ఫంక్షన్‌లో క్యాటరింగ్ చేస్తున్న సిబ్బంది (ఫైల్)
ఆ ఊరులో ఇంటికో నలభీముడు తయారయ్యారు. వంటల తయారీలో చేయి తిరిగిన నైపుణ్యం ఆ ఊరి వారికే సొంతమైంది. భూస్వామి ఇంట.. వంటలో మెళకువలు నేర్చుకున్న సుబ్బయ్య కీర్తి జిల్లా అంతటా పాకింది. జిల్లాలో తొలి క్యాటరింగ్ ఏర్పాటుకు బీజం వేసింది. వంటలంటే.. వేగూరే అని పేరు తెచ్చి పెట్టింది. ఆ ఊరి వంటల రుచి ఎందరికో బతుకు దారి చూపింది.
సాక్షి, నెల్లూరు: ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా.. షడ్రుచుల భోజనాలు వేగూరు నుంచే వెళ్తాయి. దిగువ మధ్య తరగతి నుంచి ధనవంతుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్ ఏదైనా వేగూరు రుచులు నోరూరిస్తాయి. క్యాటరింగ్ అంటే గుర్తొచ్చేది జిల్లాలోని కోవూరు మండలం వేగూరు. ఆ గ్రామానికి చెందిన సుబ్బయ్య తన చిన్నతనంలో మోడేగుంటకు చెందిన దేవెళ్ల సుబ్బరామిరెడ్డి అనే భూస్వామి వద్ద పశువుల కాపరిగా చేరారు. ఆ రోజుల్లో ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు, పని వాళ్లతో కలిపి సుమారు 60 నుంచి 70 మంది ఉండేవారు. వారందరికీ వంట చేయడం ఆ ఇంటి ఇల్లాలు తులశమ్మకు కష్టమైంది. దీంతో సుబ్బయ్యను వంట పనుల్లో సహాయకారిగా నియమించుకున్నారు.
ఆమె వద్ద వంట చేయడంలో సుబ్బయ్య మెళకువలను నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన వంటల రుచుల కీర్తి జిల్లా అంతటా పాకింది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద కుటుంబాలు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వంట చేసేందుకు సుబ్బయ్యను తీసుకెళ్లే వారు. జిల్లాకు చెందిన దివంగతులు మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, నెల్లూరు నర్తకీ సినిమాహాలు యజమానులు గుండా రాజమ్మ, ఆనం కుటుంబీకులు ఇలా పలువురు ప్రముఖులు వారిళ్లలో జరిగే కార్యక్రమాలకు వంటలు చేసేందుకు సుబ్బయ్యనే పిలిపించుకునేవారు. ఆయనతో వంటలు చేయించుకునేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో ఉన్న తమ వారి కోసం తీసుకు వెళ్లే వారని స్థానికులు చెబుతున్నారు.
30 రకాల వంటలు
వెజ్, నాన్ వెజ్ వంటల వెరైటీల తయారీలో వేగూరు వంట మాస్టార్లది చేయితిరిగిన నైపుణ్యం.. వారికే సొంతం. వేగూరులో తమ స్వగృహాల సముదాయాల్లోనే వంటలు తయారు చేసి జిల్లా నలుమూలలకు వాహనాల్లో పంపడం ఇక్కడి ప్రత్యేకత. శాఖాహార, మాంసాహార వంటలతో పాటు బిరియానీ, పాయ, చిల్లీ చికెన్, మటన్ బిరియానీ, వడ, పాయసం, జాంగ్రీ, లడ్డూ తదితర సుమారు 30 రకాలను తయారు చేయడం సిద్ధహస్తులు.
క్యాటరింగ్ సెంటర్ వంట గది
తొలి క్యాటరింగ్ ఇక్కడే
జిల్లాలో తొలి క్యాటరింగ్ ఈ ఊరి నుంచే ప్రారంభమైంది. వంట మాస్టార్ సుబ్బయ్య వద్ద సహాయకారిగా ఉన్న పసుపులేటి వెంకటసుబ్బయ్య ఇళ్లలో, హోటళ్లలో వంట మనిషిగా పనులు చేయడంతో వేగూరు వంటగాళ్లకు పేరొచ్చింది. ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో ఆలోచనలో పడ్డారు. వచ్చిన పనినే నమ్ముకుని ఆదాయం పెంచుకునేందుకు పాతికేళ్ల కిందట సొంతంగా గ్రామంలోనే క్యాటరింగ్ ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆదాయం పెరగ్గా, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది యువత అదే బాట పట్టారు. ఈ గ్రామంలో సుమారు 120 క్యాటరింగ్ కేంద్రాలు నిర్వహిస్తుండగా ఒక్కో దానిలో పది నుంచి 30 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ఊరి యువత కొందరు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ తదితర నగరాల్లో క్యాటరింగ్ కేంద్రాలు హోటళ్లను ఏర్పాటు చేసుకుని రాణిస్తున్నారు.
బిరియానీ తయారు చేస్తున్న మాస్టర్
ప్రతి ఇంట్లో నలభీముడున్నాడు
మా గ్రామంలో ప్రతి ఇంట్లో నలభీముడు తయారయ్యారు. మా నాన్న సుబ్బయ్య ఎంతో ఇష్టంగా వంటలు చేయడాన్ని గమనించి నేనూ నేర్చుకున్నా. కొందరు నాతో పచ్చళ్లు చేయించుకుని లండన్‌లోని తమ పిల్లలకు పంపుతున్నారు. నాకు ఫోన్లు చేసి మీ రుచులు బ్రహ్మాండం అని చెబుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. గతంలో కోటలో వంటలు చేసేందుకు ఇక్కడి నుంచి మేము బాండిళ్లు, వంట సామగ్రితో ఆర్టీసీ బస్సులు ఎక్కబోతే కొందరు కండక్టర్లు తక్కువగా చూసేవారు. బస్సుల్లో సైతం ఎక్కించుకోలేదు. ఇప్పుడు సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుని వెళ్లి చేసి వస్తున్నాం.
– రామిశెట్టి వెంకటేశ్వర్లు, వేగూరు
Comments
Please login to add a commentAdd a comment