రైల్వే ప్రయాణీకులకు మరింత మెరుగైన ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులు అందించేందుకు భారతీయ రైల్వే క్యాటరింగ్, టికెటింగ్ అండ్ టూరిజం విభాగం ఐఆర్‌సీటీసీ కట్టుబడి ఉంది. ఇందుకోసం తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్‌తో జతకట్టింది. ఈ సహకారం వల్ల రైళ్లలో ఆహార ఆఫర్లను పునరుద్ధరించడం, ప్రయాణీకులకు అధిక నాణ్యమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటికే ఐఆర్‌సీటీసీ 90 పట్టణాలు, 100 రైల్వే స్టేషన్లలో వేలాది మంది వినియోగదారులకు ఫుడ్ అగ్రిగేటింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోతో సహకారం కుదుర్చుకుని సేవలందిస్తోంది. తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్‌తో చేసుకున్న ఒప్పందం రైళ్లలో లభించే ఆహారం నాణ్యతను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రోజుకు 16 లక్షల భోజనాలను అందిస్తున్నాం. జోజనం మెనూను మెరుగుపరచడం కోసం కస్టమర్ల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. మెనూను అప్‌డేట్ చేసి ఫుడ్ ఆఫర్ ట్రయల్స్ త్వరలో నిర్వహిస్తాం. ఇందుకోసం తాజాగా ప్రముఖ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.
ఇదీ చదవండి: ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్యాకేజీ
చిన్న పరిశ్రమలకు మద్దతు
కేటరింగ్, టూరిజం విభాగంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) చేయూతనిచ్చేందుకు ఐఆర్‌సీటీసీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. వస్తువులు, సేవల కోసం సుమారు 63% ఎంఎస్ఈలపైనే ఆధారపడుతున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఇది ప్రభుత్వం నిర్దేశించిన 25% కంటే చాలా ఎక్కువ. ఎంఎస్‌ఈలతోపాటు సంస్థ వృద్ధిపై ఐఆర్‌సీటీసీ దృష్టి సారించినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment