సాక్షి, న్యూఢిల్లీ: పెన్షన్ స్కీంలో మీ డబ్బు ఇరుక్కుపోయిందా. అయితే మీకో శుభవార్త. పెన్షన్ పాలసీ దారులకు ఊరట కల్పించేలా రెగ్యులేటరీ తాజా ఆదేశాలు జారీ చేసింది. పాలసీ తీసుకొని, కొంతవరకు చెల్లించి వదిలేసిన లేదా క్లైమ్ చేయని సొమ్ము వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర వేలకోట్లరూపాయలు మూలుగుతున్నాయని ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) తాజాగా వెల్లడించింది. దీంతో సంబంధిత పాలసీదారులను గుర్తించి, ఆ ఫండ్‌ను వారికి చెల్లించాల్సిందిగా ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్‌డీఏఐ కోరింది. పాలసీదారులకు చెందిన 15వేల కోట్ల రూపాయలు జీవిత బీమా సంస్థల వద్ద క్లైమ్ చేయకుండా పడివున్నాయని రెగ్యులేటరీ వివరించింది. ఈ సొమ్మును ఆయా పాలసీ దారులు, లేదా లబ్దిదారులను శోధించి మరీ తిరిగి చెల్లించాల్సిందిగా బీమా సంస్థలకు ఆదేశించింది.
అయితే ఇప్పటివరకు నిబంధనల ప్రకారం కనీస వాయిదాలు చెల్లించని జీవిత బీమా పాలసీ దారులు మెచ్యూరిటీ మొత్తాన్ని క్లెమ్ చేసే హక్కులేదు. అలాగే కొనుగోలు ధర కంటే మెచ్యూరిటీ వాల్యూ తక్కువగా ఉన్నా కూడా ఈ అవకాశం లేదు. తాజా ఆదేశాల ప్రకారం అలాంటి పాలసీదారులకు కూడా డబ్బును తిరిగి చెల్లించమని ఐఆర్‌డీఏఐ కోరింది. ఈ ఆదేశాలకు ప్రతికూలంగా ఇన్పూరెన్స్ కంపెనీలు వాదిస్తున్నాయి.
ఇది చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని, పేరుకుపోయిన ఫండ్ విలువ ఈచెల్లింపులకు సరిపోదని ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన అనిల్‌కుమార్ సింగ్ తెలిపారు. 2015నాటి ప్రభుత్వ గెజిట్ ప్రకారం పాలసీదారుడు, నిర్దేశియ సమయంలో ప్రీమియంలను చెల్లించనప్పుడు లేదా గణనీయమైన మొత్తంలో చెల్లించని సందర్భాల్లో మెచ్యూరిటీ విలువ తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ సొమ్ము కంపెనీతోనే ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్, చిన్మయ్ బేడే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment