Catering
-
సచివాలయ ఉద్యోగులకు కేటరింగ్ పనులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు భోజనాలు వడ్డించే బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది. అన్నమయ్య జిల్లాలో ఓ మండలాధికారి పదవీ విరమణ సందర్భంగా మండల పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో భోజనాలు వడ్డించేందుకు గ్రామ సచివాలయాల ఉద్యోగులను వినియోగించారు. విస్తర్లు వేసేందుకు, మటన్, పప్పు, సాంబారు వంటి పదార్థాలను వడ్డించే బాధ్యతలను 12 మంది సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ఈ మేరకు అధికారులు లిఖితపూర్వక ఆదేశాలు సైతం జారీ చేశారు. ఏ పనైనా వారికే.. మచిలీపట్నంలో ధాన్యం సేకరణ నిమిత్తం వెహికల్ మూమెంట్ మోనిటరింగ్ పేరుతో వార్డు సచివాలయాల్లో పనిచేసే 31 మంది ఉద్యోగులను వివిధ మిల్లుల వద్ద కాపలా కాసే బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా సీఎం చంద్రబాబు ఫొటోతో కూడిన స్టిక్కర్లను ఇంటింటా అతికించే బాధ్యతల్ని సైతం ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించిన విషయాన్ని విదితమే. సచివాలయాల ఉద్యోగులకు అధికారులు అప్పగిస్తున్న బాధ్యతలతో వారంతా సిగ్గు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగుల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి చదువులు చదివిన వారే అధికం. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు స్థానిక అధికారులు ప్రతి పనికీ ఉపయోగించుకుంటూ తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. -
ఇకపై కేటరింగ్ చేయనున్న ఫుడ్ డెలివరీ సంస్థ..?
ఫుడ్ డెలివరీ చేసే టెక్ సంస్థ జొమాటో భారీ ఆర్డర్లను అందించే విస్తృత వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ వ్యూహంలో భాగంగా జొమాటో కేటరింగ్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నట్లు కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఫుడ్ డెలివరీతోపాటు ప్రస్తుత రెస్టారెంట్ భాగస్వాముల నెట్‌వర్క్‌ను ఉపయోగించి కేటరింగ్ సర్వీస్‌లను అందించాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో నిత్యం ఉద్యోగాలు, ఇతర పనులతో బిజీగా ఉంటున్న ప్రజలు.. ఖాళీ దొరికితే బయటకెళ్లి సమయం గడపాలనుకుంటున్నాయి. ఒంటరిగా కంటే ఉమ్మడిగా, స్నేహితులతో కలిసి సమయం గడుపుతుంటారు. దాంతో వారందరికీ ఫుడ్ ఆర్డర్ చేయడం కొంత కష్టంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి అలాంటి వారి అవసరాలు తీర్చేలా జొమాటో కేటరింగ్ సర్వీస్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే..? ఒకేసారి వివిధ రెస్టారెంట్ల నుంచి ఆర్డర్స్ పెట్టుకోవడానికి మల్టీ కార్ట్ ఫీచర్‌ను ఈ ఏడాది జూన్‌లో జొమాటో లాంచ్ చేసింది. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో తాజా స్ట్రాటజీతో మరింతగా విస్తరించాలని కంపెనీ చూస్తోంది. చిన్న సైజ్ ఆర్డర్లు పెట్టే వారిని ఆకర్షించేందుకు జొమాటో ఈ ఏడాది ‘ఎవ్రిడే’ను లాంచ్ చేసింది. -
ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్!
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ దాని 'ఈట్స్ ఆన్-బోర్డ్' క్యాటరింగ్ సర్వీస్‌లో మార్పులు చేసింది. ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన మెనూ నుంచి ప్రయాణికులు తమకు ఇష్టమైన ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఈ ప్రత్యేక మెనూను తమ అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ప్రవేశపెట్టినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. రుచికరమైన ప్రాంతీయ వంటకాలతో మొదలుకొని స్ట్రీట్ ఫుడ్స్ వరకూ సరికొత్త ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రయాణానికి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. “ఇండియా ప్రముఖ క్యారియర్‌గా మా కస్టమర్ల కోసం సేవలను మెరుగుపరిచే మార్గాలను నిరంతరం పరిశీలిస్తున్నాం. కస్టమర్లు, క్యాబిన్ సిబ్బంది, సర్వీస్ పార్టనర్ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా మా కొత్త 6ఈ ఈట్స్ మెనూ కొత్త ఆప్షన్లను అందిస్తుంది” అని ఇండిగో కస్టమర్ సర్వీసెస్, ఆపరేషన్స్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాందాస్ అన్నారు. ఇదీ చదవండి: పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా? -
హైదరాబాద్‌కి ఫుడ్లింక్.. సెలబ్రిటీల పెళ్లిళ్ల క్యాటరింగ్ కంపెనీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ క్యాటరింగ్ కంపెనీ ఫుడ్లింక్ ఎఫ్అండ్బీ హోల్డింగ్స్ ఇండియా తాజాగా దక్షిణాదిన అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో 15,000 చదరపు అడుగుల్లో అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక కిచెన్‌తోపాటు గిడ్డంగిని ఏర్పాటు చేసింది. అంబానీ–పిరమల్, దీపిక–రణ్వీర్, కేఎల్ రాహుల్–అథియా శెట్టి, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీవీ, రెడ్డి ల్యాబ్స్ కుటుంబ సభ్యుల వివాహ వేడుకల క్యాటరర్‌గా వ్యవహరించిన ఫుడ్లింక్కు రోజుకు 10 లక్షలకుపైగా అతిథులకు ఆహారం అందించే సామర్థ్యం ఉంది. ఫోర్బ్స్ ఇండియా టాప్–100లోని 75% వ్యాపార సంస్థలు, వారి కుటుంబ సభ్యులకు సేవలు అందించినట్టు ఫుడ్లింక్ సీఈవో సంజయ్ వజిరాణి మీడియాకు తెలిపారు. ‘లగ్జరీ క్యాటరింగ్, రెస్టారెంట్ల వ్యాపార విస్తరణకు హైదరాబాద్‌లో మూడేళ్లలో రూ.100 కోట్లు వెచ్చిస్తాం. ఇండియా బిస్ట్రో, చైనా బిస్ట్రో, గ్లోకల్ జంక్షన్, ఆర్ట్ ఆఫ్ దమ్ రెస్టారెంట్ల సంఖ్యను ఇప్పుడున్న 35 నుంచి 100కు చేరుస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం రూ.450 కోట్ల టర్నోవర్ దాటు తాం. మూడేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. అప్పుడు ఐపీవోకు వెళ్తాం’ అని చెప్పారు. -
అమరావతి పాదయాత్రలో వ్యక్తి అనుమానాస్పద మృతి
అవనిగడ్డ: అమరావతి పాదయాత్రలో భోజనాల కేటరింగ్‌కు వచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్ధితిలో మరణించాడు. బుధవారం కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది. విజయవాడకు చెందిన కేటరింగ్ మేస్త్రి కింద పలు ప్రాంతాల నుంచి 35 మంది పాదయాత్రలో భోజనాలు వడ్డించడానికి వచ్చారు. కృష్ణా జిల్లా మాజేరులో బుధవారం భోజనాల అనంతరం సాయంత్రం 5.30 గంటల సమయంలో కొంతమంది కేటరింగ్ సిబ్బందిని వాహనాల్లో మచిలీపట్నం తరలించారు. మిగిలిన వారికి మరో వాహనం వస్తుందని చెప్పారు. ఈలోగా కొంతమంది మాజేరు నుంచి నడచుకుంటూ మచిలీపట్నం వైపు వెళుతున్నారు. 216 జాతీయ రహదారిపై ఘంటసాల మండలం లంకపల్లి వద్ద గూడూరుకు చెందిన కె.చెన్నారావు కుప్పకూలి రోడ్డు పక్కన పడిపోయాడు. పక్కనే ఉన్న వారు ఫిట్స్ వచ్చి పడిపోయాడనుకుని చేతిలో తాళాలు పెట్టి 108 వాహనానికి సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న 108 వాహనం టెక్నీషియన్ అతన్ని పరీక్షించి, అప్పటికే మరణించినట్టు చెప్పారు. మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే వారు రాకపోవడంతో మృతదేహాన్ని అవనిగడ్డలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాక్షి టీవీ విలేకరిని బెదిరించిన జేఏలీ లీగల్ అడ్వైజర్ వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న జర్నలిస్టులు ఘటన ప్రాంతానికి చేరుకుని వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఇంతలో మచిలీపట్నం వైపు నుంచి 6677 నంబర్ వాహనంలో వచ్చిన పాదయాత్ర జేఏసీ లీగల్ అడ్వైజర్ జమ్మల అనిల్‌కుమార్ ‘సాక్షి’ టీవీ విలేకరి సుబ్రహ్మణ్యేశ్వరరావుతో వీడియోలు డిలీట్ చేయాలంటూ దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు విలేకరి నిరాకరించడంతో ఆగ్రహించిన అనిల్‌కుమార్ ‘అయితే నేను చేయాల్సింది చేస్తాను. నీ వ్యవహారం చూస్తాను’ అని బెదిరిస్తూ విలేకరిని వీడియో, ఫోటోలు తీసుకుని వెళ్ళారు. ఈ విషయమై చల్లపల్లి సీఐ రవికుమార్‌ని వివరణ కోరగా ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని, వెంటనే అనిల్కుమార్ని పిలిపించి మందలించినట్టు చెప్పారు. -
క్యాటరింగ్ నుంచి హీరోగా.. రిలీజ్‌కు రెడీ అయిన డూడీ చిత్రం
తమిళసినిమా: దేనికైనా ప్రతిభే ప్రామాణికం. దీన్ని నిజం చేస్త.. క్యాటరింగ్ నిర్వాహకుడైన కార్తీక్ మధుసదన్ కథానాయకుడిగానూ, దర్శకుడుగానూ పరిచయమయ్యారు. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం డూడీ. ఈయనతో పాట శ్యామ్ ఆర్డీ ఎక్స్ దర్శకత్వంలో భాగస్వామ్యం పంచుకున్నారు. నటి శ్రితా శివదాస్ నైతిక నటించిన ఇందులో జీవరవి, అర్జున్ మణికంఠన్, మదుసదన్, అక్షత ఎడ్విన్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 16వ తేదీన థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం చెన్నైలో మీడియా సమావేశంలో దర్శకుడు, కథానాయకుడు మాట్లాడుతూ తాను క్యాటరింగ్ పని చేశానని, అయితే తన తండ్రి చిత్ర పరిశ్రమలో ప్రొడెక్షన్ విభాగంలో పని చేశారని తెలిపారు. తనకు చిన్నప్పటి నుం సినిమా అంటే ఆసక్తి అని సంగీతంలోనూ ప్రవేశం ఉందని చెప్పారు. దీంతో తన కోరికను తీర్చుకోవడానికి ఇక సమయం లేదని భావించి ఈ చిత్రంతో కథానాయకుడుగా, దర్శకుడుగా పరిచయం అయిన ట్లు చెప్పారు. డూడీ మం మంచి ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. -
ఇంటికో నలభీముడు.. జిల్లాలో ఏ ఫంక్షన్ అయినా ఆ ఊరి నుంచే..
ఆ ఊరులో ఇంటికో నలభీముడు తయారయ్యారు. వంటల తయారీలో చేయి తిరిగిన నైపుణ్యం ఆ ఊరి వారికే సొంతమైంది. భూస్వామి ఇంట.. వంటలో మెళకువలు నేర్చుకున్న సుబ్బయ్య కీర్తి జిల్లా అంతటా పాకింది. జిల్లాలో తొలి క్యాటరింగ్ ఏర్పాటుకు బీజం వేసింది. వంటలంటే.. వేగూరే అని పేరు తెచ్చి పెట్టింది. ఆ ఊరి వంటల రుచి ఎందరికో బతుకు దారి చూపింది. సాక్షి, నెల్లూరు: ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా.. షడ్రుచుల భోజనాలు వేగూరు నుంచే వెళ్తాయి. దిగువ మధ్య తరగతి నుంచి ధనవంతుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్ ఏదైనా వేగూరు రుచులు నోరూరిస్తాయి. క్యాటరింగ్ అంటే గుర్తొచ్చేది జిల్లాలోని కోవూరు మండలం వేగూరు. ఆ గ్రామానికి చెందిన సుబ్బయ్య తన చిన్నతనంలో మోడేగుంటకు చెందిన దేవెళ్ల సుబ్బరామిరెడ్డి అనే భూస్వామి వద్ద పశువుల కాపరిగా చేరారు. ఆ రోజుల్లో ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు, పని వాళ్లతో కలిపి సుమారు 60 నుంచి 70 మంది ఉండేవారు. వారందరికీ వంట చేయడం ఆ ఇంటి ఇల్లాలు తులశమ్మకు కష్టమైంది. దీంతో సుబ్బయ్యను వంట పనుల్లో సహాయకారిగా నియమించుకున్నారు. ఆమె వద్ద వంట చేయడంలో సుబ్బయ్య మెళకువలను నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన వంటల రుచుల కీర్తి జిల్లా అంతటా పాకింది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద కుటుంబాలు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వంట చేసేందుకు సుబ్బయ్యను తీసుకెళ్లే వారు. జిల్లాకు చెందిన దివంగతులు మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, నెల్లూరు నర్తకీ సినిమాహాలు యజమానులు గుండా రాజమ్మ, ఆనం కుటుంబీకులు ఇలా పలువురు ప్రముఖులు వారిళ్లలో జరిగే కార్యక్రమాలకు వంటలు చేసేందుకు సుబ్బయ్యనే పిలిపించుకునేవారు. ఆయనతో వంటలు చేయించుకునేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో ఉన్న తమ వారి కోసం తీసుకు వెళ్లే వారని స్థానికులు చెబుతున్నారు. 30 రకాల వంటలు వెజ్, నాన్ వెజ్ వంటల వెరైటీల తయారీలో వేగూరు వంట మాస్టార్లది చేయితిరిగిన నైపుణ్యం.. వారికే సొంతం. వేగూరులో తమ స్వగృహాల సముదాయాల్లోనే వంటలు తయారు చేసి జిల్లా నలుమూలలకు వాహనాల్లో పంపడం ఇక్కడి ప్రత్యేకత. శాఖాహార, మాంసాహార వంటలతో పాటు బిరియానీ, పాయ, చిల్లీ చికెన్, మటన్ బిరియానీ, వడ, పాయసం, జాంగ్రీ, లడ్డూ తదితర సుమారు 30 రకాలను తయారు చేయడం సిద్ధహస్తులు. క్యాటరింగ్ సెంటర్ వంట గది తొలి క్యాటరింగ్ ఇక్కడే జిల్లాలో తొలి క్యాటరింగ్ ఈ ఊరి నుంచే ప్రారంభమైంది. వంట మాస్టార్ సుబ్బయ్య వద్ద సహాయకారిగా ఉన్న పసుపులేటి వెంకటసుబ్బయ్య ఇళ్లలో, హోటళ్లలో వంట మనిషిగా పనులు చేయడంతో వేగూరు వంటగాళ్లకు పేరొచ్చింది. ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో ఆలోచనలో పడ్డారు. వచ్చిన పనినే నమ్ముకుని ఆదాయం పెంచుకునేందుకు పాతికేళ్ల కిందట సొంతంగా గ్రామంలోనే క్యాటరింగ్ ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆదాయం పెరగ్గా, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది యువత అదే బాట పట్టారు. ఈ గ్రామంలో సుమారు 120 క్యాటరింగ్ కేంద్రాలు నిర్వహిస్తుండగా ఒక్కో దానిలో పది నుంచి 30 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ఊరి యువత కొందరు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ తదితర నగరాల్లో క్యాటరింగ్ కేంద్రాలు హోటళ్లను ఏర్పాటు చేసుకుని రాణిస్తున్నారు. బిరియానీ తయారు చేస్తున్న మాస్టర్ ప్రతి ఇంట్లో నలభీముడున్నాడు మా గ్రామంలో ప్రతి ఇంట్లో నలభీముడు తయారయ్యారు. మా నాన్న సుబ్బయ్య ఎంతో ఇష్టంగా వంటలు చేయడాన్ని గమనించి నేనూ నేర్చుకున్నా. కొందరు నాతో పచ్చళ్లు చేయించుకుని లండన్‌లోని తమ పిల్లలకు పంపుతున్నారు. నాకు ఫోన్లు చేసి మీ రుచులు బ్రహ్మాండం అని చెబుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. గతంలో కోటలో వంటలు చేసేందుకు ఇక్కడి నుంచి మేము బాండిళ్లు, వంట సామగ్రితో ఆర్టీసీ బస్సులు ఎక్కబోతే కొందరు కండక్టర్లు తక్కువగా చూసేవారు. బస్సుల్లో సైతం ఎక్కించుకోలేదు. ఇప్పుడు సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుని వెళ్లి చేసి వస్తున్నాం. – రామిశెట్టి వెంకటేశ్వర్లు, వేగూరు -
వలస కార్మికులకు ‘ఖతర్’ కంపెనీ ఉచిత వీసాలు
మోర్తాడ్ (బాల్కొండ): వలస కార్మికులకు ఉచితంగా వీసాలు అందించేందుకు ఖతర్‌లోని ఒక క్యాటరింగ్ కంపెనీ ముందుకొచ్చింది. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి తేరుకుంటున్న సమయంలో కార్మికులపై ఆర్థిక భారం పడకుండా వీసాలను ఉచితంగా జారీ చేసేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. తెలంగాణలోని ఒక లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా వీసా ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఖతర్‌లోని వివిధ కంపెనీలు, విమానయాన రంగానికి ఆహారం సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సదరు కంపెనీ వలస కార్మికులతో ఖాళీలను భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. కిచెన్ క్లీనింగ్, వెయిటర్స్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకోసం ఈనెల 30న ఆర్మూర్‌లో, 31న సికింద్రాబాద్‌లో ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఆకర్షణీయమైన వేతనంతో పాటు వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నారు. 21 నుంచి 35 ఏళ్ల వయస్సు గల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘గతంలో వీసా కావాలంటే కార్మికులు రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కార్మికులపై ఎలాంటి భారం పడకుండా ఖతర్ కంపెనీ ఉచిత వీసాలను జారీ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం’అని జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత సతీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వలస కార్మికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. -
ఒంటరిగా వెళ్తున్న మహిళతో మాటలు.. అంతలో వెనక నుంచి..
ముంబై: ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని ముంబై చోటు చేసుకుంది. . వివరాల్లోకి వెళితే.. మహిళ తన క్యాటరింగ్ పనిని ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా నిందితుల్లో ఒకరు తెలిసినవాడు కావడంతో ఆమెను అడ్డుకున్నారు. ఇంత ఆలస్యంగా ఇంటికి ఎందుకు వస్తున్నారని ఆరా తీశారు. ఇంతలో మరో నిందితుడు ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. వాళ్ళని అడ్డుకునేందుకు మహిళ తీవ్రంగా ప్రయత్నించినప్పటికి అంతలోనే మరొకరు చేరి, ఆమె గొంతును బిగించి, ఆమెపై వాళ్ళు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నేరం చేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన తర్వాత మహిళ స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. టెక్నికల్ ఇంటెలిజెన్స్, బాధితురాలు తెలిపిన వివరాలను అనుసరించి నలుగురు నిందితుల గుర్తింపును పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఈవారం కథ: కేటరింగ్ బోయ్
చింకిచాప, అతుకులబొంత మీద పడుకున్న ఈశ్వర్ బద్ధకంగా దొర్లుతున్నాడు. జీర్ణావస్థలో ఉన్న దిండులో దూది, చిరిగిన గలేబు మృత్యుశయ్య మీద మరణానికి ఎదురుచూస్తున్న ముసలిరోగుల్లా ఉన్నాయి. వాటిని వదల్లేని ఈశ్వర్ పేదరికం కొన ఊపిరిని కాపాడాలనుకునే వెంటిలేటర్లా వెంటపడుతోంది. ‘నిన్న రాత్రి యామిని ఇచ్చిన కాగితంలో ఏమి రాసిందిరా?’ చక్రపాణి అడగడంతో జేబు తడుముకున్నాడు ఈశ్వర్. ‘చూసి చెపుతానులే’ ప్రాధాన్యంలేని విషయమన్నట్లు సమాధానం దాటేశాడు. ‘అమ్మాయి ఉత్తరం ఇస్తే ఇంతసేపు చూడకుండా ఎలాగున్నావురా?’ ‘ఇచ్చింది ప్రేమలేఖ కాదు. కాగితం ముక్క’ ‘నిన్ను మార్చడం నా వల్ల కాదురా’ తల కొట్టుకున్న చక్రపాణి, మరోమాట చెప్పకుండా ఆఫీసుకెళ్లాడు. ఈశ్వర్‌కి మూడేళ్ళ క్రితం దూరమైన యామిని గుర్తొచ్చింది. చదువుకునేరోజుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. స్థాయీ అంతరం అంతరంగాల ప్రేమకి అడ్డం పడింది. కల కరిగిపోయి యామిని పెళ్లి జరిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు గుండెకైన గాయం రేగింది. తేనెపట్టులోంచి రాయిదెబ్బకు ఎగిరిన తేనెటీగలా ముందురోజు జరిగిన సంఘటన మెదడులో మెదిలింది. ‘ఈశ్వర్, నువ్వు లక్కీచాన్స్ కొట్టేశావ్. నాలుగ్గంటలు పనిచేస్తే ఐదువందలు ఇస్తారు. భోజనం బోనస్’ చక్రపాణి చెప్పాడు. ‘నాలుగ్గంటలకు ఐదువందలా?’ నోరు వెళ్లబెట్టాడతను. ‘తర్వాత ఆశ్చర్యపోదువుగానీ పార్టీటైమ్ అయిపోతోంది. మా హోటల్ కేటరింగ్ సర్వీసుకి రెగ్యులర్ కుర్రాళ్లురాలేదు. మేనేజర్ నాకు తెలుసున్న కుర్రాళ్లని తీసుకురమ్మనాడు’ ‘వద్దులేరా. నాకు వడ్డించడంలో ఓనమాలు తెలియవు. అన్నం లేకపోతే నీళ్లు తాగి, కాళ్ళు కడుపులో పెట్టుకునిç ³డుకుంటాను. తేడా జరిగితే తిట్లు తినాలి’ ‘ఆ సంగతి నాకు వదిలేయ్ నేన ుచూసుకుంటాగా’ చక్రపాణి ధైర్యం చెప్పడంతో యూనిఫాం వేసుకుని కేటరింగ్ బోయ్‌గా బండి ఎక్కాడు ఈశ్వర్. పెద్ద వాళ్ళింట్లో పార్టీ. గుబులుగానే గుంపుతో అడుగులేశాడు. వణుకుతున్న చేతులతో చెంచా పట్టుకుని వడ్డనకు సిద్ధపడ్డాడు. ధైర్యం కుదుటపడుతున్న సమయంలో తనకళ్ళని తానే నమ్మలేక పోయాడు ఈశ్వర్. యామిని.. మూడేళ్ళ తర్వాత .. కనిపిస్తోంది. భర్తతో పార్టీకొచ్చింది. ఆమె నడచి వస్తున్న నగల దుకాణంలా ఉంది. ఆమె వేసుకున్న నగల విలువ అంచనాకి అందని టెండర్లా ఉంది. వజ్రాలహారం మీద పడ్డ దీపాలకాంతి మొహం మీద పడుతూ దేవకన్యలా వెలిగిపోతున్న ఆమెను మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోంది. తెలియని బెరుకు వెనక్కి లాగేస్తోంది. అక్కడున్న జనం మహారాణి ముందు భటుల్లా వంగివంగి దండాలు పెడుతున్నారు. ‘మీకేం కావాలో చెప్పండి మేడం.. తెప్పిస్తా’ పళ్ళెంతో వెళ్తున్న యామినిని ఆపే ప్రయత్నం చేశాడో పెద్దమనిషి. యామిని ఆగలేదు. ఎవరినీ పట్టించుకోకుండా ఈశ్వర్ వైపే వెళ్తోంది. ఐదువందలకు ఆశపడ్డ ఈశ్వర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా వుంది. ఆమె కంటపడకుండా చేసిన ప్రయత్నం ఫలించేలా లేదు. యామిని దగ్గరకు వచ్చేస్తోంది. అతనిలో ఉద్విగ్నత పున్నమిరాత్రిలో సముద్రపోటులా పెరుగుతోంది. అతని పట్ల యామిని చూపుల్లో చులకన భావం కనిపించింది. ఆమె ఆలోచనల్లో మార్పొచ్చినట్లు ఆమె చూపులను బట్టి అర్థమవుతోంది. వెళ్లిపోతున్న యామిని.. కాగితమొకటి ఈశ్వర్ వైపుగా విసిరేసి వెనక్కి చూడకుండా వెళ్లిపోయింది. ఈశ్వర్æఆ కాగితాన్ని అసంకల్పితంగా జేబులో పెట్టాడు. గమనించిన చక్రి ‘యామిని ఏం విసిరిందిరా?’ అని అడిగాడు. సమాధానం చెప్పకుండా యూనిఫాం మార్చేసుకున్నాడు ఈశ్వర్. తర్వాత వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఇంటికి బయల్దేరారు. వాళ్ళతోపాటుగా మౌనం, చీకటీ అడుగులేస్తున్నాయి. రోడ్డు మీద గుంతల్లో నిలిచిపోయిన వర్షం నీళ్ళలో చిక్కటి చీకటి నల్లగా ఆక్రమించింది. దూరంగా కీచురాళ్ళ మోత వినిపిస్తోంది. వీధిలో అలికిడికి కుక్కలు మొరుగుతున్నాయి. ఈశ్వర్ గుండె బరువు.. యామిని వేసుకున్న నగల బరువు కన్న ఎక్కువగానే ఉంది. నియంత్రణ లేని నిశ్శబ్దం.. ఓపలేని నిశ్శబ్దం.. గుండె చప్పుడు వినిపించేంత నిశ్శబ్దం. మనిషి మోయలేనంత బరువుగా నిశ్శబ్దం. ఆ భయంకర నిశ్శబ్దంలోంచి అతనిలో ఊపిరి ఆగిఆగి తెరలుగాౖ బెటకొస్తోంది. ‘తప్పు చేశానురా చక్రీ.. ఈ అవమానం పడే కన్నా ఆకలిని భరించడమే హాయిగా ఉండేదేమో?’ ‘తప్పంతా నాదేరా! నేనే బలవంతంగా తీసుకొచ్చాను. ఒక్కసారి ఆ కాగితం..’ ‘ఇప్పుడు వద్దురా. చూస్తే తట్టుకునే శక్తి..’ ఈశ్వర్ ఏదో చెప్పబోయాడు. మాట పెగలటం లేదు. గొంతుకి బాధ అడ్డం పడుతోంది. మాట్లాడుకోకుండానే రూమ్కెళ్లారు. బద్ధకాన్ని వదుల్చుకున్న ఈశ్వర్‌కు.. పార్టీలో గుచ్చుకున్న యామిని చూపులు గుర్తుకొచ్చాయి. జేబులో కాగితం కసిగా నలిపేసి విసిరేశాడు. కాగితంలో ఏం రాసుంటుందనే ఆలోచన మనసుని స్థిమితంగా ఉంచలేదు. విసిరేసిన కాగితాన్ని తెచ్చుకుని విప్పిచూశాడు. ‘రెండురోజుల తర్వాత ఇంటికిరా’ కింద మొబైల్ నంబర్, అడ్రస్ రాసుంది. ‘ఏం రాసిందిరా మాజీప్రియురాలు?’ ఆఫీస్ నుంచి వస్తూనే అడిగాడు చక్రి. ‘అసలు ఎందుకు రమ్మందంటావు?’ చక్రపాణి చేతికి కాగితమిస్తూ అనుమానం బైట పెట్టాడు ఈశ్వర్. ‘హీనస్థితి గుర్తుచేసి అవమానించాలని పిలిచిందా!’ మనసులో సందేహం బైట పెట్టాడు. ‘అవమానించడానికి పిలవక్కర్లేదు. పార్టీ విషయమైతే తప్పు నా వల్ల జరిగిందని చెప్పు’ ‘వెళితే తెలుస్తుందిగా. అప్పుడు చూద్దాంలే. ఇప్పుడైతే వేడిగా టీతాగుదాం..’ సంభాషణ పొడిగించడం ఇష్టంలేక బైటికి తీసుకెళ్లాడు ఈశ్వర్. ∙∙ ఈశ్వర్ పెద ్దభవంతి ముందు నిలబడ్డాడు. నల్లటి గ్రానైట్ రాయి మీద బంగారు రంగు అక్షరాలతో ‘యామిని నిలయం’ అని అందంగా చెక్కి ఉంది. ఇంటి ముందు ఒకే నెంబరున్న కార్లు బారులు తీరి క్రమశిక్షణగా ఉన్నాయి. ఇల్లులా అనిపించలేదు. రక్షణవలయం మధ్య దుర్భేద్యమైన కోటలా కనిపించింది. లోపలికి వెళ్తున్న ఈశ్వర్ వేషం, భాష చూసిన సెక్యూరిటీ ఆపేశాడు. ‘యామిని మేడమ్‌కి ఈశ్వర్ వచ్చాడని చెప్పండి’ అనడంతో సెక్యూరిటీ ఫోన్లో మాట్లాడి, ‘మేడం మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు సార్’ అన్నాడు వినయంగా. లోపలికి నడిచాడు. పాలరాతి మెట్లు పాదముద్రలకు మాసిపోతాయని భయంతో పదిలంగా అడుగులేస్తున్నాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే సినిమా సెట్టింగ్లాంటి విశాలమైన హాల్. సీలింగుకి ఖరీదైన షాండిలియర్ వేలాడుతోంది. సూర్యుడు మకాం వేసినట్లు ఇంట్లో దీపాల వెలుగుకి కళ్ళు జిగేల్మంటున్నాయి. ఇల్లు్లవజ్రాలు పొదిగిన హారంలా ధగధగ లాడిపోతోంది. ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఇల్లంతా కలయ చూస్తున్నాడు. ఘల్లుఘల్లుమంటూ మెట్ల మీద నుంచి వస్తున్న మువ్వల చప్పుడుకి అటుగా చూశాడు. పూత పూసిన దర్పం నిలువెత్తు యామినై నడిచి వస్తున్నట్లుంది. ఆమెను చూసిన ఈశ్వర్ స్థాణువులా నిలబడి పోయాడు. ‘నిలబడ్డావేం? కూర్చో’ సోఫా చూపించింది. ఖరీదైన సోఫాలో కూర్చోడం ఈశ్వర్‌కి ఇబ్బందిగా అనిపించింది. ‘ఏం తీసుకుంటావ్.. కాఫీ,టీ, బోర్న్‌విటా , ఫ్రూట్ జ్యూస్?’ ‘ఒక గ్లాస్ మంచి నీళ్లు’ అంటూ ఈశ్వర్ చెప్పిన తీరుకి యామిని నవ్వింది. నవ్వినప్పుడు తళుక్కుమని మెరిసిన పన్ను పైన పన్ను చూస్తూ అలాగే ఉండిపోయాడు. లిఫ్ట్‌లోంచి పనమ్మాయి రెండు నీళ్ల గ్లాసులున్న ట్రేతో వచ్చింది. ఇంట్లో లిఫ్ట్ ్టఉండడం ఈశ్వర్ ఊహకందని విషయం. ‘ఇల్లు చాలా బాగుంది’ మంచినీళ్ళు గుటకలేస్తూ అన్నాడు. ‘కాఫీ తీసుకురా’ పనమ్మాయికి ఆర్డర్ వేసింది యామిని. ‘మూడు అంతస్తుల్లో పద్దెనిమిది గదులు ఉన్నాయి. మావారు నా పుట్టిన రోజు కానుకగా ‘యామిని నిలయం’ కట్టించారు’ మనసులోని అహంకారం మాటల్లో ధ్వనించింది. ‘ఇంట్లో ఎంతమంది..’ ఈశ్వర్ మాట పూర్తికాకుండానే చెప్పింది ‘మేమిద్దరమే’ అంటూ. ‘ఏమిటి పద్దెనిమిది గదుల్లో ఇద్దరే ఉంటారా?’ఆశ్చర్యపోయాడు. ‘ప్రస్తుతం ఒక్కదాన్నే ఉన్నాను. ఆయన బిజినెస్ పని మీద లండన్ వెళ్లారు’ ట్రేలోని కెటిల్స్, కప్పులతో వచ్చిన పనమ్మాయిని వాటిని టీపాయి మీదపెట్టి వెళ్లిపొమ్మని సైగ చేసింది యామిని. శిరసా వహించింది పనమ్మాయి. అక్కడ ఉన్న ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం అధికారం చెలాయిస్తోంది. ఒక కెటిల్లోంచి కాఫీ డికాక్షన్, మరో కెటిల్లోంచి పాలు కప్పులో పోసింది. దాంట్లోషుగర్ క్యూబ్స్ వేసి చెంచాతో కలిపి కప్పుని సాసర్లో పెట్టి అందించింది. కప్పుల చప్పుడుకి నిశ్శబ్దం చెదిరి పోయింది. కప్పు అందుకుంటుంటే ఈశ్వర్ చేతులు వణికాయి. ‘చేతులెందుకు వణుకుతున్నాయి?’ ‘ఏంలేదు’ మాటలు కూడా తడబడ్డాయి. ‘నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు’ హఠాత్తుగా అనేసింది. ‘ఏ పని?’ అర్థంకానట్లు అడిగాడు. ‘ఆరోజు పార్టీలో..’ మొహంలో చికాకు స్పష్టంగా కనబడింది. ‘అవసరం చేయించింది’ ‘నీ అవసరం డబ్బేనా?’ పర్సులోంచి నోట్ల కట్టలు తీసి టీపాయి మీద విసిరింది. ‘ఇంకా కావాలా? అవసరమైతే అడుగు’ మాటల్లో డబ్బు పొగరు కనిపించింది. ఆ క్షణంలో ఈశ్వర్‌కు వచ్చిన కోపం విద్యుత్తీగలో కనబడకుండా కదిలిన కరెంటులా ఉంది. తనని తాను సంభాళించుకున్నాడు. మౌనంగా డబ్బు తీసి పక్కన పెట్టాడు. ముట్టుకుంటేనే నిప్పు కాలుతుంది. ఆకలి బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. పైకిరాని మాటలు మనసులోనే కొట్టుకుంటున్నాయి. ఆత్మాభిమానానికున్న శక్తి గుండెల్ని బలంగా తట్టి లేపింది. ‘నీ పెళ్ళికి బహుమతి ఇవ్వలేదని బాధపడేవాడ్ని. ఇల్లు చూశాక ఇవ్వకపోవడమే మంచిదనిపించింది. ఈ ఇంటిలో నీకంటికి చిన్నదిగానే కనబడేది’ అతనన్న మాటకు ఆమె నవ్వింది. ఆ నవ్వులో అహంకారం కనిపించింది. ‘ నువ్వు మరచిపోలేని విలువైన బహుమతి ఇద్దామని ఉంది. చిన్నకోరిక తీరుస్తావా?’ లేచి నిలబడ్డాడు. ఊహించని ప్రశ్నకు యామిని కంగారు పడింది. ‘కంగారుపడకు. పెళ్ళైన స్త్రీని కోరుకునేంత బలహీనుడ్ని కాదు’ చెపుతోంటే స్వచ్ఛమైన సరస్సులో నిర్మలమైన పున్నమిచంద్రుడి ప్రతిబింబంలా ఉన్నాడు ఈశ్వర్. ‘ఏమిటో చెప్పు’ కంగారుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో అడిగింది. ‘మనమిద్దరం కలసి భోజనం చేయాలి’ ‘ఓస్! ఇంతేనా? నీకేం కావాలో చెప్పు. గంటలో ఏర్పాటు చేస్తా’ అంటూ పక్కనున్న బెల్ కొట్ట బోయింది. ‘ఇక్కడ కాదు. బైటకెళ్లాలి’ ఆశ్చర్యంగా చూసింది. ఆమెకు ఈశ్వర్ కొత్తగా కనిపించాడు. ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు అతను. ఆలోచిస్తోంది యామిని. అంగీకరించదనిపించి సోఫాలోంచి లేచి గుమ్మం వైపు కదిలాడు ఈశ్వర్. ‘అగు!’ అన్న ఆమె పిలుపుతో ఆగిపోయాడు ఈశ్వర్. ‘సరే! నీకోసం ఒప్పుకుంటున్నా. ఏ హోటల్‌కు వెళ్దాం?’ ‘నేను తీసుకెళ్ళేది స్టార్ హోటల్ కాదు. నా స్థాయి హోటల్. మనం వెళ్ళేది ఆటోలో’ ‘ఆటొలోనా? నా ఇంటి ముందున్న కార్లను చూసే చెప్తున్నావా? నేను గుమ్మం దాటితే ఏ కారు ఎక్కుతానో ఆఖరి క్షణం వరకు నాకే తెలియదు. అలాంటిది నాగుమ్మం ముందే ఆటో ఎక్కితే..’ ‘నాలాంటి పేదవాడికి ఆటోలో వెళ్లడమంటే విమానంలో ఎగిరినట్టే. ఖరీదైన కార్లు ఎక్కే అర్హత లేనివాడ్ని. ఆటోలో వస్తే పనివాళ్ళ ముందు చులకన కదా! నీకు ఇబ్బందనిపిస్తే వద్దులే’ ఆమెలో అహాన్ని మాటలతో రాజేశాడు. ‘ఆఫ్ట్రాల్, నా దగ్గర పనిచేసే వాళ్ళ మాటల్ని నేను పట్టించుకోవడం ఏంటి? నాన్సె¯Œ ్స’ అంటూ బయలుదేరింది యామిని. ఇద్దరూ బయటకు నడిచారు. కారు లేకుండా తొలిసారిగా కాలి నడకన బయటకు వస్తున్న యామినిని చూసినవాళ్లు ఆశ్చర్య పోయారు. ఈశ్వర్ ఆటోని పిలిచేముందు జేబు తడుముకున్నాడు. కరెన్సీ నోటు స్పర్శ తగిలి ధీమాగా ఆటోఎక్కాడు. అతని దృష్టంతా తిరుగుతున్న ఆటో మీటర్ మీదే ఉంది. పైకి మాత్రం మొహమాటంగా నవ్వుతున్నాడు. ఆటో సిటీకి దూరంగా ఉన్న హోటల్ ముందు ఆగింది. ఇద్దరూ ఆటో దిగారు. తిరిగి ఇచ్చిన చిల్లర లెక్కపెట్టుకున్నాడు. హోటల్లోకి వెళ్ళాడు. జనంతో హోటల్ కిక్కిరిసి ఉంది. ‘టిఫిన్ తేవడానికి ఇంకా ఎంతసేపు?’ అంటూ హోటల్లోపల నుంచి అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ‘యామినీ.. లోపల ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మరో చోటకెళదామా?’ బైటకొచ్చి చెప్పాడు. ‘ముందే సీట్లు రిజర్వ్ చేయవలసింది ’ ఆమెలో విసుగు మొహం మీద కనిపించింది. ‘ఈ హోటల్లో బుకింగ్స్ ఉండవు. అందరికీ సదా స్వాగతమే’ నవ్వుతూ చెప్పాడు. ఇద్దరూ మరో హోటల్ వైపు నడిచారు. అక్కడ జనం కన్నా టేబుల్ మీద బొద్దింకలు, ఈగలే ఎక్కువగా ఉన్నాయి. చికాకుగా మొహంపెట్టి ‘ఇక్కడొద్దులే ఈశ్వర్. మరో చోటకు వెళదాం’ అంది. వేసవి ఎండ మండి పోతోంది. వడగాల్పులకు వదిలే శ్వాస వేడిగా వస్తోంది. నడవలేక యామిని ఆపసోపాలు పడుతోంది. నుదుటి మీద చెమటను రూమాలుతో తుడుచు కుంటోంది. దాహంతో గొంతు పిడచకట్టుకు పోతోంది. యామిని మొహంలో అలసట, కళ్ళలో నీరసం కనిపిస్తున్నాయి. ‘ఇక నావల్ల కావటంలేదు. ఆకలి చంపేస్తోంది. అర్జెంటుగా ఏదోకటి తినాలి’ అంటూ రోడ్డు పక్కన చెట్టు నీడలో నిలబడిపోయింది. ‘నా పరిస్థితీ అదే. మరో కిలోమీటర్ దూరం దాకా హోటల్స్ ఏం లేవు కానీ దొసెల బండి ఉంది. అక్కడ దోసెలు బాగుంటాయి తిందామా?’ అన్నాడు. ‘చెప్పానుగా ఎక్కడోక్కడ.. ఏదోకటి..! ఆకలితో కాలే కడుపుకి మండే బూడిద అంతే’ ‘బండి దగ్గర నిలబడి నువ్వు తినలేవులే. ఇక్కడే కూర్చో. నేనేతెస్తా’ అంటూ దోసెల బండి దగ్గరకు వెళ్లి దోసెలు తెచ్చాడు. అవురావురంటూ నాలుగు దోసెలు తినేసింది. ఎక్కిళ్ళు వస్తుంటే ఈశ్వర్ ఇచ్చిన కుండలో నీళ్లను గడగడా తాగేసింది. అప్పుడు యామినికి మినరల్ వాటర్ గుర్తుకు రాలేదు. ఆకలి తీరాక ఆయాసం తీర్చుకుంటోంది. వచ్చి నెమ్మదిగా పక్కనే కూర్చున్నాడు ఈశ్వర్. ‘ప్రపంచంలో విలువైనది, మనిషి బతకడానికి కావలసిందేమిటి?’ అని అడిగాడు. ఒక క్షణం ఆలోచించి ‘డబ్బు’ అంది. బిగ్గరగా నవ్వాడు ఈశ్వర్. ఆసహనంగా చూసింది యామిని. ‘డబ్బులో పుట్టిపెరిగిన నీకు అదే తెలుసు’ ‘దరిద్రం నుంచి వచ్చిన వాడివిగా నీకు తెలిసిందేమిటో చెప్పు’ కోపంతో ఆమె మాట అదుపు తప్పింది. ‘నిజమే.. నేను పేదరికంలో పుట్టాను. దరిద్రంలోనే బతుకుతున్నాను. నా బతుకు దరిద్రానికి కేరాఫ్ ఎడ్రస్. దరిద్రుడు అనేది నాలాంటి వాళ్ళకుండే బిరుదు’ ఈశ్వర్ శాంతంగా సమాధానం చెపుతోంటే యామిని తప్పు తెలుసుకుంది. ‘సారీ ఈశ్వర్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను’ ‘ఫర్వాలేదు. చదివించిన తల్లితండ్రులకి చేదోడుగా ఉండి ఋణం తీర్చుకోలేని దౌర్భాగ్యుడిని. నన్ను ఆ మాటనడం సబబే. నన్ను మీ ఇంట్లో ఓ ప్రశ్న అడిగావు.. గుర్తుందా?’ ఏమిటన్నట్లుచూసింది. ‘పార్టీలో కేటరింగ్ సర్వీస్ ఎందుకు చేశావని’ గుర్తు చేశాడు. అవునన్నట్లు తలూపుంది యామిని ‘నన్ను అభిమానించే వ్యక్తిగా నీకు నా బతుకు పట్ల బాధ సహజం. కానీ మీ జీవితాల్లాగా మాలాంటోళ్ల బతుకు వడ్డించిన విస్తరి కాదు. మెతుక్కోసం వెతుక్కునే బతుకులు మావి. నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళడం కోసం ఏ పనైనా చేస్తాం. నేను అదే చేశాను. కడుపులో ఆకలి మంటని ఆర్పడం కోసం కేటరింగ్ బోయ్ పని చేశాను’ అని చెపుతోంటే ఈశ్వర్ గొంతు గాద్గదికమైంది. అక్కడున్న గ్లాస్‌లోని నీళ్లను గుటకేసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఎన్నో స్టార్ హోటల్స్ చూసిన నువ్వు రోడ్డు పక్క బండిలో దోసెలు తిన్నావు. మినరల్ వాటర్ తాగే నువ్వు ఎప్పటి నీళ్ళో తెలియకుండానే కుండలో నీళ్ళు తాగావు. అదే ఆకలికున్న శక్తి. ఆకలేస్తే తినేది అన్నం. కరెన్సీ నోట్లు కావు. కోట్ల విలువైన భూములు కొన్నివేల ఎకరాలుండచ్చు. ఎవరికైనా కావలసింది ఆరు అడుగులే. అలాగే జానెడు పొట్టకు కావలసింది పిడికెడు మెతుకులే. ఎవరైనా ఆకలికి బానిసే. ఎంతటి వారైనా ఆకలికి దాసులే. ఆకలి ప్రపంచాన్ని శాసిస్తుంది. అందుకే సకల చరాచార సృష్టిలో విలువైనది ఆకలి. ఈ విషయం నీకు ఇంటి దగ్గరే చెప్పచ్చు. ఆకలి విలువ అనుభవపూర్వకంగా నీకు తెలవాలని ఈ పని చేశాను. మన్నించు’ మనసులో కొట్టుకుంటున్న మాటలు చెప్పి బరువు దించుకున్నాడు. ‘నేను ఇచ్చిన డబ్బులు తీసుకుని ఆకలిని తీర్చుకోవచ్చు కదా!’ ‘కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదో కాదు. అప్పుడే దాని విలువ తెలుస్తుంది. ముష్టితో బతికే బతుకు బతుకు కాదు. దొంగతనం చేసి సంపాదించవచ్చు. ఆ పని ఆత్మహత్యతో సమానం. మన సంపాదనలో నైతికత ఉండాలి. మనం చేసే పనివల్ల పరువు పోకూడదు. మన వల్ల పనికి గుర్తింపు రావాలి. పనిలో ఎక్కువ తక్కువలు చూడకూడదు. నిజాయితీతో ఆకలి తీరాలి. కుదిరితే నలుగురికి ఆకలి తీర్చాలి’ అంటూ పక్కనున్న గ్లాసులో మిగిలిన గుక్కెడు నీళ్లనూ గొంతులో పోసుకున్నాడు. యామినికి లిప్తపాటుకాలం ఆకలిని తట్టుకోలేక పోయిన నిజం గుర్తొకొచ్చింది. నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈశ్వర్ మాటల్లో నిప్పులాంటి నిజం ఆమెలో అహాన్ని కాల్చేసిన వాసన అక్కడ మెల్లగా వ్యాపిస్తోంది. అనుభవ పాఠాల్లో ఆరితేరిన అతన్ని చూస్తోంది.. అటుగా వస్తోన్న ఆటోని ఆపడానికి లేచాడు. అతనిని అనుసరించింది ఆమె. - పెమ్మరాజువిజయరామచంద్ర -
ఫుడ్ ..సారీ నో ఆర్డర్..
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ దెబ్బకు ఫ్లైట్ కేటరింగ్ సంస్థలు కుదేలయ్యాయి. ఎనిమిది నెలలుగా కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోయాయి. మరోవైపు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం పడింది. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిరోజు సుమారు 7500 నుంచి 8 వేలకు పైగా అల్పాహారాలు, భోజనాలు, స్నాక్స్ సరఫరా చేసే స్కైచెఫ్ సంస్థ ప్రస్తుతం రోజుకు 1200 నుంచి 1300 మీల్స్ మాత్రమే అందజేస్తోంది. ప్రస్తుతం స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా, విస్తారా, బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 12 విమానాలకు మాత్రమే ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన స్కైచెఫ్ గతంలో అనేక అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు ఆయా దేశాలకు చెందిన ఆహార పదార్థాలు, స్నాక్స్ అందజేసేది. జర్మనీకి చెందిన ఎల్ఎస్జీ సంస్థ కూడా హైదరాబాద్ కేంద్రంగా పలు జాతీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు కేటరింగ్ సదుపాయాలను అందజేసింది. కానీ ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు మాత్రమే ఈ సదుపాయాన్ని కొనసాగిస్తోంది. పడిపోయిన ఆర్డర్లు.. కేటరింగ్ సంస్థలకు ఎయిర్‌లైన్స్ నుంచి వచ్చే ఆర్డర్లు కోవిడ్ కారణంగా 75 శాతం వరకు పడిపోయాయి. కోవిడ్‌కు ముందు ప్రతి రోజు సుమారు రూ.2 కోట్ల చొప్పున ఆర్జించిన స్కైచెఫ్ ప్రస్తుతం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకే పరిమితమైంది. ప్రయాణికులకే కాకుండా ఎయిర్‌లైన్స్ క్రూ సిబ్బందికి, పైలెట్లకు కూడా ఈ సంస్థ ఎవరికి కావాల్సిన ఆహార పదార్థాలను వారికి విడివిడిగా అందజేస్తోంది. ప్రస్తుతం వందేభారత్, ఎయిర్ బబుల్స్ ఒప్పందంలో భాగంగా లండన్‌తో పాటు మరికొన్ని సౌదీ అరేబియా దేశాలకు మాత్రమే విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి మరో 40 నగరాలకు డొమెస్టిక్ విమానాలు తిరుగుతున్నాయి. గతంలో ప్రతి రోజు 55000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా ప్రస్తుతం ఆ సంఖ్య 2వేల నుంచి 22వేలకు పరిమితమైంది. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా తక్కువే. మరోవైపు కోవిడ్ దృష్ట్యా చాలా మంది ప్రయాణికులు ఇంటి వద్దే తయారు చేసిన ఆహార పదార్థాలను వెంట తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం కోవిడ్ దృష్ట్యా కేటరింగ్ సంస్థల ఆహార పదార్థాలకు ఆదరణ తగ్గినప్పటికీ సాధారణంగా అయితే ప్రయాణికులు ఎక్కువగా హైదరాబాద్ బిర్యానీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత మసాలా దోశ, వడ, ఊతప్పం, టోమాటో ఉప్మా వంటి దేశీయ అల్ఫాహారాలు, ముస్లీ, పాన్కేక్, చికెన్ బ్రస్ట్, పాస్తా, చీజ్, లాంబ్ రోస్టెడ్, వెజ్‌పఫ్ వంటి అంతర్జాతీయ వంటకాలున్నాయి. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం.. కోవిడ్ దృష్ట్యా అప్రమత్తంగా ఉన్నాయి. విమానాల్లోకి ఆహార పదార్థాలను చేరవేసే హై లోడర్లు, ట్రక్కులతో పాటు డిషెష్ సహా అన్నీ శానిటైజ్ చేస్తున్నాం. వంటపాత్రలు ప్రతిరోజు స్టెరిలైజ్ చేస్తున్నాం. ఉష్ణోగ్రతలు కచి్చతంగా పాటిస్తున్నాం. సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం,. – అరుణ్, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, స్కై చెఫ్ -
ఫైవ్ స్టార్ హోటల్‌ను తలదన్నేలా..
సాక్షి, అశ్వారావుపేట( ఖమ్మం) : అది ఐదు నక్షత్రాల (ఫైవ్ స్టార్) హోటల్ కాదు. కనిపించీ కనిపించని లైటింగ్ ఉండదు. యూనిఫాం వేసుకుని వడ్డించే వారు అక్కడ కనిపించరు. కానీ, ప్లేట్లో ఉండే ఐటెమ్‌లు మాత్రం ఫైవ్ స్టార్ హోటల్‌ను తలదన్నేలా ఉంటాయి. అక్కడి రుచి అలాంటి హోటళ్లను మైమరిపిస్తాయి. 20 రకాల కూరలతో భోజనం, 20 రకాల ఐటెంలతో టిఫిన్ ఆరగిస్తూ అక్కడి ప్రజలు నూతన అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఇదంతా అశ్వారావుపేటకు చెందిన, చేయి తిరిగిన చెఫ్ మున్నా చేస్తున్న అద్భుతం. తొలుత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి తీసేసి, ప్రస్తుతం కేటరింగ్ మారి సక్సెస్ సాధించాడు. ప్లేట్ భోజనం రూ.250 అయినప్పటికీ అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే అతడి చేయి నుంచి వచ్చిన వంటలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అశ్వారావుపేటకు చెందిన చెఫ్ మున్నా తొలుత విశాఖపట్టణంలో హోటల్లో వంటలకు సంబంధించిన కోర్సు చేశాడు. అనంతరం వంటల్లో ప్రావీణ్యం సంపాదించాడు. స్వగ్రామమైన అశ్వారావుపేటలో హోటల్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను నిర్వహించాడు. అశ్వారావుపేట వంటి గ్రామీణ ప్రాంతంలో వ్యాపారం ముందుకు సాగక దానిని నిలిపివేశాడు. కానీ, మున్నా వంటకాలకు అలవాటు పడిన సన్నిహితులు, బంధుమిత్రులు తమ ఇంట్లో జరిగే వేడుకలకు మున్నాను సలహాలు, సూచనలతో మెనూ సిద్ధం చేసేవారు. అలా అలా పలు శుభకార్యాలకు మున్నా మార్క్ చూపించాడు. దీంతో పలు సమావేశాలకు వీఐపీ భోజనం కావాలంటే అశ్వారావుపేటలో మున్నాను ఆశ్రయించాల్సిందేననే పేరు సంపాదించాడు. వంటను ఓ ప్రవృత్తిగా భావించి ఐదేళ్లపాటు ఎలాంటి ఫీజు లేకుండా వంటలు చేసిన మున్నా మిత్రుల కోరిక మేరకు క్యాటరింగ్ రంగంలోకి బలవంతంగా అడుగుపెట్టాడు. ఒక్కో తలకు భోజనం వెల రూ.250 మాత్రమే. అంత ఖరీదైన భోజనం.. అదీ అశ్వారావుపేటలో అంటే కొందరు ముక్కున వేలు వేసుకున్నారు. కానీ, అందులోని భిన్న రకాల కూరలు తెలుసుకున్నాక ఆ ధర సరైనదేనని ప్రజలు భావించారు. చూస్తే నోరూరాల్సిందే మున్నా మెనూను చూడగానే కడుపు నిండుతుందని భోజన ప్రియులంటున్నారు. వెజ్ స్టార్టర్స్, ఫ్రూట్స్ స్నాక్స్, చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు ఒకే ప్లేట్లో వడ్డించడం మున్నా ప్రత్యేకత. వంకాయ, పెరుగు చట్నీ, కొబ్బరి అన్నం, ఉలవచారు చికెన్, ఉలవచారు ఎగ్, గోంగూర బోటీ, పుష్కా, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి దోశ, జొన్న దోశ, రాగి సంగటి, జొన్న సంటి, నాటుకోడి, ఇంకా ఫ్రూట్‌జ్యూస్‌లు ఇలా అతడు చేసే ఏ వంటకమైనా అదిరిపోవాల్సిందే. 20 రకాల వంటకాలతో టిఫిన్, 20 రకాల ఐటమ్స్‌తో భోజనం, 10 రకాల పండ్లతో స్టార్టర్స్.. ఇలా రంగురంగుల పండ్లతో కళ్లు జిగేల్ మనిపిస్తుంటాడు. ఓసారి మున్నా మెనూ వింటే ఎంతయినా తినాలనిపిస్తుందని పలువురు చెబుతున్నారు. అశ్వారావుపేటకు అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే కొందరు ప్రముఖులు మున్నా మెనూకు ముగ్ధులవుతుంటారు. హైదరాబాద్ వచ్చేయమని కోరుతుంటారు. కానీ, మున్నా సున్నితంగా తిరస్కరిస్తాడు. మున్నా తల్లి భారతికుమారి ఐసీడీఎస్‌లో సీడీపీఓగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పోషకాలతో కూడిన వంటకాలపై ఆమెకున్న పట్టు మున్నాకు వారసత్వంగా వచ్చింది. తల్లి ఆశీస్సులతో తల్లి సమక్షంలోనే నాణ్యమైన వంటలు అందిస్తానంటున్నాడు మున్నా. చాలా ఖరీదైన మెనూ కాబట్టి అశ్వారావుపేట వంటి గ్రామీణ ప్రాంతంలో కొనసాగడం గొప్ప విషయమే. అయితే, మున్నా మెనూ టేస్ట్ చేయాలంటే అశ్వారావుపేట వచ్చి ముందుగా 99856 61117 నంబర్‌కు ఆర్డర్ ఇవ్వాలి. ఎందుకంటే హోటల్‌లా నిత్యం సమయానికి వండి సిద్ధంగా ఉంచరు కదా. -
ట్రైన్–18లో క్యాటరింగ్ చార్జీలు తప్పనిసరి
న్యూఢిల్లీ: త్వరలో పట్టాలెక్కబోతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్–18)లో క్యాటరింగ్ చార్జీలు కూడా టికెట్ చార్జీలతో కలిపి ముందే చెల్లించాల్సి ఉంటుంది. శతాబ్ది, రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్‌లోలాగా ఆప్షనల్‌గా తిరస్కరించడానికి ఉండదని అధికారులు వెల్లడించారు. అయితే అలహాబాద్–వారణాసి మధ్యలో ఎక్కే ప్రయాణికులకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఈ నెల 15న వారణాసి నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కనుంది. ‘క్యాటరింగ్ చార్జీలు రైల్వే టికెట్ ధరల్లోనే కలిసుంటాయి. ఈ రైలులో రెండు రకాల క్యాటరింగ్ చార్జీలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఢిల్లీ నుంచి వారణాసి వరకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కింద రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఉంటుంది. చెర్‌కార్ అయితే అదే భోజన సదుపాయాలకు రూ.344 చెల్లించాల్సి ఉంటుంది. స్టేషన్ల బట్టి ఈ చార్జీల్లో మార్పులుంటాయి. కాగా ఈ రైలు మొత్తం 755 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 8 గంటల్లో ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తుంది. ఈ రైలుకు కాన్పూర్, ప్రయాగరాజ్ స్టేషన్లలో స్టాపులుంటాయి. -
వేతన జీవులకు మరో బ్యాడ్‌న్యూస్
న్యూఢిల్లీ : మధ్యతరగతి ప్రజలకు లేదా వేతన జీవులకు మరో షాకింగ్ న్యూస్. ఫ్యాక్టరీలు లేదా ఆఫీసు క్యాంటీనల్లో అందించే కేటరింగ్ సర్వీసులపై జీఎస్టీని 5 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. ఈ విషయాన్ని గుజరాత్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్) తెలిపింది. సర్వీసులపై జీఎస్టీ పెంపును ఏఏఆర్ ప్రతిపాదించిన అనంతరం ఆఫీసులు, ఇండస్ట్రీ క్యాంటీన్లలో అందించే కేటరింగ్ సర్వీసులపై 18 శాతం రేటు అమల్లోకి వస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. 28.06.2017 నాటి సెంట్రల్ ట్యాక్స్ నోటిఫికేషన్ నెం.11/2017 ప్రకారం అవుట్డోర్ కేటరింగ్ సర్వీసుల కింద ఆఫీసులు, ఇండస్ట్రీ క్యాంటిన్లకు అందించే కేటరింగ్ సర్వీసులపై 18 శాతం జీఎస్టీ విధించాలని ఏఏఆర్ ప్రతిపాదించింది. దీంతో క్యాంటీన్ సర్వీసులు అందజేసే రేష్మి హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అవుట్డోర్ కేటరింగ్ సర్వీసుల కింద 18 శాతం జీఎస్టీని విధిస్తోంది. దీనిపై కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కేటరింగ్ సర్వీసులపై 18 శాతం జీఎస్టీ విధించాలా? లేదా 5 శాతం జీఎస్టీ విధించాలా? అనే వివాదం చెలరేగింది. ఈ వివాదం నేపథ్యంలో ఏఏఆర్ పలు అంశాలను పరిశీలించి కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. జీఎస్టీ నిబంధనల కింద అవుట్డోర్ కేటరింగ్ అనే పదమే లేదని, అంతకముందు సర్వీసు పన్ను పాలనపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును, కొన్ని కీలక పాయింట్లను పరిగణలోకి తీసుకుంటే, ఆఫీసు లేదా ఇండస్ట్రీ ఫ్యాక్టరీలలో అందజేసేవి క్యాంటీన్ సర్వీసులే కాదని తేల్చి చెప్పింది. వీటిపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. అవుట్డోర్ కేటరింగ్ ఈ సర్వీసులను అందజేస్తున్నాడని, ఈ నేపథ్యంలో 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. -
రైళ్లలో ఇక ఆ కష్టాలకు చెక్
సాక్షి, న్యూఢిల్లీః రైళ్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల భోజన ఇబ్బందులు తీరనున్నాయి. నాణ్యత లేని ఆహారం, అధిక చార్జీలు వసూలు చేయడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రైల్వేలు కసరత్తు చేస్తున్నాయి. ఈ దిశగా క్యాటరింగ్, ప్యాంట్రీ వ్యవస్థల ప్రక్షాళనకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు. రైల్వే మంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రి పీయూష్ గోయల్ క్యాటరింగ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ప్రయాణీకులకు సర్వ్ చేసిన ప్రతిసారి టిప్స్ కోసం చేయిచాచే రైల్వేల ప్యాంట్రీ సిబ్బందిని పర్యవేక్షించేందుకు ఇప్పుడు ఆన్‌బోర్డ్ ఇన్స్పెక్టర్లు ఓ కన్నేసి ఉంచుతారు. సిబ్బంది దురుసు ప్రవర్తన, ఆహార పదార్థాల ధరలు అమాంతం పెంచేయడం వంటి వాటినీ వీరు నియంత్రిస్తారు.ప్రయాణీకులకు అందుబాటులో ఉన్న ధరలను వసూలు చేసేలా నూతన మెనూకు రూపకల్పన చేశారు. తాజా మెనూ ప్రకారం ప్రయాణీకులు రూ 7కు టీ, కాఫీ కొనుగోలు చేయవచ్చు. రూ 15కు లీటర్ వాటర్ బాటిల్, రూ 30-35కు బ్రేక్‌ఫాస్ట్ అందుబాటులో ఉంటుంది. గతంలో కాఫీ, టీ కావాలంటే రూ 20 చెల్లించాల్సి వచ్చేది. మెనూ కార్డులను కూడా రైల్వే క్యాటరింగ్ సిబ్బంది ప్రయాణీకులకు ఇచ్చేందుకు నిరాకరించేవారు. -
కేటరింగ్‌పై 18 శాతం జీఎస్టీ
-
కేటరింగ్‌పై 18 శాతం జీఎస్టీ
- థీమ్ పార్క్, ఐపీఎల్ తరహా క్రీడలపై 28 శాతం.. - నాటకాలు, నృత్య ప్రదర్శనలపై 18 శాతం - జీఎస్టీ అమలుతో రూ.వెయ్యి ఫోన్ బిల్లుపై రూ.30 అదనపు భారం శ్రీనగర్: వినోదం కోసం థీమ్ పార్క్కో, సరదాగా ఐపీఎల్ మ్యాచ్‌కో వెళ్లాలంటే 28 శాతం జీఎస్టీ పన్ను వాత తప్పదు. మన ఇళ్లలో శుభకార్యాలకు ఆహారపదార్థాలు, శీతల పానీయాల కేటరింగ్‌పై 18 శాతం పన్ను కట్టాల్సిందే. ఇక వినోదాన్ని అందించే సర్కస్ ప్రదర్శనలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, నాటక ప్రదర్శనల్ని 18 శాతం పన్ను జాబితాలోకి చేర్చారు. గురు, శుక్రవారాల్లో శ్రీనగర్‌లో నిర్వహించిన జీఎస్టీ మండలి భేటీలో వస్తువులు, సేవలపై పన్ను వివరాల్లో మరిన్ని తాజాగా వెల్లడయ్యాయి. జూలై 1 నుంచి జీఎస్టీ అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. మేధోహక్కుల్ని బదలాయిస్తే 12 శాతం పన్ను విహారయాత్ర నిర్వాహకులు అందించే సేవలు, విమానం అద్దెకు తీసుకుంటే 5 శాతం పన్ను చెల్లించాలి. మేధో హక్కుల్ని తాత్కాలికంగా లేక శాశ్వతంగా ఎవరికైనా బదలాయించినా, వాడుకునేందుకు అనుమతించినా 12 శాతం పన్ను కట్టాలి. అయితే పశు కబేళాలు, పశువైద్య ఆస్పత్రులు అందించే సేవల్ని జీఎస్టీ నుంచి మినహాయించారు. జీఎస్టీ సేవల నుంచి విద్య, వైద్యంతో పాటు, మతపరమైన యాత్రలు, ధార్మిక కార్యక్రమాల్ని మినహాయించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత న్యాయసేవలకు మినహాయింపు టోల్గేట్ నిర్వాహకులు అందించే సేవలు, విద్యుత్ సరఫరా, పంపిణీ, ఇంటి అద్దెల్ని కూడా జీఎస్టీ నుంచి మినహాయించారు. సీనియర్ న్యాయవాది ఏ వ్యక్తికైనా న్యాయ సేవలందించినా.. రూ. 20 లక్షలలోపు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు న్యాయసేవలందించినా సేవా పన్ను చెల్లించనక్కర్లేదు. ప్రభుత్వ లైబ్రరీలు అందించే సేవలు, పుస్తకాల ముద్రణ, పళ్లు, కూరగాయల రిటైల్ ప్యాకేజింగ్, లేబిలింగ్కూ మినహాయింపు. ఫోన్ బిల్లుల మోత టెలికం సేవలపై ప్రస్తుతమున్న పన్నులను 15 నుంచి 18 శాతానికి పెంచడంతో ఫోన్ బిల్లులు పెరగనున్నాయి. మీరు నెలవారీ ఫోన్ బిల్లు రూ. 1000 చెల్లిస్తుంటే జూలై 1 నుంచి అదనంగా రూ. 30 చెల్లించాలి. అలాగే ప్రీపెయిడ్ ఖాతాదారులు రూ. 100తో రీచార్జ్‌తో రూ. 85 టాక్‌టైమ్ వస్తుండగా.. జీఎస్టీ అమలైతే రూ. 82 ల టాక్‌టైమ్ వస్తుంది. అదే విధంగా మొబైల్ ఫోన్ ధరలు 4 నుంచి 5 శాతం పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనావేస్తున్నాయి. దేశీయంగా తయారవుతున్న మొబైల్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. వారంలో రిఫండ్ చేస్తాం: సీతారామన్ జీఎస్టీ అమలైతే ఎగుమతిదారుల పన్ను రిఫండ్ దరఖాస్తులు వారం రోజుల్లోనే పరిష్కారమవుతాయని వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ముందస్తుగా చెల్లించిన మొత్తాన్ని 10 రోజుల్లో రిఫండ్ చేస్తారని ఆలస్యం జరిగితే 6 శాతం వడ్డీతో ఎగుమతిదారులకు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. జీఎస్టీ అమలుతో ఎగుమతులు పెరుగుతాయని చెప్పారు. హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా సర్కారు తీసుకుంటున్న చర్యలతో భారత ఐటీ నిపుణుల వీసాల సంఖ్యేమీ తగ్గదన్నారు. ‘వీసా విషయంలో ఐటీ రంగం భయపడాల్సిందేమీ లేదు. లాటరీ విషయంలోనే అమెరికా ప్రభుత్వం మార్పులు చేసుకోవాలనుకుంటోంది. ఇప్పుడున్న వీసాల సంఖ్యలో పెద్దగా తేడాలేమీ ఉండవు.’ అని అన్నారు. -
మరో 23 రైళ్లకు ఐఆర్సీటీసీ సేవలు
న్యూఢిల్లీ: ఆహార సరఫరా, నిర్వహణ సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చే యత్నాల్లో భాగంగా రైల్వే శాఖ మరో 23 రైళ్లలో కేటరింగ్ బాధ్యతను ఐఆర్సీటీసీకి అప్పగించింది. దీంతో ఈ సంస్థ అధీనంలో కేటరింగ్ నడుస్తున్న రైళ్ల సంఖ్య 115కు చేరింది. ప్రస్తుతం ఐఆర్సీటీసీ 65 ఎక్స్‌ప్రెస్, 6 రాజధాని, 13 దురంతో, 6 శతాబ్ది, 2 సువిధ రైళ్లలో సేవలందిస్తోంది. -
బాజాభజంత్రీలకూ ఆన్లైనే!
♦ ఒకే వేదికగా పెళ్లి సర్వీసులందిస్తున్న అప్లీ ఎవర్ ♦ డెకరేషన్, క్యాటరింగ్, మేకప్ వంటి సేవలెన్నో.. ♦ పెళ్లి దుస్తులు, నగలు, పాదరక్షల కొనుగోలుకు వీలు ♦ ఇటీవలే రూ.2.75 కోట్ల నిధుల సమీకరణ ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో సంస్థ కో-ఫౌండర్ రాకేష్ గుప్తా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘పెళ్లి చేసి చూడు.. ఇళ్లు కట్టి చూడు’ అంటారు పెద్దలు. ఇందులో ఇంటి విషయం కాసేపు పక్కన పెడితే పెళ్లి మాత్రం నిజంగా పెద్ద తతంగమే. ఆహ్వాన పత్రికలు ముద్రించటం నుంచి బంధువుల జాబితా, డెకరేషన్, మేకప్, భోజనాలు, బ్యాండ్‌బాజా.. వంటివెన్నో సమకూర్చుకోవాలి. అందుకే పెళ్లంటే నెల రోజుల ముందు నుంచి పనులు మొదలుపెడితే గానీ పెళ్లి నాటికి పూర్తవ్వవు. అయితే మరి ఇంతగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా పెళ్లి కోసం నెలల తరబడి సమయం కేటాయించాలా? అన్ని సదుపాయాలనూ ఒకే వేదికపై పొందలేమా? ఇదే ప్రశ్న ఈ మిత్రత్రయానికి ఎదురైంది. అయితే అందరిలా వీళ్లూ అక్కడిలో ఆగిపోలేదు. సమాధానం వెతికే పనిలో వెడ్డింగ్ సర్వీసెస్ స్టార్టప్ ‘అప్లీఎవర్’ను ప్రారంభించేశారు. ఆ కంపెనీ ఏంటో.. దాని సేవలేంటో అప్లీ కో-ఫౌండర్ రాకేశ్ గుప్తా ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఆయన మాటల్లోనే... 12 విభాగాల్లో సేవలు.. ‘‘నేను, మదన్ ఎల్పీ, సుమిత్ హండా ముగ్గురం కలిసి గతేడాది అక్టోబర్‌లో రూ.20 లక్షలతో హైదరాబాద్ కేంద్రంగా అప్లీఎవర్ను ప్రారంభించాం. ప్రస్తుతం మేం ఫొటోగ్రఫీ, మేకప్, మెహందీ, డీజే, డెకరేషన్, కొరియోగ్రఫీ, క్యాటరింగ్ వంటి 12 రకాల విభాగాల్లో సేవలందిస్తున్నాం. ఆయా విభాగాల్లో సేవలందించేందుకు 800-1,000 మంది వెండర్లు మావద్ద రిజిస్టరయ్యారు. అవసరమున్న సేవలను ఇక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఒక్కో డీల్ మీద రూ.5-15 వేల వరకు మార్జిన్లుంటాయి. ప్రస్తుతం నెలకు 3 వేల వరకుడీల్స్ జరుగుతున్నాయి. ప్రతి నెలా 50-70 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తున్నాం. లుక్ బుక్‌లో కొనుగోలు.. లుక్ బుక్ అనే అప్షన్లో ఏ దుస్తులకు, ఏ బూట్లు, నగలు మ్యాచ్ అవుతాయో వివరించేందుకు ప్రత్యేక నిపుణులుంటారు. సంబంధిత ఉత్పత్తుల కింద ఒక లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే పార్ట్నర్ సైట్ల నుంచి కొనుగోలు చేసే వీలుంటుంది. వీటి కోసం అమెజాన్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి 20-30 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఒక్కో కొనుగోలు మీద 5-15 శాతం క మిషన్ ఉంటుంది. ప్రస్తుతం 3 వేలకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయిక్కడ. అప్లీ ఎవర్ యాప్ ద్వారా వివాహ వేడుకలకు బంధువులను ఆహ్వానించవచ్చు. పెళ్లి వేడుకల ఫొటోలను, వీడియోలను షేర్ చేసుకోవచ్చు కూడా. 2.75 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సీడ్ రౌండ్లో భాగంగా రూ.2.75 కోట్ల నిధులను సమీకరించాం. దేశ, విదేశాలకు చెందిన 8 మంది ఏంజిల్ ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. యూనీ వెరైటీ ఫౌండర్ వరుణ్ అగర్వాల్, ఎజిలిటీ సొల్యూషన్స్ సీటీఓ సురేష్ వెంకట్, పీపుల్ కంబైన్ ఎండీ రాజ్ వై ఇందులో కొందరు. మరో ఆరు నెలల్లో దేశంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటూ మధ్య ప్రాచ్య, ఉత్తర అమెరికా దేశాలకు మా సేవలను విస్తరిస్తాం. ఇందుకోసం మరో మిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయి. పలువురు వీసీ ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నాం. ఈ ఏడాది ముగింపులోగా సమీకరిస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఐదుగురు దొంగల అరెస్ట్
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : జనగామ సబ్‌డివిజన్ పరిధిలో పలుదొంగతనాలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాతోపాటు మరో దొంగను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్పీ పాలరాజు నిందితుల వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా జమ్మికుంటకాలనీకి చెందిన ప్రవీణ్, జగద్గిరిగుట్టకు చెందిన రమేష్, విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన రాజు, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన లావుడ్యా తిరుపతి క్యాటరింగ్ టీమ్‌గా చలామణీ అవుతున్నారు. వీరిలో ప్రవీణ్, రమేష్ పాతనేరస్తులు. గతంలో ప్రవీణ్ 10 చోరీ కేసుల్లో నిందితుడు. ఇతడు ప్రస్తుతం సికింద్రాబాద్‌లో నివాసముంటున్నాడు. రమేష్ 40 దోపిడీ, చోరీ కేసుల్లో నిందితుడు. వీరిద్దరు ఆయూ కేసుల్లో జైలుకు వెళ్లారు. జైలులో పరిచయమైన వీరు విడుదలయ్యాక జగద్గిరిగుట్టలో క్యాటరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి కుంచల రాజు, తిరుపతితో పరి చయం ఏర్పడింది. క్యాటరింగ్ ద్వారా వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో రాజు సలహా మేరకు నలుగురు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు మొదలుపెట్టారు. ఈ ముఠా సభ్యులు జనగామ సబ్‌డివిజన్ పరిధిలోని జనగామ, చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు, కొడకండ్ల, పాలకుర్తి పోలీస్స్టేషన్లతోపాటు మెదక్ జిల్లాలో చైన్‌స్నాచింగ్‌లు, తాళాలు పగులగొట్టి దొంగతనాలకు సంబంధించి 27 నేరాలకు పాల్పడ్డారు. ఇందులో చేర్యాలలో 9, బచ్చన్నపేటలో 10, మద్దూరులో 5, పాలకుర్తి, కొడకండ్లలో ఒక్కో చోరీ, మెదక్ జిల్లా పాపయ్యపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున నేరాలు చేశారు. బుధవారం ఉదయం 6 గంట ల సమయంలో గుర్జకుంట క్రాస్‌రోడ్డు వద్ద చేర్యాల సీఐ జితేందర్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండ గా ఈ నలుగురు తారసపడ్డారు. వారు హైదరాబాద్ నుంచి జనగామ వైపు రెండు మోటారు సైకిళ్లపై వెళ్తుండగా వారిని అనుమానించి తనిఖీ చేశారు. వారి వద్ద బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. విచారించగా నిందితులు చేసిన చోరీలను వెల్లడించారు. జనగామ బస్టాండ్‌లో మరో నిందితుడు.... జనగామ మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న మరో నిందితుడిని పోలీసులు బుధవారం ఉదయం జనగామ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పట్టుకున్నారు. అనుమానాస్పదంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్ల తిరుగుతుండ గా అతడిని తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు గుర్తించి విచారించారు. విచారణ సందర్భంగా నిందితు డి నుంచి రూ.5 లక్షల విలువచేసే 17 తులాల బంగారం, 25 తులా ల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడు జనగామ పట్టణంలోని ధర్మకంచ గ్రామాని కి చెందిన సిరాసర్ శోభరాజ్‌గా విచారణలో వెల్లడైంది. చెడు వ్యసనాలకు అలవాటుపడి కూలీ డబ్బులు సరి పోక తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి దొంగతనా లు చేసేవాడని తేలింది. గతంలో పలుమార్లు చిల్లర దొంగతనాలు చేసిన శోభరాజ్ ఇటీవల జనగామ మండలంలో ఆరు చోరీలకు పాల్పడ్డాడు. కాగా నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన చేర్యాల సీఐ జితేందర్, జనగామ సీఐ నరేందర్, రూరల్ సీసీఎస్ సీఐ శ్రీనివాస్,ఎస్సైలు జోసఫ్, శ్రీనివాస్, ఏఎస్సై సాంబశివుడు, కానిస్టేబుళ్లు సారయ్య, సారంగపాణి, భద్రయ్య, విశ్వేశ్వర్, పాషా, హరి, సీసీఎస్ సిబ్బంది సంజీవరెడ్డి, ప్రసాద్‌ను రూరల్ ఎస్పీ పాలరాజు అభినందించారు. రూరల్ ఏఎస్పీ శ్రీకాంత్ పాల్గొన్నారు.