రహదారి పక్కన పడి ఉన్న చెన్నారావు మృతదేహం
అవనిగడ్డ: అమరావతి పాదయాత్రలో భోజనాల కేటరింగ్‌కు వచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్ధితిలో మరణించాడు. బుధవారం కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది. విజయవాడకు చెందిన కేటరింగ్ మేస్త్రి కింద పలు ప్రాంతాల నుంచి 35 మంది పాదయాత్రలో భోజనాలు వడ్డించడానికి వచ్చారు. కృష్ణా జిల్లా మాజేరులో బుధవారం భోజనాల అనంతరం సాయంత్రం 5.30 గంటల సమయంలో కొంతమంది కేటరింగ్ సిబ్బందిని వాహనాల్లో మచిలీపట్నం తరలించారు.
మిగిలిన వారికి మరో వాహనం వస్తుందని చెప్పారు. ఈలోగా కొంతమంది మాజేరు నుంచి నడచుకుంటూ మచిలీపట్నం వైపు వెళుతున్నారు. 216 జాతీయ రహదారిపై ఘంటసాల మండలం లంకపల్లి వద్ద గూడూరుకు చెందిన కె.చెన్నారావు కుప్పకూలి రోడ్డు పక్కన పడిపోయాడు. పక్కనే ఉన్న వారు ఫిట్స్ వచ్చి పడిపోయాడనుకుని చేతిలో తాళాలు పెట్టి 108 వాహనానికి సమాచారం అందించారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న 108 వాహనం టెక్నీషియన్ అతన్ని పరీక్షించి, అప్పటికే మరణించినట్టు చెప్పారు. మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే వారు రాకపోవడంతో మృతదేహాన్ని అవనిగడ్డలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సాక్షి టీవీ విలేకరిని బెదిరించిన జేఏలీ లీగల్ అడ్వైజర్
వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న జర్నలిస్టులు ఘటన ప్రాంతానికి చేరుకుని వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఇంతలో మచిలీపట్నం వైపు నుంచి 6677 నంబర్ వాహనంలో వచ్చిన పాదయాత్ర జేఏసీ లీగల్ అడ్వైజర్ జమ్మల అనిల్‌కుమార్ ‘సాక్షి’ టీవీ విలేకరి సుబ్రహ్మణ్యేశ్వరరావుతో వీడియోలు డిలీట్ చేయాలంటూ దురుసుగా ప్రవర్తించారు.
ఇందుకు విలేకరి నిరాకరించడంతో ఆగ్రహించిన అనిల్‌కుమార్ ‘అయితే నేను చేయాల్సింది చేస్తాను. నీ వ్యవహారం చూస్తాను’ అని బెదిరిస్తూ విలేకరిని వీడియో, ఫోటోలు తీసుకుని వెళ్ళారు. ఈ విషయమై చల్లపల్లి సీఐ రవికుమార్‌ని వివరణ కోరగా ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని, వెంటనే అనిల్‌కుమార్‌ని పిలిపించి మందలించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment