irctc package
-
రైల్వేలో ఫుడ్ కేటరింగ్ మెరుగుపడనుందా..?
రైల్వే ప్రయాణీకులకు మరింత మెరుగైన ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులు అందించేందుకు భారతీయ రైల్వే క్యాటరింగ్, టికెటింగ్ అండ్ టూరిజం విభాగం ఐఆర్సీటీసీ కట్టుబడి ఉంది. ఇందుకోసం తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్‌తో జతకట్టింది. ఈ సహకారం వల్ల రైళ్లలో ఆహార ఆఫర్లను పునరుద్ధరించడం, ప్రయాణీకులకు అధిక నాణ్యమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటికే ఐఆర్సీటీసీ 90 పట్టణాలు, 100 రైల్వే స్టేషన్లలో వేలాది మంది వినియోగదారులకు ఫుడ్ అగ్రిగేటింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోతో సహకారం కుదుర్చుకుని సేవలందిస్తోంది. తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్‌తో చేసుకున్న ఒప్పందం రైళ్లలో లభించే ఆహారం నాణ్యతను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రోజుకు 16 లక్షల భోజనాలను అందిస్తున్నాం. జోజనం మెనూను మెరుగుపరచడం కోసం కస్టమర్ల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. మెనూను అప్డేట్ చేసి ఫుడ్ ఆఫర్ ట్రయల్స్ త్వరలో నిర్వహిస్తాం. ఇందుకోసం తాజాగా ప్రముఖ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్యాకేజీచిన్న పరిశ్రమలకు మద్దతుకేటరింగ్, టూరిజం విభాగంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) చేయూతనిచ్చేందుకు ఐఆర్సీటీసీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. వస్తువులు, సేవల కోసం సుమారు 63% ఎంఎస్ఈలపైనే ఆధారపడుతున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇది ప్రభుత్వం నిర్దేశించిన 25% కంటే చాలా ఎక్కువ. ఎంఎస్ఈలతోపాటు సంస్థ వృద్ధిపై ఐఆర్సీటీసీ దృష్టి సారించినట్లు పేర్కొంది. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!
ట్రైన్ జర్నీ చేసే చాలామంది కొన్ని సందర్భాల్లో ఫుడ్ కోసం ఇబ్బందిపడే ఉంటారు. అధిక ధరలు లేదా నాణ్యత లేకపోవడం వంటివి నిజ జీవితంలో ఎదురై ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాటికి 'ఐఆర్సీటీసీ' (IRCTC) చరమగీతం పాడటానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రయాణికుల కోసం రైల్వే ఓ కొత్త విధానం తీసుకువచ్చింది. సరసమైన ధరతోనే ప్రయాణికులకు మంచి భోజనం అందించాలనే సదుద్దేశ్యంతో రైల్వే బోర్డు ఇప్పటికే డివిజనల్ యూనిట్లకు 'రైల్వేస్ జనతా ఖానా' ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ కేవలం 'నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ జంక్షన్'లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సదుపాయం రానున్న రోజుల్లో మరింత విస్తరించడానికి ప్రణాళికలు చేపడుతున్నారు. (ఇదీ చదవండి: బీచ్‌లో చిల్ అవుతున్న మస్క్, జుకర్‌బర్గ్.. ఏంటి, కలిసిపోయారా?) రైల్వేస్ జనతా ఖానా.. ఐఆర్సీటీసీ ఈ ఫుడ్ రెండు కేటగిరీలలో అందించనుంది. 7 పూరీలు (175 గ్రామ్స్), పొటాటో వెజిటేబుల్స్ (150 గ్రామ్స్), ఊరగాయ (12 గ్రామ్స్) వంటివి కేవలం రూ. 20 మాత్రమే. అయితే రూ. 50 కాంబో ప్యాక్‌లో 350 గ్రామ్స్ రాజ్మా లేదా రైస్, పాప్ బాజీ, మసాలా దోశ, కిచిడి మొదలైనవి ఉంటాయి. ఇక 200 మీలీ వాటర్ బాటిల్ ఖరీదు కేవలం రూ. 3 మాత్రమే. ఈ కొత్త విధానం సమర్థవంతంగా సాగితే ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. -
ఐఆర్సీటీసీ స్వదేశ్ దర్శన్ పర్యాటక రైళ్లు.
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాల పర్యటనకు స్వదేశీ దర్శన్ పర్యాటక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డిఫ్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. కోవిడ్ అనంతరం అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ పర్యటనలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్‌లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా పర్యాటకుల రద్దీ పెరిగిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారన్నారు. గత ఏప్రిల్‌లోనే రూ.1.5 కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపారు. గతేడాది సుమారు 50 వేల మంది ఐఆర్సీటీసీ ప్యాకేజీలను వినియోగించుకున్నారని, ఈ ఏడాది 70 వేల మందికి పైగా ఐఆర్సీటీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ టూర్లకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఐఆర్సీటీసీ టూర్లు ఇవీ... తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్ మీదుగా ఈ నెల 27న స్వదేశీ దర్శన్ రైలు బయలుదేరనుంది. జూన్ 3వ తేదీ వరకు పర్యటన కొనసాగుతుంది. ఈ టూర్లో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. అన్ని రకాల సదుపాయాలతో స్లీపర్ క్లాస్ రూ.18,120, ఏసీ క్లాస్ రూ.22,165 చొప్పున ప్యాకేజీ ఉంటుంది. మరో ట్రైన్ మహాలయ పిండదాన్– సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 15న బయలుదేరి 20న తిరిగి చేరుకుంటుంది. ఈ పర్యటనలో వారణాసి, ప్రయాగ్, గయ, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. స్లీపర్ రూ.14,485, ఏసీ రూ.18,785 చొప్పున చార్జీ ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉంటాయి. షిరిడి సాయి దర్శనానికి, తిరుపతి పుణ్యక్షేత్రానికి, ఒడిషా జగన్నాధ రథయాత్రకు ప్రత్యేక డొమెస్టిక్ పర్యాటక ప్యాకేజీలను కూడా సిద్ధం చేశారు. కేరళ, జమ్ముకాశ్మీర్, అస్సామ్, మేఘాలయ, తదితర ప్రా ంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఐఆర్సీటీసీ సిద్ధం చేసింది. అంతర్జాతీయ పర్యటనల్లో భాగంగా రాయల్ నేపాల్ టూర్ ను అందుబాటులోకి తెచ్చారు. జూన్ 26 నుంచి 5 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అన్ని వసతులతో కలిపి రూ.40 వేల వరకు చార్జీ ఉంటుంది. (చదవండి: మాస్కు మస్ట్... ఆలస్యమైన అనుమతించరు) -
తిరుమల సందర్శకులకు తీపికబురు!
తిరుమల తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం పంచదేవాలయం టూర్ పేరుతో సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ కింద తిరుమలలోని శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి పుణ్య క్షేత్రాలను దర్శనం చేసుకోవచ్చు. భక్తులు తిరుపతి చేరుకున్న తర్వాత నుంచి ప్యాకేజీ మొదలవుతుంది. తిరుపతికి చేరుకునే భక్తులు శ్రీవారి దర్శనంతో పాటు ఇతర ఆలయాలను సందర్శించడం కోసం ఈ ప్యాకేజీని రూపొందించారు. ఇది 1 రాత్రి, 2 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీ. పంచదేవాలయం టూర్ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీ(ముగ్గరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.5,270 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ(ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.7,010, సింగిల్ ఆక్యుపెన్సీ (ఒకరు మాత్రమే) ధర రూ.11,750. ప్యాకేజీలో తిరుపతిలో ఒక రోజు అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రతీరోజు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. -
కశ్మీర్ సోయగం: ఒక్కొక్కరికి ఎంత ఖర్చంటే!
ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్) నిర్వహించే ‘శ్రీనగర్– గుల్మార్గ్– పహల్గావ్– శ్రీనగర్’ టూర్లో పర్యాటకులను మొదటి రోజు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో పికప్ చేసుకుంటారు. ఈ పర్యటనలో శ్రీనగర్ షాలిమర్ తోటలు, శంకర్ నారాయణ్ టెంపుల్, గుల్మార్గ్ (గౌరీ మార్గ్), పహల్గావ్లోని కుంకుమ పువ్వు తోటల్లో విహారం, అవంతిపురా పర్యటన, థాజ్వాస్ గ్లేసియర్ తీరాన గుర్రపు స్వారీ, శ్రీనగర్‌లో శికారా రైడ్ ఉంటాయి. చివరి రోజు తిరిగి శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేస్తారు. ఇవి ఉండవు! ఈ ప్యాకేజ్‌లో విమాన ప్రయాణ చార్జీలు కలిసి లేవు. శ్రీనగర్‌కు వెళ్లడానికి, శ్రీనగర్ నుంచి తిరిగి స్వస్థలం రావడానికి విమాన టిక్కెట్లను పర్యాటకులు సొంతంగా బుక్ చేసుకోవాలి. శ్రీనగర్‌లో దిగినప్పటి నుంచి తిరిగి విమానాశ్రయానికి చేర్చే వరకు రవాణా ప్యాకేజ్‌లో ఉంటుంది. అలాగే ఉదయం బ్రేక్‌ఫాస్ట్, సాయంత్రం డిన్నర్ కూడా ప్యాకేజ్‌లోనే. ఈ పర్యటనకు ఏప్రిల్ నుంచి జూలై వరకు పీక్ సీజన్. జనవరి నుంచి మార్చి వరకు పీక్ సీజన్ కాకపోవడంతో పర్యాటకుల తాకిడి తక్కువ. ఆరు రోజుల (ఐదు రాత్రులు) ఈ ప్యాకేజ్‌లో ఒక్కరికి 35 వేలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 18 వేలవుతుంది. ముగ్గురు కలిసి వెళ్లినప్పుడు ఒక్కొక్కరికి 15 వేలకు మించదు. పీక్ సీజన్లో ప్యాకేజ్ చార్జ్‌లు మరో రెండు వేలు పెరుగుతాయి. గమనిక: పర్యాటకులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పోస్ట్‌పెయిడ్ సిమ్‌కార్డు ఉండాలి. ప్యాకేజ్ పేరు ‘శ్రీనగర్– గుల్మార్గ్– పహల్గావ్- శ్రీనగర్ ప్యాకేజీ. -
3 నైట్స్/4 డేస్... ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
కాచిగుడ : తిరుమల తిరుపతి వెంకటేశుని దర్శించుకోవాలని చాలా మందికి ఎంతో ఆశగా ఉంటుంది. ఈ దేవుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. తాజాగా హైదరాబాద్ నుంచి వెంకటేశుని దర్శించుకోవడానికి వెళ్లాలనుకునే వారికి దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కాచిగుడా నుంచి రూ.5400 ప్రారంభ ధరకు నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ ప్రారంభమవుతుందని ట్వీట్ ద్వారా తెలియజేసింది. బాలాజి దేవస్థానంతో పాటు ఆ పక్కనే దగ్గరిలో ఉన్న కాణిపాక వినాయక దేవాలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వంటివి ఈ ప్యాకేజీలో భాగంగా దర్శించుకుని రావచ్చట. మూడు రోజులు, నాలుగు రోజులు కలిగిన ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ‘వెంకటాద్రి’ పేరుతో ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ‘వెంకటాద్రి’ టూర్ ప్యాకేజీ వివరాలు... ఈ టూర్ ప్యాకేజీలో కవర్ చేసే గమ్యస్థలం తిరుపతి. ట్రైన్, రోడ్డు మార్గన ప్రయాణానికి ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ప్రతి శుక్రవారం రాత్రి 8.05లకు కాచిగుడ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. 3 ఏసీ, స్లీపర్ క్లాస్ టిక్కెట్లు ఈ ఆఫర్ కింద అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ కింద ఒక్కో వ్యక్తి ఈ టూర్ ఖర్చు రూ.5750 అవుతుంది. కంపోర్ట్ క్లాస్ కింద టూర్ ఖర్చు ఒక్కో వ్యక్తికి రూ.9038 అవుతుంది. యాత్రికులు/పర్యాటకులందరూ కూడా తమ వెంట ఒరిజినల్ ఐడీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించకపోతే, టీటీడీ సిబ్బంది భక్తులను వెంకటేశుడి దర్శనానికి అనుమతించరు. -
ఐఆర్సీటీసీ నుంచి హెలికాప్టర్ సర్వీసులు!
ఐఆర్సీటీసీ అనగానే కేవలం రైళ్ల టికెట్లు బుక్ చేసుకోడానికే అనుకుంటాం కదూ.. కానీ ఇప్పుడు సరికొత్త సేవల్లోకి కూడా ఈ సంస్థ దిగుతోంది. ముంబై నగరాన్ని హెలికాప్టర్లోంచి చూపించే సౌకర్యాన్ని ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ సేవను ప్రారంభించారు. ముంబై నగరాన్ని ఒక్కసారి హెలికాప్టర్లో అలా చుట్టి రావాలంటే.. రూ. 5,580 చార్జీ అవుతుందని ఐఆర్సీటీసీ రీజనల్ డైరెక్టర్ వీరేందర్ సింగ్ తెలిపారు. జుహు ఏరోడ్రమ్ నుంచి హెలికాప్టర్ ఎక్కి అలా చుట్టు తిరగొచ్చు. మంగళ, శుక్రవారాల్లో దక్షిణ ముంబై పర్యటన ఉంటుంది. జుహు, బాంద్రా-వర్లి సీలింక్, హజీ అలీ ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయి. ఉత్తర ముంబై మార్గానికి సోమ, శనివారాల్లో ట్రిప్పులుంటాయి. అందులో జుహు, వెర్సోవా, మలాడ్, గొరాయ, పగోడా, ఎస్సెల్ వరల్డ్ ప్రాంతాలు కవరవుతాయి. హెలికాప్టర్ సముద్రమట్టానికి వెయ్యి అడుగుల ఎత్తున ఎగురుతుంది కాబట్టి ఇదంతా చాలా సరదాగా ఉంటుందని వీరేందర్ సింగ్ చెప్పారు.