మంచి జీవనశైలితో గుండెపోటును నివారించలేమా?
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, మంచి ఆహారం మాత్రమే తీసుకోవడం, వంటి మంచి జీవనశైలి పాటించడం వల్ల ఆరోగ్యానికి ఒనగూరేదేమీ లేదనీ, కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటూ, చాలా ఆరోగ్య నియమాలు పాటించేవారికి కూడా హార్ట్‌ఎటాక్స్ వస్తుంటాయనీ, కాబట్టి నిశ్చింతగా మనసుకు తోచింది తిని, తాగి, ఆనందించడం వల్లనే ఆరోగ్యం బాగుంటుందని ఇటీవలే తాను చదివానని వాదిస్తున్నాడు. అలా ఆనందంగా ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందనే అతడి వాదన. ఒక డాక్టర్‌గా మీ అనుభవంతో అతడి వాదన గురించి మీరేమంటారు?
- సుధాకర్‌రావు, కరీంనగర్
క్రమబద్ధమైన జీవితాన్ని పాటించలేనివారు, స్వీక క్రమశిక్షణతో ఉండలేనివారు తమ సౌలభ్యం కోసం కొన్ని వాదనలు చేసినంత మాత్రాన మంచి జీవనశైలీ మార్గాల గొప్పదనం తగ్గదు. కానీ అతడు చెప్పినట్లుగా సంతోషంగా ఉండటం, ఆనందంగా జీవించడం, ఎలాంటి ఒత్తిడినీ మనసు మీదికి తీసుకోకపోవడం అనే మాట మాత్రం వాస్తవం. దీనికి మంచి ఆరోగ్యనియమాలు తోడైతే మరింత ఉపయోగమే గానీ, నష్టం ఉండదు. మంచి ఆరోగ్యనియమాలు పాటించడం, అత్యుత్తమమైన జీవనశైలి మార్గాలను అనుసరించడం, క్రమం తప్పక వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయంపై 11 ఏళ్ల పాటు ఓ అధ్యయనం చేశారు. మంచి జీవనశైలి (అంటే మంచి ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం) వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయన్న విషయాన్ని శాస్త్రీయంగా పరిశోధించి, మనకు అందించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
{Mమం తప్పకుండా (వారానికి కనీసం 5 రోజులపాటైనా రోజుకు 45 నిమిషాల చొప్పున) వ్యాయామం చేయడం వల్ల 30 శాతం గుండె జబ్బులు నివారితమౌతాయి. జంక్‌ఫుడ్, రిఫైన్‌డ్ ఫుడ్ లాంటివి మానేసి కేవలం మంచి పోషకాలు ఉండే ఆహారాలు స్వీకరించడం, వేళకు తినడం వంటి నియమాలు పాటించడం వల్ల 18 శాతం గుండెజబ్బులను నివారించవచ్చు.
స్థూలకాయం లేకుండా చూసుకోవడం, నడుము చుట్టుకొలత 37 అంగుళాల లోపే ఉంచుకోగలిగితే 12% గుండెజబ్బులను నివారించవచ్చు. ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూసుకుంటూ, పై నియమాలు పాటిస్తే 80 శాతం గుండెజబ్బులను సమర్థంగా నివారించవచ్చు. అయితే ఈ నియమాలను కేవలం ఒక శాతం మంది వ్యక్తులు మాత్రమే పాటిస్తున్నారని అదే అధ్యయనంలో తేలింది. మీరు స్వీయనియంత్రణతో, క్రమశిక్షణతో ఉంటూ, ఆనందంగా కూడా ఉండగలిగితే అది గుండెజబ్బుల విషయంలోనే కాకుండా, అనేక వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది.
డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్
చీఫ్ కార్డియాలజిస్ట్,
సిటిజన్స్ హాస్పిటల్స్,
నల్లగండ్ల, హైదరాబాద్
కార్డియాలజీ కౌన్సెలింగ్
Published Sun, Jul 12 2015 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
Advertisement