
సాక్షి, న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదాలు, వాటి కారణంగా ఏర్పడే ఇతర ప్రమాదాల నష్టాన్ని భర్తీ చేసే ప్రామాణిక బీమా పాలసీలను కనీసం మూడింటిని ప్రవేశపెట్టాలని అన్ని సాధారణ బీమా సంస్థలను ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్’(ఎస్‌ఎఫ్‌ఎస్‌పీ) స్థానంలో.. ‘భారత్ గృహ రక్ష’, భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష, భారత్ లఘు ఉద్యమ్ సురక్ష పాలసీలను ప్రవేశపెట్టాలని ఐఆర్‌డీఏఐ(బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ) తన ఆదేశాల్లో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి సాధారణ బీమా సంస్థలు వీటిని తప్పకుండా ఆఫర్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఐఆర్‌డీఏఐ జనవరి 4న మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి ప్రకారం ఇల్లు, ఇంట్లోని వస్తువుల కవరేజీకి ఉద్దేశించినది భారత్ గృహ రక్ష పాలసీ. ఇంటితో పాటు ఇంట్లో వస్తువులకూ ఆటోమేటిక్‌గా బీమాలో 20 శాతం కవరేజీ (గరిష్టంగా రూ.10 లక్షలు) లభిస్తుంది. ఇంతకుమించి విలువైన వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని ప్రపోజల్ పత్రంలో పేర్కొనడం ద్వారా మరింత కవరేజీని పొందొచ్చు.
ఉదాహరణకు, మీరు మీ సాధారణ ఇంటి విషయాలలో దేనినైనా (ఫ్రిజ్, టెలివిజన్, వాషింగ్ మెషీన్ వంటివి) 50 వేలకు బీమా చేసినట్లయితే, అసలు విలువ లక్ష అయితే, పాలసీ మొత్తం బీమా మొత్తాన్ని అంటే 50వేలను చెల్లిస్తుంది ( 50,000). భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష అన్నది సంస్థల కోసం ప్రత్యేకించినది. రూ.5 కోట్ల వరకు రిస్క్ కవర్‌ను ఇందులో భాగంగా ఆఫర్ చేయాల్సి ఉంటుంది. భారత్ లఘు ఉద్యమ్ సురక్ష పాలసీ.. రూ.5 కోట్లకు మించి రూ.50 కోట్ల వరకు సంస్థల కోసం బీమా కవరేజీని ఆఫర్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment