బరిలో వీరులు
12 అసెంబ్లీ స్థానాలకు .. 161 మంది అభ్యర్థులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలిఘట్టం పూర్తయ్యింది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడవు ముగిశాక ఎన్నికల గోదాలో మిగిలిందెవరో తేలిపోయింది. లోక్‌సభ, శాసనసభా నియోజకవర్గాల బరిలో మొత్తంగా 183 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి అనూహ్యంగా పోటీలో 67 మంది స్వతంత్ర అభ్యర్థులు వివిధ నియోజకవర్గాల నుంచి పోటీలో ఉండడం విశేషం. కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీల పొత్తు వల్ల అవకాశం కోల్పోయిన ఆయా పార్టీల్లోని ఆశావహులు రెబల్స్‌గా బరిలోకి దిగారు.
కొందరిని బుజ్జగించి పక్కకు తప్పించినా, మరికొన్ని చోట్ల ఇది సాధ్యం కాలేదు. దీంతో బీజేపీపై టీడీపీ, టీడీపీపై బీజేపీ, సీపీఐపై కాంగ్రెస్ నుంచి రెబల్స్ బరిలో మిగిలారు. ఈ నాలుగు పార్టీల్లోని పరిణామాలు తమకు అనుకూలిస్తాయని ఇతర పార్టీలు ఆశిస్తున్నాయి. అత్యధికంగా 350 నామినేషన్లు దాఖలైనా చివరికి 183 మంది అభ్యర్థులే పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు తోడు ఈసారి చిన్నా చితక పార్టీలు సైతం తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి.
ఫలితంగా ఈసారి ఈవీఎంలపై చిత్ర విచిత్ర గుర్తులు చోటు చేసుకోనున్నాయి. మొత్తంగా 19 రాజకీయ పార్టీలు పోటీకి తమ అభ్యర్థులను పోటీకి పెట్టడం విశేషం. కాంగ్రెస్ పార్టీ పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ పడుతోంది.
టీఆర్‌ఎస్ రెండు లోక్‌సభ, పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒక లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉంది. సీపీఐ రెండు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. సీపీఎం రెండు లోక్‌సభ స్థానాలు, 11 నియోజకవర్గాల్లో, టీడీపీ ఒక లోక్‌సభ స్థానం, 8 అసెంబ్లీ స్థానాలకు, బీజేపీ ఒక లోక్‌సభ, 4 అసెంబ్లీ స్థానాలకు పోటీ పడుతోంది.
పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐలతో పాటు వివిధ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. నామినేషన్ల ఉపసంహరణల అనంతరం అధికారులు ప్రకటించిన ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే..
లోక్‌సత్తా, టీఆర్‌ఎల్డీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ(ఆప్), ఎంఐఎం, మహాజన సోషలిస్టు, జైసమైక్యాంధ్ర(జేఎస్పీ), బహుజన ముక్తి, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్, భారత పిరమిడ్, యువతెలంగాణ పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు.