులను ఎందుకు ఖాతరు చేస్తారు? రాజకీయ నాయకులకూ, మంత్రులకూ, ఇటు కేంద్రంలో, అటు బ్యాంకుల్లో ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులకు ఉన్న సంబంధాల దృష్ట్యా బ్యాంకుల్లో కూడా అవినీతి చోటుచేసుకుంది. ప్రభుత్వరంగంలో బ్యాంకులు ఉండటం కేంద్రంలో నేతలకు ఎంతో అవసరం. అయి తే ఇక్కడ మరో వాదన ఉంది. విదేశీ బ్యాంకులు మన దేశంలో అనుబంధ బ్యాంకులను తెరవడానికీ, దేశంలో ప్రైవేటురంగంలో కొత్త బ్యాంకింగ్ లెసైన్సులు ఇవ్వడానికీ ప్రభుత్వరంగ బ్యాంకులు అవరోధాలు కల్పించాయి. ప్రభుత్వరంగంలోనే బ్యాంకింగ్ వ్యవస్థ కొనసాగాలని ఉద్యోగులు కూడా గట్టిగా పోరాడుతున్నారు. మొండిబకాయిలను ఇలాగే పెరగనిచ్చి ప్రభుత్వరంగ బ్యాంకులకు అసమర్థత అంటగట్టి ప్రైవేటీకరణ కూ, విదేశీ బ్యాంకుల ప్రవేశానికీ రాచబాట వేస్తున్నారా? పెరుగుతున్న మొండి బకాయిలను మరిం తగా పెరగనివ్వటంలో ఇలాంటి కుట్ర ఏమైనా ఉందా? నయా ఉదారవాదవిధానాన్ని తమ ప్రభుత్వవిధానంగా చేపట్టడంలో ఇలాంటి మతలబులు అతిసామాన్యం. బ్యాంకింగ్ వ్యవస్థపై రిజర్వు బ్యాంకుకు సంపూర్ణ నియంత్రణాధికారం ఉంటుంది. ప్రతి బ్యాంకు నిర్వహణకు ఒక బోర్డు, దానిలో ఆర్బీఐ అధికారి సభ్యుడిగా ఉంటారు. బ్యాంకింగ్ వ్యవస్థ దారితప్పుతుంటే ఆర్బీఐ ప్రతినిధులు నిద్రపోతున్నారా లేక వారు కూడా బ్యాంకుల యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్నారా? మొండి బకాయిలు కొండలా పెరిగిపోతుంటే ఆర్బీఐ ఏం చేస్తోంది? మీ ఇంట్లో చోరీ చేయబోయిన వ్యక్తి పట్టుబడితే ఓ స్తంభానికి కట్టేసి చిత గ్గొడతారు. తర్వాతే పోలీసులకు అప్పగిస్తారు కదా. ఇదే బ్యాంకింగ్ రంగానికి వర్తింప చేయండి. కంపెనీలు బ్యాంకుల నుండి కోట్లాది రూపాయలు రుణాలు తీసుకుని మాంద్య పరిస్థితులను బూచిగా చూపించి తిరిగి చెల్లించకుండా తాత్సారం చేస్తున్నాయి. కాని ఆ కంపెనీల లాభాలు మాత్రం తగ్గటం లేదు. రుణం చెల్లించనివారెవరో తెలుసు. ఎంత చెల్లించాలో కూడా తెలుసు. అయినా గప్‌చుప్ సాంబారుబుడ్డి అన్నట్లు ఆ రుణాల మొత్తం పెరిగిపోతోం ది. అలా ఎగ్గొట్టినవాళ్లు భుజాలెగరేసుకుని తిరుగుతున్నారు. వారి ఆస్తులను వేలం వేసి రుణం చెల్లింపులో జమ చేయవచ్చుకదా? పైన చెప్పిన ఉదాహరణలో దొంగను పోలీసుకు అప్పచెప్పినట్లు ప్రభుత్వంగాని, బ్యాంకు యాజమాన్యాలుగాని ఎందుకు చర్య తీసుకోవు? ఒక బడుగు రైతు అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే, అతని ఇంట్లో వస్తువులను బయటకు విసిరేసి, ఇంటికి తాళం వేస్తారే! అదే పని కార్పొరేట్ల విషయంలో ఎందుకు చెయ్య రు? పాలకులకూ, కార్పొరేట్లకూ మధ్య ఉన్న బీరకాయ పీచు చుట్టరికం అలాంటిది. రుణం తీర్చలేక పరువు పోతుందని లక్షలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్లకు ఆపాటి పరువుమర్యాదలుండవా? రుణ గ్రహీతలు సకాలంలో చెల్లించకపోతే ఏం చేయాలో ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వడ్డీ చెల్లించనక్కర్లేదు, అసలైనా చెల్లించవచ్చని రుణగ్రహీతలకు వెసులుబాటు కల్పించింది. సకాలంలో చెల్లించని వారి రుణాల పునర్వ్యవస్థీకరణకు బ్యాంకు బోర్డులకు అధికారమిచ్చింది. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయిలే రూ. 67,799 కోట్లుగా ఉన్నాయని అంచనా. దేశంలో మొత్తం బ్యాంకుల మొండి బాకీలు రూ.రెండు లక్షల కోట్లు. ఇలాంటి రుణాలను కొన్ని సంస్థలు రిస్కుతో తక్కువ రేటుకు కొనుగోలు చేసి తర్వాత తమదైన పద్ధతిలో వాటిని వసూలు చేసుకుంటాయి. భవిష్యత్తులో బ్యాంకులు కూడా తమ రుణాలను ఈ దారిలో అమ్మకానికి పెట్టుకుని తమ భారాన్ని వదిలించుకుంటాయి. దీనర్ధం ఏమంటే... కార్పొరేట్లపై ఎలాంటి భారం పడదు. వారు క్షేమంగానే ఉంటారు. పోయేది ప్రజల డబ్బే. పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్లు బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు క్షేమంగానే ఉంటారని ఈ విశ్లేషణ తెలియజేస్తుంది. అసలు కేంద్రమే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ప్రపంచబ్యాంకు బిలియన్ డాలర్లమేర రుణాలిస్తూనే ఉంది. వాటిపై ఏటా కేంద్రం కోట్లాది రూపాయలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ బ్యాంకు అసలు మొత్తం వసూలు గురించి పట్టించుకోదు. ఎందుచేతనంటే అసలు చెల్లింపు పట్టించుకోనంతకాలం కేంద్రప్రభుత్వం జుట్టు ఆ బ్యాంకు చేతుల్లో ఉంటుంది మరి. ప్రభుత్వరంగ బ్యాంకులో తమ సొమ్ముకు భద్రత ఉంటుందన్న నమ్మకంతో దేశంలోని ప్రజలు తమ డిపాజిట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలను దాచుకుంటున్నారు. కార్పొరేట్లకూ, కుబేరులకూ బ్యాంకులు ఇచ్చే రుణాలు ఈ మొత్తం నుంచే. వారు రుణం చెల్లించకపోతే ప్రమాదంలో పడేది ప్రజల డబ్బే. ప్రజల డబ్బు సురక్షితంగా ఉండాలన్న లక్ష్యం కోసమే బ్యాంకు అధికారులూ, ఉద్యోగులూ సమ్మెలు చేస్తుంటారు. ఈ రుణాల వసూలు విషయంలో ప్రస్తుత సర్కారు మెతకవైఖరి అవలంబిస్తోంది. ఈ మొండి బకాయిలు చెల్లించనివారే మోడీ పల్లకీ మోస్తున్నారు. ఆ మోడీతో ఈ ఎన్నికల్లో చేతులు కలుపుతున్నది చంద్రబాబు, లోక్‌సత్తా, కుర్ర‘నాయకుడు’ పవన్. వీరిని మళ్లీ గద్దెనెక్కించి మరో ఐదేళ్లు కుంపటినెత్తిన పెట్టుకుంటారో... లేదో... మీ ఇష్టం. - (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) వి.హనుమంతరావు -
బడ్జెట్ కాదు... బలిపీఠం!
సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తన బడ్జెట్లో ఆమ్ఆద్మీకి మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకోకపోగా సామాన్యుడినే వధ్యశిలపై నిలబెట్టారు. ఒకప్పుడు డ్రీమ్‌బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. తాజాగా చిదంబరం వెలువరించిన ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమ్ఆద్మీ పాలిట పీడకల లాంటిదే. ఆమ్ఆద్మీ అనే పదాన్ని రూపొందించినదీ, ప్రచారంలో పెట్టిందీ కాంగ్రెస్ పార్టీయే. కాని దాన్ని ఆచరణలో పెట్టలేదు. గత బడ్జెట్లలో చేసిన కేటాయింపుల ఫలితాలు ప్రజలకు చేరకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అనే కాకి ఎత్తుకుపోయింది. అయినా, కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కాలేదనడానికి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్టే తిరుగులేని ఉదాహరణ. ధరల పెరుగుదల నుంచి ఉపశమనం కలిగించడానికి ఆయనకు కార్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, లారీలు, మొబైల్ ఫోన్లు ఉన్నవారే కనిపించారు. ఈ చర్యల ద్వారా వీటిని ఉత్పత్తి చేసే కంపెనీల అధిపతులు, వినియోగించే ఉన్నత, మధ్య తరగతి వారే లాభం పొందుతారు. బడ్జెట్లో ఆమ్ఆద్మీ కనిపించలేదు. అవును, డ్రీమ్ బడ్జెట్లు ప్రవేశపెట్టిన వారికి వారెలా కనిపిస్తారు? రేపో, మాపో ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ ఓట్ల కోసమైనా, వాళ్లకేదైనా మేలు చేయకపోతే, వాళ్ల ఓట్లు తన పార్టీకి రావనే ఆలోచన అయినా రాలేదంటే, కాంగ్రెస్ నాయకులూ, ఆ పార్టీ నాయకుడు చిదంబరం ఎంత పాషాణ హృదయం కలవారో ఓటర్లు గమనించాలి. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమ్ ఆద్మీ పట్ల అదే ధోరణిని ప్రతిబింబిస్తుంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, యువత, సంపన్నుల ఓట్లను కొల్లగొట్టుకోవడంపైనే ఆయన దృష్టి పెట్టారు. వీరిలో అత్యధికులు పడక కుర్చీ రాజకీయవేత్తలు, మేధావులు. ఇలాంటి వారు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి క్యూలో నిల్చుంటారా? రాయితీల నజరానా పారిశ్రామిక రంగాన్ని చూస్తే, స్వాతంత్య్రం వచ్చిన మొదటి రెండు మూడు దశాబ్దాలలో పారిశ్రామికీకరణ కోసం ప్రభుత్వం వైపు చూశారేమోగాని, ఆ తర్వాత బలం పుంజుకుని ప్రభుత్వాన్నే తమ వైపు చూసే స్థాయికి ఎదిగారు. బెల్లం ఎక్కడ ఉంటే చీమలు అక్కడ చేరతాయన్నట్లు ప్రజాసేవ పేరుతో నాయకులు, వినాయకులు డబ్బు సంపాదనకు పాల్పడటంతో పారిశ్రామికవేత్తలు ఈ బలహీనతను సొమ్ము చేసుకోవడానికి డబ్బు విరజిమ్మి తమ పనులు చేయించుకోవటం ప్రారంభించడంతో ఇద్దరి మధ్య వారధి ఏర్పడింది. అవినీతే ఆ వారధి. కార్పొరేట్లకు ఊడిగం చేయడం, వారి మీద బరువు భారాలు తగ్గించడం, పన్నుల రాయితీలు ఖజానాకు చిల్లుపడినా మనం చెల్లించే పన్నుల సొమ్ముతో రాయితీలు ప్రకటించడం గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆనవాయితీగా మారింది. బడ్జెట్ సందర్భంగా ఇచ్చే పుస్తకాలలోని ఒక పుస్తకంలో రాయితీలు ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో లెక్కలిస్తారు. గత నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది సుమారు రూ. 5 లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకు రాయితీలందుతున్నాయి. ఈ బడ్జెట్‌తోపాటు ఆ పుస్తకం అందజేయలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇవ్వకపోయి ఉండవచ్చు. కానీ గత సంవత్సరం డిసెంబర్ 12న పార్లమెంటులో ఒక ప్రశ్నకు జవాబిస్తూ అలాంటి పన్నుల మినహాయింపు వల్ల ఖజానాకు గండిపడిన మొత్తం రూ.4.82 లక్షల కోట్లు! ఇదీ మనం పన్నుల రూపంలో చెల్లించే ఆదాయానికి పట్టిన గతి. పార్లమెంటులోనూ, బయటా అటు మంత్రులకూ, ప్రభుత్వానికీ, గులాంగిరీ చేసే ఆర్థికశాస్త్రవేత్తలు, బయట నుంచి ప్రపంచబాంకు సబ్సిడీలు తగ్గించాలని, రద్దు చేయాలని చెవినిల్లు కట్టుకొని ఒకటే నస. కానీ కార్పొరేట్లకు పన్ను మినహాయింపు(సబ్సిడీకి ఇదో మారుపేరు) పేరిట ఇస్తున్న రూ.లక్షల కోట్లపై అందరూ గప్‌చుప్. కానీ ఏవో పేర్లతో ప్రభుత్వం సబ్సిడీని పెంచుతుంది. అయితే, ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, పెంచిన సబ్సిడీ హరాయించుకుపోతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెంచితే, ఉద్యోగిత లభిస్తే, సబ్సిడీలు ఇవ్వాల్సిన పనే ఉండదు. ప్రభుత్వం ఆ పని చేయదు. ఎందుచేతనంటే ప్రజలు తమ కాళ్ల మీద నిలబడగలిగితే చదువు సంధ్యలు వస్తే పాలకుల ఓటు బ్యాంకు మాయమైపోతుంది. వాళ్ల కుర్చీలు కదలిపోతాయి. ఇదేమి నిర్వాకం దేశాన్ని కొన్నేళ్లుగా ద్రవ్యలోటు వెంటాడుతోంది. ఈ ద్రవ్యలోటును అదుపు చేయగలిగామని చిదంబరం జబ్బలు చరచుకొంటున్నారు. తాను ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టినట్టుగా అందరూ అనుకోవాలన్నది ఆయన ఆలోచన. కానీ ఎకానమీని ఎలా మేనేజ్ చేశాడని పరిశీలిస్తే... కొన్ని పీఎస్‌యూల వద్ద ఉన్న నిధులను పిండి, సామాజిక సేవల కేటాయింపులకు కోత పెట్టి, ఇతర రంగాలకు చేసిన కేటాయింపులను తగ్గించడం ద్వారా ఈ ద్రవ్యలోటును 4.8 శాతం నుంచి 4.6 శాతానికి నియంత్రించగలిగారు. ఆర్థికవ్యవస్థను చక్కదిద్దడమంటే ఇదేనా? సామాజిక సేవలకు చేసిన కేటాయింపులకు కోతపెట్టడం దారుణం. సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం చేసే వ్యయంలో ప్రతి రూపాయిలో 15 పైసలే చివరకు లబ్ధిదారులకు చేరుతుందని ఒక సందర్భంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరం ఆ సామాజిక సేవలకు చేసిన కేటాయింపుల్లో కోత విధించటం, ఆ విధంగా ఆదా అయిన సొమ్మును ద్రవ్యలోటును పూడ్చడానికి వినియోగించటం పూర్తిగా అనైతికం, అన్యాయం. ఉదాహరణకు ఈ బడ్జెట్ ప్రకారమే మంచినీరు, పారిశుద్ధ్యం కోసం చేసిన కేటాయింపును 21.3 శాతం తగ్గించటం, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం కేటాయింపు 20.6 శాతం కోత, గృహ నిర్మాణం, పట్టణాల అభివృద్ధికి కేటాయింపు 41.3 శాతం, మానవవనరుల అభివృద్ధికి 6 శాతం, రోడ్డు రవాణా, ప్రధానరహదారులకు 72 శాతం, గ్రామీణాభివృద్ధికి 22.92 శాతం తగ్గించారని బడ్జెట్ నుంచి బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఉదహరించారు. ఆఖరుకు తనతోటి మంత్రి అయిన హోంశాఖకు కూడా 31.39 శాతం కోత పెట్టారు. ఈ కోతలన్నీ కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా అమల్లో ఉంటాయి. అన్ని ఆహార పథకాలకు కూడా మినహాయింపు లేదు. 2013-14లో రూ.1,24,844 కోట్ల నుంచి 2014-15లో రూ.1,15,000 కోట్లకు తగ్గించారు. ఈ కోతలో ప్రధాని మన్మోహన్సింగ్ పేరుతో ప్రారంభించిన గ్రామీణ రహదారి పథకానికి గత నాలుగేళ్లుగా కోత తప్పలేదు. ప్రభుత్వం ఇల్లెక్కి ప్రచారం చేసుకొన్న మహాత్మాగాంధీ ఉపాధి పథకం మీద కూడా చిదంబరం కళ్లుపడ్డాయి. ఈ పథకానికి కేటాయింపు 2010లో రూ.3,357.9 కోట్ల నుంచి 2014-15 నాటికి రూ.3,398 కోట్లు కోత పెట్టారు. మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా అన్నదానికి మన్మోహన్సింగ్ కొలబద్ద స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ). జీడీపీ వృద్ధి సాధిస్తే పరిస్థితి బాగున్నట్లు, తగ్గితే అభివృద్ధి ఆ మేరకు కుంటుపడినట్లు లెక్క. ఈ ప్రభుత్వ హయాంలోనే ఒక సంవత్సరంలోనూ జీడీపీ వృద్ధి 9 శాతం నమోదయ్యింది. గత సంవత్సరం ఇది ఐదు శాతానికి పడిపోయింది. 2013 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో 4.4 శాతానికి దిగజారితే ఈ సంవత్సరంలో ఎట్టిపరిస్థితులలో 4.9 శాతానికి దిగువకు పడిపోదని చిదంబరం ధీమాగా చెపుతున్నారు. కానీ రకరకాల పద్దుల కింద కోతలు విధించి ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ ఈక్విటీని అయినకాడికి అమ్మేసి, ఆమ్ ఆద్మీకి సాంత్వన కలిగించే పద్దులకు కోత విధించి, ద్రవ్యలోటును 4 శాతానికి తగ్గినట్లు లెక్కలు చూపించి మనందరినీ జయహో అనమంటున్నారు. ద్రవ్యలోటును 4 శాతానికి తగ్గించినట్టుగా చెప్పుకుని చిదంబరం తన వీపు తానే చరచుకోవచ్చు. తమ నోళ్లు కొట్టి ఈ ‘ఘనత’ను సాధించారని, ఈ తగ్గింపు సాధించడానికి ఆమ్ ఆద్మీని, వారి ఆశలను వధ్యశిల ఎక్కించారని సర్వత్రా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాని డ్రీమ్‌బడ్జెట్ నుంచి ‘పీడకల’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత చిదంబరానిదే. తమిళనాడులో చిదంబరం గెలిచిన శివగంగ నియోజకవర్గం నుంచి ఈసారి ఎన్నికయ్యే అవకాశం లేనట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. తథాస్తు. అలాగే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో కూర్చుంటుందని మరో అంచనా. తథాస్తు. కాంగ్రెస్ అభ్యర్థులు ఇచ్చే డబ్బు తీసుకొని, వారికే ఓటు వేస్తే, ఆమ్ ఆద్మీ పరిస్థితి తథాస్తు. (వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు) - వి.హనుమంత రావు