న్యూఢిల్లీ: కమీషన్ల పరంగా పరిమితులను బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) తొలగించింది. బీమా కంపెనీలు తమ పాలసీలను విక్రయించే మధ్యవర్తులకు కమీషన్లు చెల్లిస్తుంటాయి. ఈ భారం పరోక్షంగా పాలసీదారులపైనే పడుతుంది. అందుకే లోగడ ఈ విషయంలో ఐఆర్‌డీఏఐ పరిమితులు పెట్టింది. తాజాగా వీటిని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. మధ్యవర్తులకు ఎంత కమీషన్ చెల్లించాలన్నది బీమా కంపెనీలే నిర్ణయించుకోవచ్చని పేర్కొంది.
కాకపోతే పాలసీదారుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఇది ఉండాలని స్పష్టం చేసింది. పాలసీదారులు, ఏజెంట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కమీషన్ పాలసీని ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డ్ రూపొందించుకోవాలంటూ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. కమీషన్లలో సౌలభ్యం ఉంటే అది దేశంలో బీమా కవరేజీ వ్యాప్తికి దోహదపడుతుందని, వ్యయాల పరంగా సామర్థ్యాలను పెంచుతుందని పేర్కొంది.
బోర్డు స్థాయిలో నిర్ణయించే కమీషన్ అనేది తాజా నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిర్వహణ వ్యయ పరిమితుల పరిధిలోనే ఉండాలని స్పష్టంగా నిర్ధేశించింది. నూతన నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నోటిఫికేషన్ తేదీ నుంచి ప్రతి మూడేళ్లకోసారి నిబంధనలను సమీక్షిస్తామని ఐఆర్‌డీఏఐ ప్రకటించింది. ఇప్పటి వరకు బీమా కంపెనీలు చెల్లించే కమీషన్లను ఉత్పత్తుల వారీగా ఐఆర్‌డీఏఐ నిర్ణయిస్తోంది. తాజా సవరణలు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయనే అభిప్రాయాన్ని ఐఆర్‌డీఏఐ వ్యక్తం చేసింది. నూతన వ్యాపార నమూనాలు, ఉత్పత్తులు, వ్యూహాల అభివృద్ధికి వీలు కల్పిస్తాయని పేర్కొంది. సవరించిన నిర్వహణ వ్యయ పరిమితులు, కమీషన్ పరిమితులు అనేవి సరైన మార్గంలో ఉన్నాయని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment