Home insurance policy
-
Catastrophe Insurance: మీ ఇంటికి బీమా ఉందా..?
దీపావళి రోజున హైదరాబాద్‌కు చెందిన రామన్ కుటుంబం ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. స్కై షాట్ క్రాకర్ గతితప్పి ఎనిమిదో అంతస్తులోని రామన్ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లింది. దాంతో మంటలు మొదలయ్యాయి. ఇంట్లోని ఫరి్నచర్, విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వ్రస్తాలు కాలిపోయాయి. ఒకింత అదృష్టం ఏమిటంటే రామన్ కుటుంబ సభ్యులు అందరూ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, ఇంట్లోని విలువైన వస్తువులు కాలిపోవడం వల్ల రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇది ఊహించని నష్టం. ఇలాంటి ప్రమాదం ఏర్పడుతుందని ఎవరూ అనుకోరు. కానీ, ప్రమాదాలు అన్నవి చెప్పి రావు. అందుకే ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ఉండాలని నిపుణులు తరచూ చెబుతుంటారు. కానీ, దీన్ని పాటించే వారు చాలా తక్కువ మందే అని చెప్పుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటితోపాటు, ఇంట్లోని విలువైన వస్తువులకు ప్రమాదాలు, విపత్తుల కారణంగా ఏర్పడే నష్టం నుంచి రక్షణనిస్తుంది. చౌక ప్రీమియానికే వస్తుంది. రోజుకు ఒక టీకి పెట్టేంత ఖర్చు కూడా కాదు. హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి అనేది వివరంగా చూద్దాం... ‘‘ప్రజలు తమ జీవిత కాల పొదుపును ఇంటి కొనుగోలు కోసం వెచి్చస్తున్నారు. మరి అంతటి విలువైన ఆస్తిని కాపాడుకునేందుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఎంతో విలువైన ఆస్తికి ఎల్లప్పుడూ రిస్క్ పొంచి ఉంటుంది’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ , ప్రాపర్టీ క్లెయిమ్స్ చీఫ్ గౌరవ్ అరోరా తెలిపారు. నిజానికి ప్రతి 20 ఇళ్లల్లో కేవలం ఒక ఇంటికే ప్రస్తుతం బీమా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సగటు వ్యక్తికి ఇల్లు అనేది పెద్ద పెట్టుబడి అవుతుంది. అందుకే ఆ విలువైన ఆస్తికి తప్పకుండా రక్షణ తీసుకోవాలి. ‘‘విపత్తులు రావడం అన్నది అరుదే. కానీ, వచి్చనప్పుడు వాటిల్లే నష్టం భారీగా ఉంటుంది’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది పేర్కొన్నారు. అనుభవాలను మర్చిపోవద్దు.. జీవిత బీమా తీసుకోవాలని చాలా మంది ఏజెంట్లు అడగడం వినే ఉంటారు. కానీ, అదే స్థాయిలో హోమ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కనిపించదు. దీన్ని తీసుకున్నామని, తీసుకోవాలని సూచించే వారు కూడా అరుదు. విపత్తులు, ప్రమాదాలే హోమ్ ఇన్సూరెన్స్ దిశగా అడుగులు వేయించేవిగా భావించాలి. నిజానికి ప్రకృతి విపత్తుల సమయాల్లో హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. 2018లో కేరళను వరదలు తీవ్రంగా నష్టపరిచాయి. ఆ తర్వాతి ఏడాదిలో హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆదాయం 34 శాతం పెరిగింది. ఇంటి బీమా కోసం ఆసక్తి పెరిగింది. 2020లో యాంఫాన్ తుపాను పశి్చమబెంగాల్ను నష్టపరచగా ఆ తర్వాతి ఆరి్థక సంవత్సరంలో పై ప్రీమియం ఆదాయం 27 శాతం పెరగడం గమనించొచ్చు. కానీ, ఇదంతా తాత్కాలిక ధోరణిగానే ఉంటోంది. విపత్తులు లేదా ప్రమాదాలు తలెత్తినప్పుడు సహజంగా హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. తిరిగి ఏడాది రెండేళ్ల తర్వాత అక్కడి ప్రజలు వాటిని మరిచిపోతుంటారు. దీంతో విక్రయాలు మళ్లీ తగ్గుతుంటాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోనూ కనిపిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో వైద్య బిల్లులు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆరోగ్య బీమా తీసుకునే వారిలో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించింది. ఇప్పుడు కరోనా విపత్తు బలహీనపడింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ విక్రయాలు తిరిగి సాధారణ స్థాయికి చేరాయి’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన చతుర్వేది తెలిపారు. ఫ్లాట్ యజమానులు హౌసింగ్ సొసైటీ తీసుకున్న హోమ్ ఇన్సూరెన్స్‌పై ఆధారపడడం సరికాదని నిపుణుల సూచన. తమ ఫ్లాట్‌తోపాటు, అందులోని విలువైన వస్తువులకు విడిగా కవరేజీ తీసుకోవడం అన్ని విధాలుగా మెరుగైన నిర్ణయం అవుతుంది. ఇంటికి భూకంపాలు, తుపాను, వరదల ముప్పు మాత్రమే కాదు, ఎత్తయిన భవనాలు, ఖరీదైన గాడ్జెట్ల వినియోగం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల ముప్పు కూడా ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. ముంబైలో ఏటా 5,000 వరకు అగ్ని ప్రమాదాలు నమోదవుతున్నట్టు ఒక అంచనా. ఇందులో 70 శాతానికి విద్యుత్తే కారణంగా ఉంటోంది. ఢిల్లీ, బెంగళూరు తదితర పట్టణాల్లో ఏటా 2,500 మేర అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘‘ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ గాడ్జెట్ల వినియోగం పెరిగిపోవడంతో, ఎలక్ట్రికల్ వైరింగ్‌పై భారం అధికమై అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ చతుర్వేది తెలిపారు. అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదానికి సంబంధించి అలారమ్ మోగిన వెంటనే, స్ప్రింక్లర్ సిస్టమ్ నుంచి నీరు ఎంతో ఒత్తిడితో ఎగజిమ్మడం మొదలవుతుంది. ఈ నీటి కారణంగా ఇంట్లోని విలువైన గాడ్జెట్లు, ఇంటీరియర్ దెబ్బతింటాయి. కనుక అగ్ని ప్రమాదం జరగకపోయినప్పటికీ, ఇంటి యజమా ని చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్దె ఇంట్లో ఉంటే హోమ్ ఇన్సూరెన్స్ అవసరం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది ఎంత మాత్రం సరైనది కాదు. హోమ్ ఇన్సూరెన్స్ అన్నది కేవలం ఇంటి నిర్మాణానికి జరిగిన నష్టానికే పరిమితం కాదు. ఇంట్లోని వస్తువులు దెబ్బతింటే ఏర్పడే నష్టం నుంచి గట్టెక్కడానికి బీమా అక్కరకు వస్తుంది. దోపిడీ, దొంగతనాల వల్ల ఏర్పడే నష్టాన్ని సైతం భర్తీ చేసుకోవచ్చు. కవరేజీ చాలినంత.. హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. తమ అవసరాలకు తగిన పాలసీ కీలకం అవుతుంది. భారత్ గృహ రక్ష (బీజీఆర్) అన్నది ఐఆర్డీఏఐ ఆదేశాల మేరకు అన్ని సాధారణ బీమా సంస్థలు తీసుకొచి్చన ప్రామాణిక నివాస బీమా. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలతోపాటు అగ్ని ప్రమాదాలు, చెట్టు విరిగి పడడం, వాహనం డ్యాష్ ఇవ్వడం కారణంగా ఇంటికి వాటిల్లే నష్టానికి ఈ పాలసీలో పరిహారం లభిస్తుంది. శిధిలాల తొలగింపునకు, ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్ట్ ఫీజులకు అయ్యే మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. కానీ, ఇందులో పరిమితులు కూడా ఉన్నాయి. రూ.10 లక్షలు లేదా తీసుకున్న కవరేజీలో 20 శాతం ఏది తక్కువ అయితే అంత మేరే ఈ పాలసీ కింద పరిహారం లభిస్తుంది. ఓ సాధారణ మధ్య తరగతి ఇంటికి రూ.10 లక్షలు బీమా సరిపోదు. ఇంట్లో అధిక విలువ కలిగిన వస్తువులు ఉంటే, వాటి కోసం ప్రత్యేక కవరేజీ తీసుకోవాలని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ అండ్ రైటింగ్ హెడ్ గురుదీప్ సింగ్ బాత్రా సూచించారు. ఇంటి మార్కెట్ విలువ ఆధారంగా బీమా కవరేజీపై నిర్ణయానికి రావద్దు. ఇంటి నిర్మాణం దెబ్బతింటే, పునరుద్ధరించడానికి అయ్యే వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చదరపు అడుగుకు ఎంత వ్యయం అవుతుందో ఇంజనీర్లను అడిగితే తెలుస్తుంది. ఇంట్లో విలువైన ఫిట్టింగ్‌లు ఏర్పాటు చేసుకున్న వారు, ఆ విలువను కూడా బీమా కవరేజీకి అదనంగా జోడించుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏటా ఎంతో కొంత పెరుగుతుంటుంది. కనుక ఏడాదికి కాకుండా ఒకేసారి రెండు, మూడేళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. ‘‘ఇంటికి తీసుకునే బీమాని ఏటా రెన్యువల్‌కు ముందు ఆ కవరేజీని సమీక్షించుకోవాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటా ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిపోతుంటుంది. అందుకు అనుగుణంగా ఏటా నిర్ణీత శాతం మేర కవరేజీని పెంచుకోవాలి. ఏటా 10 శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళ్లే వాటిని పరిశీలించొచ్చు. ఇంట్లో ఉన్న ఒక్కో పరికరం, కొనుగోలు చేసిన సంవత్సరం, మోడల్ నంబర్, దాని విలువ ఈ వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ సంస్థలు ఈ వివరాల ఆధారంగానే పరిహారాన్ని నిర్ణయిస్తాయి. అవి ఎన్నేళ్ల పాటు వాడారన్న వివరాల ఆధారంగా ప్రామాణిక తరుగును అమలు చేస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరాల విలువ ఏటా తగ్గుతూ ఉంటుంది. రూ.50 వేలు పెట్టి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన వస్తువు విలువ ఇప్పుడు సగానికి తగ్గిపోతుంది. కనుక పాడైపోయిన దాని స్థానంలో కొత్తది కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుందని అనుకోవద్దు. ఇంట్లో విలువైన కళాకృతులు ఉంటే, వాటికి సైతం బీమా కవరేజీ కోరుకుంటే.. సరి్టఫైడ్ ఏజెన్సీ నుంచి వ్యాల్యూషన్ సరి్టఫికెట్ తీసుకోవాలి. ఒకవేళ కళాఖండాల మొత్తం విలువ రూ.5 లక్షలు, విడిగా ఒక్కోటి విలువ రూ.లక్ష మించకపోతే వ్యాల్యూషన్ సరి్టఫికెట్ అవసరం పడదు. ఎలాంటి కవరేజీ..? ప్రతి ఇంటికి కనీసం హోమ్ ఇన్సూరెన్స్ బేసిక్ పాలసీ అయినా ఉండాలి. భూకంపాలు, పిడుగులు, తుపానులు, వడగళ్లు, వరదలు తదితర ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదం, విధ్వంసం, అల్లర్ల కారణంగా ఇంటి నిర్మాణానికి నష్టం ఏర్పడితే బేసిక్ పాలసీలో పరిహారం లభిస్తుంది. మరమ్మతులు లేదంటే తిరిగి నిర్మాణం వీటిల్లో సరైన దానికి కవరేజీనిస్తుంది. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం రూ.30 వరకు ఉంటుంది. ఇక ఇంటి నిర్మాణానికి అదనంగా, ఇంట్లోని వస్తువులకు కూడా రక్షణ తీసుకోవచ్చు. ఈ తరహా కవరేజీకి ప్రతి రూ.లక్షకు గాను ప్రీమియం రూ.60 వరకు ఉంటుంది. దోపిడీ, దొంగతనాల నుంచి సైతం రక్షణ అవసరం. ఇంట్లోని ఫరి్నచర్, కళాఖండాలు, వ్రస్తాలు, గృహోపకరణాలు, గాడ్జెట్ల వంటి వాటికి దొంగతనాల నుంచి రక్షణ కోరుకుంటే ప్రతి రూ.లక్షకు రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఇంట్లో గాడ్జెట్లు పనిచేయకుండా పోవడం చూస్తుంటాం. ఇలా ఉన్నట్టుండి ఇంట్లో పరికరం పనిచేయకుండా పోతే, పరస్పర అంగీకారం మేరకు పరిహారం అందించే ‘బ్రేక్‌డౌన్’ కవర్ కూడా ఉంటుంది. దీనికి ప్రీమియం రూ.లక్షకు రూ.200–300 వరకు ఉంటుంది. రుణంపై ఇంటిని తీసుకున్న వారు ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణం వరకు రుణ ఈఎంఐని బీమా కంపెనీ చెల్లించాలని కోరుకుంటే ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఆరు నెలల ఈఎంఐ రక్షణకు ప్రీమియం రూ.2,500 వరకు ఉంటుంది. ఇంటి నిర్మాణం దెబ్బతిన్నప్పుడు అందులో ఉండే కిరాయిదారు ఖాళీ చేయాల్సి రావచ్చు. అదే జరిగితే అప్పటి వరకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వస్తున్న అద్దె ఆదాయానికి బ్రేక్ పడుతుంది. ఇలా అద్దె ఆదాయాన్ని నష్టపోకుండా, బీమా సంస్థ చెల్లించేలా యాడాన్ కవర్ తీసుకోవచ్చు. దీనికి ప్రతి నెలా రూ.25వేల అద్దె చొప్పున ఆరు నెలల పాటు చెల్లించే కవర్‌కు ప్రీమియం రూ.2,000 ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా ప్రత్యేకంగా ఉంటే, హోమ్ ఇన్సూరెన్స్‌తో తీసుకోవాల్సిన అవసరం లేదు. భారం తగ్గాలంటే..? హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇల్లు, ఇంట్లోని వస్తువులకు నష్టం వాటిల్లినప్పుడు, కొంత మొత్తాన్ని తామే భరించేట్టు అయితే ప్రీమియం తగ్గుతుంది. కొన్ని కంపెనీలే ఈ ఆప్షన్ ఇస్తున్నాయి. ఇంట్లో అన్నింటికీ బీమా అవసరం ఉండదు. బాగా పాత పడిపోయిన వాటికి, పెద్దగా వ్యాల్యూ లేని (తరుగు బాగా పడే) వాటికి బీమా అనవసరం. అగ్ని ప్రమాదం జరిగితే హెచ్చరించి, అప్రమత్తం చేసే అలారమ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే, అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసే పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. స్వయం ఉపాధిలోని నిపుణులు లేదా వ్యాపారులు అయితే హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. వేతన జీవులకు ఈ వెసులుబాటు లేదు. ఏడాదికి కాకుండా, ఏడాదికి మించి ఎక్కువ కాలానికి పాలసీ తీసుకుంటే ప్రీమియంలో 10 శాతం తగ్గింపు వస్తుంది. -
విపత్తుల్లోనూ బీమా ధీమా!
వరద నీటికి బెంగళూరులోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోవడం చూశాం. సంపన్నులు ఉండే ప్రాంతాలు కూడా ఇందుకు అతీతం కాదు. కోట్ల రూపాయలు పలికే ఖరీదైన విల్లాలు, కార్లు సగం మేర నీటిలో మునగడం కనిపించింది. ప్రకృతి విపత్తుల వల్ల ఆస్తులకు కలిగే నష్టాన్ని మనం అంచనా వేయలేం. కరోనా మహమ్మారి ఆరోగ్య బీమా ప్రాధాన్యతను తెలియజేసినట్టే.. బెంగళూరు వరదలు హోమ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యాన్ని గుర్తు చేశాయని చెప్పుకోవాలి. కొంచెం ప్రీమియంతోనే ఇలాంటి అనుకోని ఉపద్రవాల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. మోటారు బీమా థర్డ్ పార్టీ కవరేజీకే పరిమితం కాకుండా సమగ్ర కవరేజీ తీసుకోవాలి. అలాగే, హోమ్ ఇన్సూరెన్స్ కూడా ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది. వీటి గురించి వివరించే కథనం ఇది... కాంప్రహెన్సివ్... మోటారు బీమా చట్టం ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. సమగ్ర కవరేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, సొంత వాహనానికి నష్టం జరిగితే పరిహారం రావాలంటే సమగ్ర కవరేజీ ఉండాల్సిందే. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలు, తుఫానుల వల్ల తమ వాహనాలకు జరిగే నష్టానికి కాంప్రహెన్సివ్ పాలసీలోనే పరిహారం లభిస్తుంది. అలాగే, వాహనం చోరీ, ప్రమాదంలో నష్టం, అగ్ని ప్రమాదం వల్ల జరిగే నష్టానికి పరిహారం కోరొచ్చు. వరదల వల్ల కార్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కారు విలువ కూడా పడిపోతుంది. ఖరీదైన రీపేర్లు అవసరం పడొచ్చు. కొన్ని సందర్భాల్లో రిపేర్ చేసినా దెబ్బతిన్న కారు బాగు కాకపోవచ్చు. సమగ్ర కారు బీమా ప్రీమియం కొంచెం ఎక్కువ ఉన్నా వెనుకాడొద్దని.. ఇలాంటి ఊహించని నష్టాలను గట్టెక్కడానికి ఎంతో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాంప్రహెన్సివ్ ప్లాన్లలో మళ్లీ ఇంజన్, గేర్ బాక్స్‌కు ఎక్కువ కంపెనీలు కవరేజీ ఇవ్వడం లేదు. ఇలాంటి సందర్భాల్లో విడిగా యాడాన్ కవరేజీలు తీసుకోవాల్సి వస్తుంది. ఆయా అంశాలపై నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంజన్ ప్రొటెక్షన్ కవర్: కారు ఇంజన్ వాడకపోయినా పాడవుతుంది. వరద నీటి కారణంగానూ దెబ్బతింటుంది. ఇంజన్‌ను పూర్తిగా మార్చేయాలన్నా లేక ఇంజన్లో విడిభాగాలను మార్చాలన్నా అలాంటి సందర్భాల్లో ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ అక్కరకు వస్తుంది. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్: వరద నీరు కారణంగా రిపేర్ చేయడానికి వీలు లేకుండా కారు దెబ్బతింటే లేదా కారు చోరీకి గురైనా.. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ ఉన్న వారు కారు కొనుగోలుకు ఖర్చు చేసిన మొత్తాన్ని (బిల్లులో ఉన్న మేర) క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. జీరో డిప్రీసియేషన్ కవర్: వాడుకలో కాలం గడిచే కొద్దీ వాహనం, అందులోని విడిభాగాల విలువ తగ్గిపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో పాలసీదారుల నుంచి క్లెయిమ్ వస్తే, బీమా కంపెనీలు తరిగిపోయిన విలువ మినహాయించి, మిగిలిన మేరే చెల్లిస్తాయి. కానీ, జీరో డిప్రీసియేషన్ కవర్ తీసుకుంటే ఇలాంటి కోతలు ఏవీ లేకుండా బీమా సంస్థలు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తాయి. ఇతర కవరేజీలు: లూబ్రికెంట్లు, గేర్‌బాక్స్, ఇంజన్ ఆయిల్, గ్రీజ్ తదితర వాటికి చెల్లింపులు చేసే కన్జ్యూమబుల్ కవర్, రోడ్డు సైడ్ అసిస్టెన్స్ అందించే కవర్ కూడా అందుబాటులో ఉన్నాయి. క్లెయిమ్ దాఖలు ఎలా... వరదల వల్ల కారు కానీ, ద్విచక్ర వాహనం కానీ నీటిలో మునిగిపోతే.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా, స్టార్ట్ చేసినా కానీ, అవి ఆన్ కాకపోవచ్చు. కానీ, వాహనాన్ని కదిలించినట్టయితే మరింత నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. వాహనదారు చర్యలతో మరింత నష్టం జరిగితే బీమా సంస్థ నుంచి తిరస్కారం ఎదురుకావచ్చు. దీనికి బదులు బీమా సంస్థకు వాస్తవ సమాచారాన్ని తెలియజేయడమే మంచి నిర్ణయం అవుతుంది. తమ వాహనానికి జరిగిన నష్టాన్ని తేల్చాలని కోరొచ్చు. దాంతో బీమా సంస్థ సర్వేయర్‌ను, మెకానిక్‌ను సంఘటన స్థలానికి పంపిస్తుంది. వరదనీరు తగ్గిపోయిన తర్వాత వారు వచ్చి జరిగిన నష్టంపై అంచనాకు వస్తారు. లేదంటే వాహనాన్ని సమీపంలోని వర్క్‌షాప్‌కు తరలిస్తారు. అనంతరం ఇంజన్‌ను తనిఖీ చేయడం, ఇంజన్ ఫ్లషింగ్, క్లీనింగ్ చేయించొచ్చు. ఇంజన్‌కు జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ కూడా ఉండేలా జాగ్రత్త పడాలి. లేదంటే నష్టాన్ని వాహనదారుడే మోయాల్సి వస్తుంది. అందుకనే వరద నీటిలో చిక్కుకున్న వాహనాన్ని స్టార్ట్ చేయడానికి బదులు టోయింగ్ వ్యాన్‌తో తరలించి, నష్టాన్ని మదింపు చేయించడమే సరైనది అవుతుంది. బీమా సంస్థకు సమాచారం ఇచ్చే విషయంలో జాప్యం లేకుండా జాగ్రత్తపడాలి. బెంగళూరులో వరదల వల్ల వస్తున్న క్లెయిమ్‌లలో 80 శాతం విడిభాగాలకు నష్టానికి సంబంధించినవి అయితే, మరో 20 శాతం పూర్తి డ్యామేజీ క్లెయిమ్‌లు ఉంటున్నట్టు బీమా సంస్థలు తెలిపాయి. హోమ్ ఇన్సూరెన్స్ సంగతేంటి? సొంతిల్లు పట్ల ఎంతో మమకారం ఉంటుంది. ఈ రోజుల్లో భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తే కానీ సొంతిల్లు సమకూరడం లేదు. అంతటి విలువైన ఇంటికి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ముంబై, చెన్నై, ఇప్పుడు బెంగళూరు నగరాలు వరద ముప్పును ఏ స్థాయిలో ఎదుర్కొన్నదీ చూశాం. కనుక విలువైన ఇంటికి, ఇంట్లోని విలువైన సామగ్రికి బీమా రక్షణ తీసుకోవడం ఎంతో లాభం. ఇంటి యజమానులే అని కాదు, అద్దెకు ఉన్న వారు కూడా తీసుకోవచ్చు. కాకపోతే అద్దెకు ఉండే వారు ఇంట్లోని వాటికి మాత్రమే కవరేజీ తీసుకుంటే చాలు. అదే ఇంటి యజమాని అన్ని రకాల కవరేజీతో కూడిన కాంప్రహెన్సివ్ హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా తాము నివసిస్తున్న ప్రాంతానికి ఉండే రిస్క్‌ల గురించి పూర్తి అవగాహనతో ఉంటే, ఎలాంటి కవరేజీ అవసరం అన్నది తేల్చుకోవచ్చు. ప్రకృతి విపత్తులు (అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగి పడడం) లేదా ప్రమాదవశాత్తూ వాటిల్లిన నష్టాలకు సైతం కవరేజీ లభిస్తుంది. కేవలం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వారికే ఇది అవసరం అనుకోవద్దు. ఎత్తయిన అపార్ట్మెంట్లలో పై అంతస్తుల్లో ఉండేవారికీ హోమ్ ఇన్సూరెన్స్ ఎన్నో రూపాల్లో ఆదుకుంటుంది. ఇంటి విలువ, ఇంట్లోని వస్తువువల విలువ ఆధారంగానే ప్రీమియం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది. ప్రయోజనాలు.. హోమ్ ఇన్సూరెన్స్ అంటే ఇంటి నిర్మాణానికి వాటిల్లే నష్టానికే పరిహారం అనుకోకండి. గ్యారేజ్, కాంపౌండ్, ఫెన్సింగ్‌కు నష్టం ఎదురైనా కవరేజీ లభిస్తుంది. బేస్ పాలసీలకి యాడాన్‌గా, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఇంట్లోని ఆభరణాలు, నగదుకు కూడా రక్షణనిచ్చే కవరేజీలు ఉన్నాయి. లేదంటే సమగ్ర బీమా ప్లాన్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల ఏ రూపంలో దేనికి నష్టం వాటిల్లినా పరిహారం అందుతుంది. ఇంట్లోని వస్తువులకు నష్టం జరిగితే, వాటి రీపేర్‌కు అయ్యేంత కాకుండా.. వాస్తవ విలువ మేరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా బీమా రక్షణ కల్పించుకోవడం ద్వారా భూకంపాలు, వరదల వంటి భారీ నష్టాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో దొంగలు పడి విలువైన సొత్తు ఎత్తుకుపోయినా, ఈ ప్లాన్‌లో కవరేజీ లభిస్తుంది. ముఖ్యంగా హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అందుబాటులోనే ఉంటుంది. రూ.2,000 ప్రీమియంకే కవరేజీనిచ్చే ప్లాన్లు కూడా ఉన్నాయి. ప్రకృతి విపత్తులు, దోపిడీల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మినహాయిస్తే, మిగిలిన ప్రాంతాల్లోని వారు భారీగా వెచ్చించాల్సిన అవసరం ఏర్పడదు. పైగా హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. మీ ఇంటి కారణంగా ఎదురయ్యే న్యాయ వివాదాల్లోనూ రక్షణనిస్తుంది. ఎలా అంటే.. ఇంట్లో పనిచేసే వారు మరణించినా పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. అగ్ని ప్రమాదాల వల్ల ఇతర ప్రాపర్టీకి నష్టానికి కారణమైనా, అతిథులు కానీ, ఇతర వ్యక్తుల మరణానికి దారితీసినా కవరేజీ లభిస్తుంది. ఇవి గుర్తుంచుకోండి.. ► హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ఇంట్లో ఉన్న అన్నింటికీ ఆధారాలు ఉంచుకోవాలి. లేదంటే క్లెయిమ్ సమయంలో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ► అనధికారిక కట్టడం అయితే బీమా కవరేజీ ల భించదు. చట్టబద్ధమైన నిర్మాణాలు, చట్టపరమై న అనుమతులు ఉన్న వాటికే కవరేజీ లభిస్తుంది. ► ఇంట్లో అద్దెకు ఉండే వారు, తమ నివాసంలోని విలువైన అన్ని ఉత్పత్తులకు కవరేజీ తీసుకోవచ్చు. ► వరదల సమయంలో ఇంట్లోని ఎలక్ట్రిక్ ఉత్పత్తులన్నింటికీ కరెంట్ కరెక్షన్ తొలగించాలి (అన్ ప్లగ్ చేయాలి). ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ను కూడా తొలగించాలి. ► వరద ముప్పు నుంచి తప్పించుకోవడానికి తమ వంతు ముందు జాగ్రత్తలూ తీసుకోవచ్చు. నిర్మా ణ సమయంలోనే ఇంటి బేస్మెంట్ను రోడ్డు నుంచి వీలైన మేర ఎత్తున నిర్మించుకోవాలి. ► సీవరేజీ పైపులకు చెక్ వాల్వులు ఏర్పాటు చేసుకోవాలి. వరదల సమయంలో బయటి నీరు సీవరేజీ పైపుల నుంచి మీ ఇంటిని ముంచెత్తకుండా చెక్‌వాల్వ్‌లు సాయపడతాయి. ► వరద నీరు ఇంట్లోకి చేరుతుందని గుర్తించిన వెంటనే విలువైన వస్తువులను ఎత్తయిన ప్రదేశానికి చేర్చాలి. లేదంటే దిగువ అంతస్తుల్లోని వారు ఎగువ అంతుస్తులోని వారి సాయం కోరి పై అంతస్తులకు తరలించాలి. ► ముఖ్యంగా కీలకమైన డాక్యుమెంట్లను, నగలను ముందుగా తీసేసి జాగ్రత్త పరుచుకోవాలి. ► కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకు నిర్మాణం చేసుకున్న వారు మేడపైకి వాటిని తరలించొచ్చు. వరద నీరు మరింత పైకి చేరుతుందని తెలిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలి. ► వరద హెచ్చరిక వచ్చిన వెంటనే అమలు చేసే విధంగా ముందస్తు కార్యాచరణ దగ్గర ఉంచుకోవాలి. -
అగ్ని ప్రమాదాలకు మూడు ప్రామాణిక పాలసీలు
సాక్షి, న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదాలు, వాటి కారణంగా ఏర్పడే ఇతర ప్రమాదాల నష్టాన్ని భర్తీ చేసే ప్రామాణిక బీమా పాలసీలను కనీసం మూడింటిని ప్రవేశపెట్టాలని అన్ని సాధారణ బీమా సంస్థలను ఐఆర్డీఏఐ ఆదేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్’(ఎస్ఎఫ్ఎస్పీ) స్థానంలో.. ‘భారత్ గృహ రక్ష’, భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష, భారత్ లఘు ఉద్యమ్ సురక్ష పాలసీలను ప్రవేశపెట్టాలని ఐఆర్డీఏఐ(బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ) తన ఆదేశాల్లో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి సాధారణ బీమా సంస్థలు వీటిని తప్పకుండా ఆఫర్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐఆర్డీఏఐ జనవరి 4న మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి ప్రకారం ఇల్లు, ఇంట్లోని వస్తువుల కవరేజీకి ఉద్దేశించినది భారత్ గృహ రక్ష పాలసీ. ఇంటితో పాటు ఇంట్లో వస్తువులకూ ఆటోమేటిక్‌గా బీమాలో 20 శాతం కవరేజీ (గరిష్టంగా రూ.10 లక్షలు) లభిస్తుంది. ఇంతకుమించి విలువైన వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని ప్రపోజల్ పత్రంలో పేర్కొనడం ద్వారా మరింత కవరేజీని పొందొచ్చు. ఉదాహరణకు, మీరు మీ సాధారణ ఇంటి విషయాలలో దేనినైనా (ఫ్రిజ్, టెలివిజన్, వాషింగ్ మెషీన్ వంటివి) 50 వేలకు బీమా చేసినట్లయితే, అసలు విలువ లక్ష అయితే, పాలసీ మొత్తం బీమా మొత్తాన్ని అంటే 50వేలను చెల్లిస్తుంది ( 50,000). భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష అన్నది సంస్థల కోసం ప్రత్యేకించినది. రూ.5 కోట్ల వరకు రిస్క్ కవర్‌ను ఇందులో భాగంగా ఆఫర్ చేయాల్సి ఉంటుంది. భారత్ లఘు ఉద్యమ్ సురక్ష పాలసీ.. రూ.5 కోట్లకు మించి రూ.50 కోట్ల వరకు సంస్థల కోసం బీమా కవరేజీని ఆఫర్ చేస్తుంది. -
బీమా చిన్నదే..కానీ ఎంతో ఆదా
నేటి పరిస్థితుల్లో ఎన్నో రూపాల్లో మనకు రక్షణ కల్పించే సాధనం బీమా. అందుకే ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో బీమా తప్పనిసరిగా ఉండాలి. ఎన్నో కారణాలతో మనపై పడే ఆర్థిక భారాన్ని కేవలం కొంచెం ప్రీమియం భరించడం ద్వారా తొలగించుకోవచ్చు. జీవిత బీమా ఒక్కటే కాకుండా, ఆరోగ్య బీమా, ఇంటికి, ఇంట్లోని వస్తువులకు, వాహనాలకు, చివరికి మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ వరకు ఎన్నో రూపాల్లో బీమా రక్షణ లభిస్తోంది. చాలా మంది ఆర్థిక ప్రణాళికల్లో జీవిత బీమా, గృహ బీమా తప్పించి ఇతరత్రా దేనికీ బీమా ఉండదు. కాకపోతే ఇతర బీమా రక్షణ కూడా తీసుకోవాలా..? లేదా అనేదానిని వ్యక్తుల వ్యక్తిగత ఆర్థిక సామర్థ్యమే నిర్ణయిస్తుంది. కానీ, నిజం ఏమిటంటే కేవలం రూపాయి ప్రీమియానికే వచ్చే బీమా పాలసీలు ఎన్నో అందుబాటులో ఉన్నా యి. వీటిని సాచెట్ లేదా బైట్సైజు బీమా కవరేజీలుగా పిలుస్తారు. వీటి ప్రయోజనాలను వివరంగా తెలియజేసే ప్రాఫిట్ కథనం. దేశంలో బైట్ సైజు (చిన్న ఉత్పత్తులు)/మైక్రో ఇన్సూరెన్స్ (సూక్ష్మ బీమా) బీమా పాలసీలు అన్నవి ఇప్పటికీ ఆరంభ దశలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. కాకపోతే వీటిల్లో ఉండే సౌకర్యం, సరళతరం కారణంగా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం సంతరించుకుంటున్నాయి. ఈ పాలసీల కాల వ్యవధి ఒక్క రోజుతో మొదలుకొని, ఏడాది వరకు కొనసాగుతాయి. ఈ మైక్రో ఇన్సూరెన్స్ ఉత్పత్తులను కంపెనీలు ప్రధానంగా మొదటి సారి బీమా పాలసీలు తీసుకునే వారిని లక్ష్యం చేసుకుని తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా మిలీనియల్స్ (1980–2000 మధ్య జన్మించినవారు) కోసం. అప్పటి వరకు పాలసీలు తీసుకోని వారు ముందు ఈ పాలసీలను తీసుకోవడంతో తమ ప్రయాణాన్ని ఆరంభించొచ్చు. ఆ తర్వాత అయినా సమగ్ర బీమా పథకాలను తీసుకోవడం ద్వారా పూర్తి స్థాయి రక్షణ ఉండేలా చూసుకోవాలి. ఆయా అంశాలపై సంబంధిత నిపుణుల సలహాలు తీçసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. పర్యటన రద్దయితే పరిహారం.. డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేస్తున్న పర్యాటక బీమా పాలసీలో.. పర్యటన ఆలస్యం, విమాన సర్వీసు రద్దు అయితే పరిహారం చెల్లించే ఆప్షన్లు ఉన్నాయి. దేశీయ విమాన సర్వీసులు అయితే 75 నిమిషాల కంటే ఆలస్యం అయినప్పుడు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఇతర బీమా సంస్థలు అయితే కనీసం ఆరు గంటల పాటు విమానం ఆలస్యమైనప్పుడే పరిహారం చెల్లిస్తున్నాయి. ఇక విమాన ప్రయాణాన్ని నిర్ణీత సమయానికి 24 గంటలు ముందుగా రద్దు చేసుకున్నట్టయితే, డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.20,000కు గరిష్టంగా చెల్లిస్తుంది. టికెట్లో నాన్ రిఫండబుల్ రూపంలో కోల్పోయే మొత్తంపై ఈ పరిమితికి లోబడి పరిహారం చెల్లిస్తుంది. ఉదాహరణకు చెన్నై–జైపూర్ మధ్య మూడు రోజుల ట్రిప్‌నకు డిజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద రూ.329 వసూలు చేస్తోంది. ఇదే పాలసీలో బ్యాగేజీని నష్టపోయినా, వ్యక్తిగత ప్రమాదం, అత్యవసరంగా వైద్య చికిత్సలకు సైతం రక్షణ కల్పిస్తోంది. ఫ్లయిట్ ఆలస్యం అయితే దానిని డిజిట్ సంస్థ తనంతట తానే గుర్తించి క్లెయిమ్ చేసుకోవాలంటూ పాలసీదారులకు మెస్సేజ్ పంపిస్తుంది. క్లెయిమ్ పరిష్కారం కూడా ఆన్లైన్లోనే సులభంగా చేసుకోవచ్చు. మొబైల్ కవరేజీ.. ఖరీదైన మొబైల్స్‌కు ప్రొటెక్షన్ ప్లాన్ ఎంతో మేలు. అకో జనరల్ ఇన్సూరెన్స్ రూ.7,500–10,000 మధ్య ధర ఉండే నూతన మొబైల్ ఫోన్లకు ప్రొటెక్షన్ ప్లాన్‌ను అమెజాన్ వేదికగా ఆఫర్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, ధర ఆధారంగా ప్రీమియం ఉంటుంది. ఉదాహరణకు శామ్సంగ్ గెలాక్సీ ఎం30 ధర రూ.9,999. ఇందుకోసం అకో జనరల్ రూ.299ను ఏడాది ప్రీమియంగా వసూలు చేస్తోంది. చేజారి కింద పడిపోయినా, నీళ్లలో పడి దెబ్బతిన్నా పరిహారానికి క్లెయిమ్ చేయవచ్చు. కాకపోతే దొంగ తనం వల్ల కోల్పోతే పరిహారం రాదు. నేరుగా కస్టమర్ ఇంటికే వచ్చి ఫోన్‌ను తీసుకెళ్లి రిపేర్ చేయించి తిరిగి అందించడం చేస్తుంది. ఒకవేళ ఫోన్ అసలుకే పనిచేయకుండా పోయి పూర్తి పరిహారం కోసం క్లెయిమ్ చేసుకుంటే, అప్పుడు ఫోన్ విలువలో తరుగుదలను మినహాయించి మిగిలిన మేర చెల్లిస్తుంది. డిజిట్ ఇన్సూరెన్స్ కూడా మొబైల్ ఫోన్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. కాకపోతే ప్రమాదవశాత్తూ ఫోన్ స్క్రీన్ దెబ్బతిన్న సందర్భాల్లోనే ఈ పాలసీ పరిహారం చెల్లిస్తుంది. కొత్త ఫోన్లకు, అప్పటికే కొంత కాలం వినియోగించిన ఫోన్లకు సైతం ఈ పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంది. పాలసీ తీసుకున్న వారు తమ ఫోన్ స్క్రీన్ దెబ్బతింటే, స్థానికంగా ఉన్న ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో రిపేర్ చేయించుకుని, అందుకు సంబంధించి వీడియో, బిల్లును అప్లోడ్ చేయడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఫిట్నెస్ బీమా సింబో ఇన్సూరెన్స్ సంస్థ ఫుట్‌బాల్, పరుగు పందేల్లో పాల్గొనే వారికి ఫిట్నెస్ కవర్‌ను ఆఫర్ చేస్తోంది. ఒక సెషన్ నుంచి ఏడాది వరకు పాలసీని తీసుకోవచ్చు. ఆట సమయంలో గాయపడి చికిత్స అవసరం అయినా, ప్రాక్టీసు చేస్తూ గాయపడినా, ఫిజియో థెరపీ కావాల్సి వచ్చినా, ఇతరత్రా పరిహారాన్ని పాలసీ కింద అందిస్తోంది. రూ.5,000 వరకు ఎముక గాయాలకు, రూ.25,000 వరకు లిగమెంట్ టియర్, రూ.10,000 వరకు పంటి గాయాలకు కవరేజీని కేవలం రూ.9 ప్రీమియానికే ఒక మ్యాచ్‌కు ఆఫర్ చేస్తోంది. సింబో మొబైల్ యాప్ ద్వారా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్టర్ సర్టిఫికెట్, వ్యాధి నిర్ధారణ పరీక్షల కాపీలను యాప్ ద్వారా అప్లోడ్ చేస్తే, వేగంగా పరిహారం లభిస్తుంది. కీటకాలతో వచ్చే వ్యాధులకు.. వెక్టార్ బోర్న్ డిసీజ్ కవర్ అన్నది, ముఖ్యంగా దోమలు, పురుగులు కుట్టడం వల్ల అనారోగ్యం పాలైనప్పుడు.. చికిత్సలు, ఇతర వ్యయాలకు రక్షణ కల్పించేది. డెంగ్యూ, మలేరియా, కాలా అజార్, చికున్‌గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్, జికా వైరస్, ఫైలేరియాలకు ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. ఏడాదికి ప్రీమియం రూ.49 నుంచి ఆరంభమవుతుంది. తమ ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పాలసీని తీసుకునేందుకు వీలుంది. అయితే, ఇతర ఆరోగ్య బీమా ఉత్పత్తుల్లో ఉండే విధంగానే.. వీటిల్లోనూ వేచి ఉండే కాలం, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పాలసీ తీసుకున్న నాటి నుంచి కనీసం 15 రోజుల తర్వాతే క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా కీటకాల కారణంగా అనారోగ్యానికి గురై, ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటల పాటు చికిత్స అవసరమైన వారికే పరిహారం లభిస్తుంది. నగదు రహితం లేదా రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ జనరల్, హెచ్డీఎఫ్సీ ఎర్గో తదితర కంపెనీల పోర్టళ్ల నుంచి నేరుగా ఈ పాలసీని పొందవచ్చు. మొబిక్విక్ లేదా టాఫీ ఇన్సూరెన్స్ వంటి అగ్రిగేటర్ల ద్వారా కూడా ఈ తరహా పాలసీ తీసుకోవచ్చు. మొబిక్విక్ సంస్థ మ్యాక్స్బూపాకు చెందిన మస్కిటో ఇన్సూరెన్స్ కవర్‌ను ఆఫర్ చేస్తోంది. రూ.10,000 సమ్ ఇన్సూర్డ్‌కు రూ.49ను ఏడాదికి చార్జ్ చేస్తోంది. అదే బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి మీరు ఇంతే మొత్తానికి ఏడాది కోసం రూ.160 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సమ్ ఇన్సూర్డ్ ఇంకా అధికంగా ఉండాలని కోరుకుంటే ఆ మేరకు అదనపు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. డెంగ్యూ వ్యాధుల నుంచి ఆర్థిక రక్షణ దిశలో ఈ తరహా పాలసీలు ఎంతో మంచివనడంలో సందేహం లేదు. ఇంటికి సైతం కొన్ని రోజులకే కవరేజీ..? సంప్రదాయ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ 30 రోజులు, ఏడాది, 20 ఏళ్ల కాలానికి లభిస్తోంది. ఇంత కంటే ఇంకా తక్కువ వ్యవధికే పాలసీ తీసుకునే వీలు కూడా ఉండడం సానుకూలం. ఉదాహరణకు ఐదు రోజుల పాటు ఊరెళుతూ, అన్ని రోజులకే మీ ఇంటికి బీమా రక్షణ తీసుకోవాలనుకుంటే అది సాధ్యమే. కనీసం రూ.2లక్షల బీమా కవరేజీకి కనీస ప్రీమియం రూ.200గా ఉంది. ఎన్ని రోజుల పాటు పర్యటనకు వెళుతున్నారు, నివసించే ఇల్లు రకం (భవనమా లేక అపార్ట్మెంట్లో ఫ్లాటా), ఏ అంతస్తులో ఉంటున్నారనే అంశాల ఆధారంగా తీసుకునే బీమా మొత్తం, ప్రీమియం మారిపోవచ్చు. ఇంట్లోని వస్తువులకు ఒక్క రోజుకు కూడా బీమా కవరేజీ తీసుకోవచ్చు. దొంగతనాలు, దోపిడీలు, ప్రకృతి విపత్తుల కారణంగా కలిగే నష్టానికి ఈ పాలసీ రక్షణనిస్తుంది. బీమా మొత్తంలో గరిష్టంగా 20 శాతం వరకు ఇంట్లో ఉంచిన ఆభరణాలకూ కవరేజీ పొందొచ్చు. అలాగే, రూ.50,000 వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీకి కూడా అవకాశం ఉంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు, పరిమితులు ఉంటాయి. -
గృహానికీ బీమా భరోసా
చాలా మందికి సొంత ఇంటి కొనుగోలు అనేది జీవిత కాల పెట్టుబడి. ఎందుకంటే ఇది ఆర్థికపరమైన భరోసాతో పాటు మానసికంగానూ కాస్త ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ఎలాంటి ఉపద్రవాలొచ్చినా.. హాని కలగకుండా దీన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాం.. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు మొదలైన వాటి నుంచి ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకు అత్యాధునిక తాళాలు, అగ్నిమాపక సాధనాలు లాంటివి ఉన్నప్పటికీ .. ఇవి నష్టాలను పూర్తిగా నివారించలేవు. భర్తీ చేయలేవు. కాబట్టే, పూర్తిగా రక్షణ కావాలంటే .. ఇంటితో పాటు ఇంట్లోని విలువైన వస్తువులకు కూడా వర్తించేలా గృహ బీమా పాలసీ తీసుకోవడం మంచిది. సమగ్రమైన హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న పక్షంలో నష్టాలను సాధ్యమైనంత మేర తగ్గించుకోవచ్చు. సాధారణంగా గృహ బీమా పాలసీలతో ఈ కింది అనూహ్య వైపరీత్యాల నుంచి ఇంటికి బీమా రక్షణ పొందవచ్చు. * ఇంటిలోని విలువైన వస్తువులకూ ఇన్సూరెన్స్ * స్వల్ప ప్రీమియంలకు అధిక కవరేజీ ప్రకృతి వైపరీత్యాలకు వర్తించే కవరేజీ ఆయా ప్రాంతాలను బట్టి.. వరదలు, భూకంపాలు, తుపానుల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇంటికి తీవ్ర నష్టాన్ని కలగజేయొచ్చు. వాతావరణం పెను మార్పులకు లోనవుతున్న నేపథ్యంలో ఇలాంటి వైపరీత్యాలు తరచూ సంభవిస్తున్నాయి. చెన్నై వరదలు, ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు లాంటివి ఇందుకు ఉదాహరణలు. కాబట్టి ఇలాంటి వాటి నుంచి రక్షణ కల్పించేదిగా హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలో కవరేజీ ఉండాలి. అగ్నిప్రమాదాలు.. చిన్న నిప్పు రవ్వ సైతం భారీ అగ్నిప్రమాదానికి .. ఫలితంగా నష్టాలకు దారితీయొచ్చు. హోమ్ ఇన్సూరెన్స్‌తో ఇంటితో పాటు ఇంట్లోని విలువైన వస్తువులకు కూడా అగ్నిప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. అల్లర్లు.. టైజం.. ప్రకృతి వైపరీత్యాలను పక్కన పెడితే కొన్నాళ్ల క్రితం దాకా టైజం లాంటి విపత్తుల ఉదంతాలు కొంత తక్కువగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో అల్లర్లు, టైజం, దోపిడీలు, దొంగతనాల ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి నుంచి కూడా ఇంటికి రక్షణ కల్పించగలదు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఒకవేళ మీరు అద్దె ఇంట్లో ఉంటున్న పక్షంలో గృహానికి తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా.. ఇంట్లోని ఇతరత్రా విలువైన వస్తువుల కోసం బీమా పాలసీ తీసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నిచర్, ఆభరణాలు లాంటివన్నీ కూడా ఈ కోవలోకి వస్తాయి. ప్రస్తుతానికైతే.. హోమ్ ఇన్సూరెన్స్ ఎక్కువగా మెట్రో నగరాల్లోనే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అయితే, నివాసం ఉంటున్నది నగరంలోనైనా వేరే ఎక్కడైనా కూడా రిస్కులు తప్పని పరిస్థితి కాబట్టి.. హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఈ పాలసీలకు కట్టాల్సిన ప్రీమియంలు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఉదాహరణకు ఇల్లు, ఇంట్లోని విలువైన వస్తువులకు కూడా దాదాపు రూ. 5,00,000 సమ్ అష్యూర్డ్ మేర కవరేజీనిచ్చే పాలసీ.. అత్యంత తక్కువగా రూ. 1,500 స్థాయి ప్రీమియంకు కూడా లభ్యమవుతుంది. ఇంత తక్కువ ప్రీమియంతో అత్యధిక కవరేజీ లభిస్తున్నప్పటికీ .. హోమ్ ఇన్సూరెన్స్‌కి ఇంకా సరైనంత ప్రాచుర్యం లభించడం లేదు. చాలా మంది వేసుకునే ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగినంత చోటు దక్కడం లేదు. పాలసీ ఎంచుకోవడమిలా.. హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ముందుగా కొన్ని అంశాలు సరిచూసుకోవాలి. మీ నివాసానికి ఎంత బీమా, ఏ రకమైన కవరేజీ అవసరమన్నది ఒకసారి లెక్కవేసుకోవాలి. దీర్ఘకాలానికి కవరేజీ ఎంచుకుంటే కట్టాల్సిన ప్రీమియంలలో ఒకోసారి 50 శాతం దాకా కూడా డిస్కౌంట్లు లభించవచ్చు. అలాగే ప్రతి సారీ పాలసీని రెన్యూవల్ చేసుకోవాల్సిన సమస్యా తప్పుతుంది. - పునీత్ సాహ్ని, ప్రోడక్ట్ డెవలప్మెంట్ విభాగం హెడ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్