బడ్జెట్ కాదు... బలిపీఠం! | Budget 2014: Aam aadmi has no big reason to cheer | Sakshi
Sakshi News home page

బడ్జెట్ కాదు... బలిపీఠం!

Published Thu, Feb 20 2014 2:14 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

బడ్జెట్ కాదు... బలిపీఠం! - Sakshi

బడ్జెట్ కాదు... బలిపీఠం!

సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తన బడ్జెట్‌లో ఆమ్‌ఆద్మీకి మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకోకపోగా సామాన్యుడినే వధ్యశిలపై నిలబెట్టారు. ఒకప్పుడు డ్రీమ్‌బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. తాజాగా చిదంబరం వెలువరించిన ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమ్‌ఆద్మీ పాలిట పీడకల లాంటిదే.
 
 ఆమ్‌ఆద్మీ అనే పదాన్ని రూపొందించినదీ, ప్రచారంలో పెట్టిందీ  కాంగ్రెస్ పార్టీయే. కాని దాన్ని ఆచరణలో పెట్టలేదు. గత బడ్జెట్లలో చేసిన కేటాయింపుల ఫలితాలు ప్రజలకు చేరకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అనే కాకి ఎత్తుకుపోయింది. అయినా, కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కాలేదనడానికి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్టే తిరుగులేని ఉదాహరణ. ధరల పెరుగుదల నుంచి ఉపశమనం కలిగించడానికి ఆయనకు కార్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, లారీలు, మొబైల్ ఫోన్లు ఉన్నవారే కనిపించారు. ఈ చర్యల ద్వారా వీటిని ఉత్పత్తి చేసే కంపెనీల అధిపతులు, వినియోగించే ఉన్నత, మధ్య తరగతి వారే లాభం పొందుతారు.
 
 బడ్జెట్‌లో ఆమ్‌ఆద్మీ కనిపించలేదు. అవును, డ్రీమ్ బడ్జెట్లు ప్రవేశపెట్టిన వారికి వారెలా కనిపిస్తారు? రేపో, మాపో ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ ఓట్ల కోసమైనా, వాళ్లకేదైనా మేలు చేయకపోతే, వాళ్ల ఓట్లు తన పార్టీకి రావనే ఆలోచన అయినా రాలేదంటే, కాంగ్రెస్ నాయకులూ, ఆ పార్టీ నాయకుడు చిదంబరం ఎంత పాషాణ హృదయం కలవారో ఓటర్లు గమనించాలి. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమ్ ఆద్మీ పట్ల అదే ధోరణిని ప్రతిబింబిస్తుంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, యువత, సంపన్నుల ఓట్లను కొల్లగొట్టుకోవడంపైనే ఆయన దృష్టి పెట్టారు. వీరిలో అత్యధికులు పడక కుర్చీ రాజకీయవేత్తలు, మేధావులు. ఇలాంటి వారు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి క్యూలో నిల్చుంటారా?
 
 రాయితీల నజరానా
 పారిశ్రామిక రంగాన్ని చూస్తే, స్వాతంత్య్రం వచ్చిన మొదటి రెండు మూడు దశాబ్దాలలో పారిశ్రామికీకరణ కోసం ప్రభుత్వం వైపు చూశారేమోగాని, ఆ తర్వాత బలం పుంజుకుని ప్రభుత్వాన్నే తమ వైపు చూసే స్థాయికి ఎదిగారు. బెల్లం ఎక్కడ ఉంటే చీమలు అక్కడ చేరతాయన్నట్లు ప్రజాసేవ పేరుతో నాయకులు, వినాయకులు డబ్బు సంపాదనకు పాల్పడటంతో పారిశ్రామికవేత్తలు ఈ బలహీనతను సొమ్ము చేసుకోవడానికి డబ్బు విరజిమ్మి తమ పనులు చేయించుకోవటం ప్రారంభించడంతో ఇద్దరి మధ్య వారధి ఏర్పడింది. అవినీతే ఆ వారధి.  
 
 కార్పొరేట్లకు ఊడిగం చేయడం, వారి మీద బరువు భారాలు తగ్గించడం, పన్నుల రాయితీలు ఖజానాకు చిల్లుపడినా మనం చెల్లించే పన్నుల సొమ్ముతో రాయితీలు ప్రకటించడం గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆనవాయితీగా మారింది. బడ్జెట్ సందర్భంగా ఇచ్చే పుస్తకాలలోని ఒక పుస్తకంలో రాయితీలు ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో లెక్కలిస్తారు. గత నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది సుమారు రూ. 5 లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకు రాయితీలందుతున్నాయి. ఈ బడ్జెట్‌తోపాటు ఆ పుస్తకం అందజేయలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇవ్వకపోయి ఉండవచ్చు. కానీ గత సంవత్సరం డిసెంబర్ 12న పార్లమెంటులో ఒక ప్రశ్నకు జవాబిస్తూ అలాంటి పన్నుల మినహాయింపు వల్ల ఖజానాకు గండిపడిన మొత్తం రూ.4.82 లక్షల కోట్లు! ఇదీ మనం పన్నుల రూపంలో చెల్లించే ఆదాయానికి పట్టిన గతి.
 
 పార్లమెంటులోనూ, బయటా అటు మంత్రులకూ, ప్రభుత్వానికీ, గులాంగిరీ చేసే ఆర్థికశాస్త్రవేత్తలు, బయట నుంచి ప్రపంచబాంకు సబ్సిడీలు తగ్గించాలని, రద్దు చేయాలని చెవినిల్లు కట్టుకొని ఒకటే నస. కానీ కార్పొరేట్లకు పన్ను మినహాయింపు(సబ్సిడీకి ఇదో మారుపేరు) పేరిట ఇస్తున్న రూ.లక్షల కోట్లపై అందరూ గప్‌చుప్. కానీ ఏవో పేర్లతో ప్రభుత్వం సబ్సిడీని పెంచుతుంది. అయితే, ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, పెంచిన సబ్సిడీ హరాయించుకుపోతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెంచితే, ఉద్యోగిత లభిస్తే, సబ్సిడీలు ఇవ్వాల్సిన పనే ఉండదు. ప్రభుత్వం ఆ పని చేయదు. ఎందుచేతనంటే ప్రజలు తమ కాళ్ల మీద నిలబడగలిగితే చదువు సంధ్యలు వస్తే పాలకుల ఓటు బ్యాంకు మాయమైపోతుంది. వాళ్ల కుర్చీలు కదలిపోతాయి.
 
 ఇదేమి నిర్వాకం
 దేశాన్ని కొన్నేళ్లుగా ద్రవ్యలోటు వెంటాడుతోంది. ఈ ద్రవ్యలోటును అదుపు చేయగలిగామని చిదంబరం జబ్బలు చరచుకొంటున్నారు. తాను ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టినట్టుగా అందరూ అనుకోవాలన్నది ఆయన ఆలోచన. కానీ ఎకానమీని ఎలా మేనేజ్ చేశాడని పరిశీలిస్తే... కొన్ని పీఎస్‌యూల వద్ద ఉన్న నిధులను పిండి, సామాజిక సేవల కేటాయింపులకు కోత పెట్టి, ఇతర రంగాలకు చేసిన కేటాయింపులను తగ్గించడం ద్వారా ఈ ద్రవ్యలోటును 4.8 శాతం నుంచి 4.6 శాతానికి నియంత్రించగలిగారు. ఆర్థికవ్యవస్థను చక్కదిద్దడమంటే ఇదేనా?
 
 సామాజిక సేవలకు చేసిన కేటాయింపులకు కోతపెట్టడం దారుణం. సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం చేసే వ్యయంలో ప్రతి రూపాయిలో 15 పైసలే చివరకు లబ్ధిదారులకు చేరుతుందని ఒక సందర్భంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరం ఆ సామాజిక సేవలకు చేసిన కేటాయింపుల్లో కోత విధించటం, ఆ విధంగా ఆదా అయిన సొమ్మును ద్రవ్యలోటును పూడ్చడానికి వినియోగించటం పూర్తిగా అనైతికం, అన్యాయం. ఉదాహరణకు ఈ బడ్జెట్ ప్రకారమే మంచినీరు, పారిశుద్ధ్యం కోసం చేసిన కేటాయింపును 21.3 శాతం తగ్గించటం, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం కేటాయింపు 20.6 శాతం కోత, గృహ నిర్మాణం, పట్టణాల అభివృద్ధికి కేటాయింపు 41.3 శాతం, మానవవనరుల అభివృద్ధికి 6 శాతం, రోడ్డు రవాణా, ప్రధానరహదారులకు 72 శాతం, గ్రామీణాభివృద్ధికి 22.92 శాతం తగ్గించారని బడ్జెట్ నుంచి బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఉదహరించారు.
 
 ఆఖరుకు తనతోటి మంత్రి అయిన హోంశాఖకు కూడా 31.39 శాతం కోత పెట్టారు. ఈ కోతలన్నీ కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా అమల్లో ఉంటాయి. అన్ని ఆహార పథకాలకు కూడా మినహాయింపు లేదు. 2013-14లో రూ.1,24,844 కోట్ల నుంచి 2014-15లో రూ.1,15,000 కోట్లకు తగ్గించారు. ఈ కోతలో ప్రధాని మన్మోహన్‌సింగ్ పేరుతో ప్రారంభించిన గ్రామీణ రహదారి పథకానికి గత నాలుగేళ్లుగా కోత తప్పలేదు. ప్రభుత్వం ఇల్లెక్కి ప్రచారం చేసుకొన్న మహాత్మాగాంధీ ఉపాధి పథకం మీద కూడా చిదంబరం కళ్లుపడ్డాయి. ఈ పథకానికి కేటాయింపు 2010లో రూ.3,357.9 కోట్ల నుంచి 2014-15 నాటికి రూ.3,398 కోట్లు కోత పెట్టారు.
 
 మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా అన్నదానికి మన్మోహన్‌సింగ్ కొలబద్ద స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ). జీడీపీ వృద్ధి సాధిస్తే  పరిస్థితి బాగున్నట్లు, తగ్గితే అభివృద్ధి ఆ మేరకు కుంటుపడినట్లు లెక్క. ఈ ప్రభుత్వ హయాంలోనే ఒక సంవత్సరంలోనూ జీడీపీ వృద్ధి 9 శాతం నమోదయ్యింది. గత సంవత్సరం ఇది ఐదు శాతానికి పడిపోయింది. 2013 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో 4.4 శాతానికి దిగజారితే ఈ సంవత్సరంలో ఎట్టిపరిస్థితులలో 4.9 శాతానికి దిగువకు పడిపోదని చిదంబరం ధీమాగా చెపుతున్నారు. కానీ రకరకాల పద్దుల కింద కోతలు విధించి ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ ఈక్విటీని అయినకాడికి అమ్మేసి, ఆమ్ ఆద్మీకి సాంత్వన కలిగించే పద్దులకు కోత విధించి, ద్రవ్యలోటును 4 శాతానికి తగ్గినట్లు లెక్కలు చూపించి మనందరినీ జయహో అనమంటున్నారు.
 
 ద్రవ్యలోటును 4 శాతానికి తగ్గించినట్టుగా చెప్పుకుని చిదంబరం తన వీపు తానే చరచుకోవచ్చు. తమ నోళ్లు కొట్టి ఈ ‘ఘనత’ను సాధించారని, ఈ తగ్గింపు సాధించడానికి ఆమ్ ఆద్మీని, వారి ఆశలను వధ్యశిల ఎక్కించారని సర్వత్రా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాని డ్రీమ్‌బడ్జెట్ నుంచి ‘పీడకల’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత చిదంబరానిదే. తమిళనాడులో చిదంబరం గెలిచిన శివగంగ  నియోజకవర్గం నుంచి ఈసారి ఎన్నికయ్యే అవకాశం లేనట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. తథాస్తు. అలాగే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో కూర్చుంటుందని మరో అంచనా. తథాస్తు. కాంగ్రెస్ అభ్యర్థులు ఇచ్చే డబ్బు తీసుకొని, వారికే ఓటు వేస్తే, ఆమ్ ఆద్మీ పరిస్థితి తథాస్తు.    
 (వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు)
- వి.హనుమంత రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement