ముంబై: ఇటీవలే కొన్ని బీమా సంస్థలకు లైసెన్సులు ఇచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ మరో 20 దరఖాస్తులను పరిశీలిస్తోంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఐఆర్‌డీఏఐ చైర్మన్ దేబాశీష్ పాండా ఈ విషయాలు చెప్పారు. కొన్నాళ్ల క్రితం జీవిత బీమా విభాగంలో క్రెడిట్ యాక్సెస్ లైఫ్, ఎకో లైఫ్‌కు లైసెన్సులు ఇవ్వగా కొత్తగా సాధారణ బీమాలో క్షేమా జనరల్ ఇన్సూరెన్స్‌కు అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు.
2017 తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఒక సంస్థకు అనుమతులు ఇవ్వడం ఇదే ప్రథమం. 2047 నాటికి అందరికీ బీమా కల్పించాలన్న లక్ష్యాన్ని కేవలం నినాదంగా చూడొద్దని, దాన్ని సాకారం చేసే దిశగా తగు చర్యలు తీసుకుంటే డెడ్‌లైన్ కన్నా ముందే సాధించగలమని పాండా తెలిపారు. ఇందుకోసం పరిశ్రమ టెక్నాలజీని మరింతగా అందిపుచ్చుకోవాలని, వినూత్నంగా ఆలోచించాలని ఆయన చెప్పారు.
టెక్నాలజీ ఆధారిత నవకల్పనలతో ఉత్పత్తుల వ్యయాలు తగ్గుతాయని పాండా తెలిపారు. ఈ విషయంలో అందరికీ ఆర్థిక సేవలను అందించే దిశగా బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించవచ్చని సూచించారు. ఆఖరు వ్యక్తి వరకూ చేరేందుకు ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, స్వయం సహాయక బృందాల తోడ్పాటు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 23 జీవిత బీమా సంస్థలు, 33 సాధారణ బీమా సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి నాటికి వాటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 59 లక్షల కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment