రైళ్లలో ఇక ఆ కష్టాలకు చెక్
రైళ్లలో ఇక ఆ కష్టాలకు చెక్
Published Tue, Sep 12 2017 4:51 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
సాక్షి, న్యూఢిల్లీః రైళ్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల భోజన ఇబ్బందులు తీరనున్నాయి. నాణ్యత లేని ఆహారం, అధిక చార్జీలు వసూలు చేయడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రైల్వేలు కసరత్తు చేస్తున్నాయి. ఈ దిశగా క్యాటరింగ్, ప్యాంట్రీ వ్యవస్థల ప్రక్షాళనకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు. రైల్వే మంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రి పీయూష్ గోయల్ క్యాటరింగ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు.
ఇప్పటివరకూ ప్రయాణీకులకు సర్వ్ చేసిన ప్రతిసారి టిప్స్ కోసం చేయిచాచే రైల్వేల ప్యాంట్రీ సిబ్బందిని పర్యవేక్షించేందుకు ఇప్పుడు ఆన్‌బోర్డ్ ఇన్‌స్పెక్టర్లు ఓ కన్నేసి ఉంచుతారు. సిబ్బంది దురుసు ప్రవర్తన, ఆహార పదార్థాల ధరలు అమాంతం పెంచేయడం వంటి వాటినీ వీరు నియంత్రిస్తారు.ప్రయాణీకులకు అందుబాటులో ఉన్న ధరలను వసూలు చేసేలా నూతన మెనూకు రూపకల్పన చేశారు.
తాజా మెనూ ప్రకారం ప్రయాణీకులు రూ 7కు టీ, కాఫీ కొనుగోలు చేయవచ్చు. రూ 15కు లీటర్ వాటర్ బాటిల్, రూ 30-35కు బ్రేక్‌ఫాస్ట్ అందుబాటులో ఉంటుంది. గతంలో కాఫీ, టీ కావాలంటే రూ 20 చెల్లించాల్సి వచ్చేది. మెనూ కార్డులను కూడా రైల్వే క్యాటరింగ్ సిబ్బంది ప్రయాణీకులకు ఇచ్చేందుకు నిరాకరించేవారు.
Advertisement