ముంబై: దేశంలో 2047 నాటికి అందరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యం సాకారానికి మరిన్ని బీమా సంస్థలు రావాల్సిన అవసరం ఉందని బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా అభిప్రాయపడ్డారు. విస్తృతమైన, వైవిధ్యమైన బీమా ఉత్పత్తులు, మరిన్ని పంపిణీ భాగస్వాములు కూడా కావాలన్నారు. ప్రైవేటు ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ పరిశ్రమ అసోసియేషన్ వార్షిక సదస్సును ఉద్దేశించి పాండా మాట్లాడారు.
‘‘బీమా పరిశ్రమలో ప్రైవేటు సంస్థలకు ద్వారాలు తెరిచి రెండు దశాబ్దాలకు పైనే గడిచింది. బీమా మార్కెట్ ఎంతో వృద్ధి చెందింది. గడిచిన ఐదేళ్లలో బీమా రంగం ఏటా 10 శాతం వృద్ధిని చూసింది. అయినప్పటికీ 2021నాటికి బీమా విస్తరణ 4.2 శాతంగానే ఉంది. మరింత మందికి చేరువ కావాల్సి ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న వైవిధ్యభరిత దేశం. అందరికీ ఒక్కటే విధానం సరిపోదు. అధిక ధనవంతులు, పేద ప్రజల కోసం విభిన్నమైన బీమా పరిష్కారాలు అవసరం. అలాంటి వినూత్నమైన ఉత్పత్తులను నేడు ఉన్న 70 కంపెనీల నుంచి సాధ్యం కాదు. కనుక మరిన్ని కంపెనీలు రావాలి. విస్తృతమైన బీమా ఉత్పత్తులు, పంపిణీదారులు కూడా అవసరం. అప్పుడే 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని సాధించగలం’’అని దేవాశిష్ పాండా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment