మీలాగే నేనూ ‘పరీక్ష’ ఎదుర్కొంటున్నా
గుజరాత్ విద్యార్థులకు ఫోన్ సందేశంలో మోడీ
అహ్మదాబాద్: గుజరాత్‌లో గురువారం నుంచి జరగనున్న 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఓ ఫోన్ సందేశం అబ్బురపరిచింది. ఎందుకంటే...ఆ సందేశం పంపింది మరెవరిదో కాదు...ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీయే. ‘విద్యార్థి మిత్రులారా...నేను నరేంద్ర మోడీని. మీలాగే నేను కూడా ఈసారి పరీక్ష (లోక్‌సభ ఎన్నికలు) రాస్తున్నా. నాలాగే మీరు కూడా పరీక్షల గురించి ఆందోళన చెందొద్దు. జీవితంలో పరీక్షలు అనేవి సహజమే. మన కఠిన శ్రమే సత్ఫలితాలనిస్తుంది. మీరు పరీక్షల్లో పాసై మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అంటూ మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. మోడీ ఫోన్ సందేశాన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార గిమ్మిక్కుగా అభివర్ణించింది.
పవార్ కుమార్తెపై ఆప్ పోటీ
సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: లోక్‌సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 56 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను బుధవారం ఢిల్లీలో విడుదల చేసింది. అస్సాం(6 స్థానాల్లో), బీహార్(8), గుజరాత్(2), హిమాచల్‌ప్రదేశ్(1), కేరళ(6), మహారాష్ట్ర(17), మధ్యప్రదేశ్(7), ఉత్తరప్రదేశ్(9)లలో వీరు పోటీ చేయనున్నారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ కంచుకోట బారామతి స్థానంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై మాజీ ఐపీఎస్ అధికారి సురేశ్ ఖోపడే ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కేంద్ర మంత్రి కేవీ థామస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్నాకులం(కేరళ) నుంచి పాత్రికేయురాలు అనితా ప్రతాప్ బరిలోకి దిగనున్నారు.
మోడీకి నిలువెల్లా అహంకారమే: నితీశ్
పాట్నా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తనపై చేసిన ‘ఎవరెస్ట్’ వ్యాఖ్యలపై బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ దీటుగా బదులిచ్చారు. తనకు ఎవరెస్ట్‌ను మించిన అహంకారం ఉందంటూ మోడీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. పేద కుటుంబంలో పుట్టిన తనకు ఆత్మగౌరవం తప్ప అహంకారం లేదని బుధవారం పాట్నాలో అన్నారు. ఎవరు అహంకారో మాటతీరు, హావభావాలు చెబుతాయని...మోడీ శరీరంలోని ప్రతి అంగుళంలో అహంకారం ఉందని అందరికీ తెలుసునని చురకలంటించారు.
కర్ణాటక బరిలో నలుగురు మాజీ సీఎంలు
సాక్షి, బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి నలుగురు మాజీ ముఖ్యమంత్రులు లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు విడుదల జేసిన తొలి జాబితాల్లో 47 మందికి స్థానం(బీజేపీ-20, కాంగ్రెస్-14, జేడీఎస్-13) దక్కింది. వీరిలో బీజేపీకి చెందిన యడ్యూరప్ప, సదానందగౌడలు శివమొగ్గ, బెంగళూరు ఉత్తర పార్లమెంటు స్థానాల నుంచి, కాంగ్రెస్‌కు చెందిన ధరమ్ సింగ్ బీదర్ నుంచి, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ హాసన్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరంతా సీఎంలుగా అధికారం చలాయించిన వారే.
బీజేపీలోకి రామ్‌కృపాల్ యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ నమ్మినబంటు రామ్‌కృపాల్ యాదవ్ బుధవారం ఇక్కడ బీజేపీలో చేరారు. స్థానిక బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో కమలం గూటికి చేరిన యాదవ్.. లాలూపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్జేడీలో కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యం కార్యకర్తలకు లేకుండా పోతోందని, ఆ పార్టీలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. కాగా, తనను బీజేపీలోకి చేర్చుకున్న ఆపార్టీ అగ్రనేతలకు యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీని ప్రధానిని చేయడం, 272 ప్లస్ సీట్ల సాధన లక్ష్యంలో భాగస్వామినవుతానని చెప్పారు. కాగా, యాదవ్‌కు బీహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ స్థానాన్ని బీజేపీ కేటాయించనున్నట్టు సమాచారం. ఈ స్థానం నుంచి ఆర్‌జేడీ అధినేత లాలూ కుమార్తె మీసా భారతి పోటీ చేయనున్నారు.
256 మంది ఎంపీలు పోస్టుగ్రాడ్యుయేట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి దిశానిర్దేశం చేసే పార్లమెంట్‌లో ఉన్నత విద్యావంతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 14వ లోక్‌సభలో 157 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు ఉండగా ప్రస్తుత లోక్‌సభ(15వ)కు వచ్చేప్పటికి అది రికార్డు స్థాయిలో 256కి పెరగడం విశేషం. 15వ లోక్‌సభలోని మొత్తం సభ్యులలో 78 శాతం మంది సభ్యులు డాక్టరేట్ డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ చేసినవారే ఉన్నారు. మొట్టమొదటి లోక్‌సభకి 112 మంది పదోతరగతి లోపు విద్యార్హత ఉన్న సభ్యులు ఎన్నికవగా... 15వ లోక్‌సభకి వచ్చేప్పటికి వీరి సంఖ్య గణనీయంగా 20కి తగ్గిపోయింది.
ఎలక్షన్ వాచ్
Published Thu, Mar 13 2014 3:45 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement