బీమా చిన్నదే..కానీ ఎంతో ఆదా | Bite-size insurance products details | Sakshi
Sakshi News home page

బీమా చిన్నదే..కానీ ఎంతో ఆదా

Published Mon, Aug 17 2020 4:11 AM | Last Updated on Mon, Aug 17 2020 4:11 AM

Bite-size insurance products details - Sakshi

నేటి పరిస్థితుల్లో ఎన్నో రూపాల్లో మనకు రక్షణ కల్పించే సాధనం బీమా. అందుకే ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో బీమా తప్పనిసరిగా ఉండాలి. ఎన్నో కారణాలతో మనపై పడే ఆర్థిక భారాన్ని కేవలం కొంచెం ప్రీమియం భరించడం ద్వారా తొలగించుకోవచ్చు. జీవిత బీమా ఒక్కటే కాకుండా, ఆరోగ్య బీమా, ఇంటికి, ఇంట్లోని వస్తువులకు, వాహనాలకు, చివరికి మనం ఉపయోగించే స్మార్ట్‌ ఫోన్‌ వరకు ఎన్నో రూపాల్లో బీమా రక్షణ లభిస్తోంది.

చాలా మంది ఆర్థిక ప్రణాళికల్లో జీవిత బీమా, గృహ బీమా తప్పించి ఇతరత్రా దేనికీ బీమా ఉండదు. కాకపోతే ఇతర బీమా రక్షణ కూడా తీసుకోవాలా..? లేదా అనేదానిని వ్యక్తుల వ్యక్తిగత ఆర్థిక సామర్థ్యమే నిర్ణయిస్తుంది. కానీ, నిజం ఏమిటంటే కేవలం రూపాయి ప్రీమియానికే వచ్చే బీమా పాలసీలు ఎన్నో అందుబాటులో ఉన్నా యి. వీటిని సాచెట్‌ లేదా బైట్‌సైజు బీమా కవరేజీలుగా పిలుస్తారు. వీటి ప్రయోజనాలను వివరంగా తెలియజేసే ప్రాఫిట్‌ కథనం.

దేశంలో బైట్‌ సైజు (చిన్న ఉత్పత్తులు)/మైక్రో ఇన్సూరెన్స్‌ (సూక్ష్మ బీమా) బీమా పాలసీలు అన్నవి ఇప్పటికీ ఆరంభ దశలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. కాకపోతే వీటిల్లో ఉండే సౌకర్యం, సరళతరం కారణంగా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం సంతరించుకుంటున్నాయి. ఈ పాలసీల కాల వ్యవధి ఒక్క రోజుతో మొదలుకొని, ఏడాది వరకు కొనసాగుతాయి.

ఈ మైక్రో ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులను కంపెనీలు ప్రధానంగా మొదటి సారి బీమా పాలసీలు తీసుకునే వారిని లక్ష్యం చేసుకుని తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా మిలీనియల్స్‌ (1980–2000 మధ్య జన్మించినవారు) కోసం. అప్పటి వరకు పాలసీలు తీసుకోని వారు ముందు ఈ పాలసీలను తీసుకోవడంతో తమ ప్రయాణాన్ని ఆరంభించొచ్చు. ఆ తర్వాత అయినా సమగ్ర బీమా పథకాలను తీసుకోవడం ద్వారా పూర్తి స్థాయి రక్షణ ఉండేలా చూసుకోవాలి. ఆయా అంశాలపై సంబంధిత నిపుణుల సలహాలు తీçసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.

పర్యటన రద్దయితే పరిహారం..
డిజిట్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ఆఫర్‌ చేస్తున్న పర్యాటక బీమా పాలసీలో.. పర్యటన ఆలస్యం, విమాన సర్వీసు రద్దు అయితే పరిహారం చెల్లించే ఆప్షన్లు ఉన్నాయి. దేశీయ విమాన సర్వీసులు అయితే 75 నిమిషాల కంటే ఆలస్యం అయినప్పుడు పరిహారం కోసం క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అదే ఇతర బీమా సంస్థలు అయితే కనీసం ఆరు గంటల పాటు విమానం ఆలస్యమైనప్పుడే పరిహారం చెల్లిస్తున్నాయి.

ఇక విమాన ప్రయాణాన్ని నిర్ణీత సమయానికి 24 గంటలు ముందుగా రద్దు చేసుకున్నట్టయితే, డిజిట్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ రూ.20,000కు గరిష్టంగా చెల్లిస్తుంది. టికెట్‌లో నాన్‌ రిఫండబుల్‌ రూపంలో కోల్పోయే మొత్తంపై ఈ పరిమితికి లోబడి పరిహారం చెల్లిస్తుంది. ఉదాహరణకు చెన్నై–జైపూర్‌ మధ్య మూడు రోజుల ట్రిప్‌నకు డిజిట్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కింద రూ.329 వసూలు చేస్తోంది. ఇదే పాలసీలో బ్యాగేజీని నష్టపోయినా, వ్యక్తిగత ప్రమాదం, అత్యవసరంగా వైద్య చికిత్సలకు సైతం రక్షణ కల్పిస్తోంది.  ఫ్లయిట్‌ ఆలస్యం అయితే దానిని డిజిట్‌ సంస్థ తనంతట తానే గుర్తించి క్లెయిమ్‌ చేసుకోవాలంటూ పాలసీదారులకు మెస్సేజ్‌ పంపిస్తుంది. క్లెయిమ్‌ పరిష్కారం కూడా ఆన్‌లైన్‌లోనే సులభంగా చేసుకోవచ్చు.  

మొబైల్‌ కవరేజీ..
 ఖరీదైన మొబైల్స్‌కు ప్రొటెక్షన్‌ ప్లాన్‌ ఎంతో మేలు. అకో జనరల్‌ ఇన్సూరెన్స్‌ రూ.7,500–10,000 మధ్య ధర ఉండే నూతన మొబైల్‌ ఫోన్లకు ప్రొటెక్షన్‌ ప్లాన్‌ను అమెజాన్‌ వేదికగా ఆఫర్‌ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్, ధర ఆధారంగా ప్రీమియం ఉంటుంది. ఉదాహరణకు శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం30 ధర రూ.9,999. ఇందుకోసం అకో జనరల్‌ రూ.299ను ఏడాది ప్రీమియంగా వసూలు చేస్తోంది. చేజారి కింద పడిపోయినా, నీళ్లలో పడి దెబ్బతిన్నా పరిహారానికి క్లెయిమ్‌ చేయవచ్చు. కాకపోతే దొంగ తనం వల్ల కోల్పోతే పరిహారం రాదు. నేరుగా కస్టమర్‌ ఇంటికే వచ్చి ఫోన్‌ను తీసుకెళ్లి రిపేర్‌ చేయించి తిరిగి అందించడం చేస్తుంది.

ఒకవేళ ఫోన్‌ అసలుకే పనిచేయకుండా పోయి పూర్తి పరిహారం కోసం క్లెయిమ్‌ చేసుకుంటే, అప్పుడు ఫోన్‌ విలువలో తరుగుదలను మినహాయించి మిగిలిన మేర చెల్లిస్తుంది. డిజిట్‌ ఇన్సూరెన్స్‌ కూడా మొబైల్‌ ఫోన్‌ ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తోంది. కాకపోతే ప్రమాదవశాత్తూ ఫోన్‌ స్క్రీన్‌ దెబ్బతిన్న సందర్భాల్లోనే ఈ పాలసీ పరిహారం చెల్లిస్తుంది. కొత్త ఫోన్లకు, అప్పటికే కొంత కాలం వినియోగించిన ఫోన్లకు సైతం ఈ పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంది. పాలసీ తీసుకున్న వారు తమ ఫోన్‌ స్క్రీన్‌ దెబ్బతింటే, స్థానికంగా ఉన్న ఆథరైజ్డ్‌ సర్వీస్‌ సెంటర్‌లో రిపేర్‌ చేయించుకుని, అందుకు సంబంధించి వీడియో, బిల్లును అప్‌లోడ్‌ చేయడం ద్వారా పరిహారం పొందొచ్చు.

ఫిట్‌నెస్‌ బీమా
సింబో ఇన్సూరెన్స్‌ సంస్థ ఫుట్‌బాల్, పరుగు పందేల్లో పాల్గొనే వారికి ఫిట్‌నెస్‌ కవర్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఒక సెషన్‌ నుంచి ఏడాది వరకు పాలసీని తీసుకోవచ్చు. ఆట సమయంలో గాయపడి చికిత్స అవసరం అయినా, ప్రాక్టీసు చేస్తూ గాయపడినా, ఫిజియో థెరపీ కావాల్సి వచ్చినా, ఇతరత్రా పరిహారాన్ని పాలసీ కింద అందిస్తోంది. రూ.5,000 వరకు ఎముక గాయాలకు, రూ.25,000 వరకు లిగమెంట్‌ టియర్, రూ.10,000 వరకు పంటి గాయాలకు కవరేజీని కేవలం రూ.9 ప్రీమియానికే ఒక మ్యాచ్‌కు ఆఫర్‌ చేస్తోంది. సింబో మొబైల్‌ యాప్‌ ద్వారా క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్టర్‌ సర్టిఫికెట్, వ్యాధి నిర్ధారణ పరీక్షల కాపీలను యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తే, వేగంగా పరిహారం లభిస్తుంది.

కీటకాలతో వచ్చే వ్యాధులకు..
వెక్టార్‌ బోర్న్‌ డిసీజ్‌ కవర్‌ అన్నది, ముఖ్యంగా దోమలు, పురుగులు కుట్టడం వల్ల అనారోగ్యం పాలైనప్పుడు.. చికిత్సలు, ఇతర వ్యయాలకు రక్షణ కల్పించేది. డెంగ్యూ, మలేరియా, కాలా అజార్, చికున్‌గున్యా, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్, జికా వైరస్, ఫైలేరియాలకు ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. ఏడాదికి ప్రీమియం రూ.49 నుంచి ఆరంభమవుతుంది. తమ ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పాలసీని తీసుకునేందుకు వీలుంది. అయితే, ఇతర ఆరోగ్య బీమా ఉత్పత్తుల్లో ఉండే విధంగానే.. వీటిల్లోనూ వేచి ఉండే కాలం, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పాలసీ తీసుకున్న నాటి నుంచి కనీసం 15 రోజుల తర్వాతే క్లెయిమ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

అది కూడా కీటకాల కారణంగా అనారోగ్యానికి గురై, ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటల పాటు చికిత్స అవసరమైన వారికే పరిహారం లభిస్తుంది. నగదు రహితం లేదా రీయింబర్స్‌మెంట్‌ విధానంలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. బజాజ్‌ అలియాంజ్‌ జనరల్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో తదితర కంపెనీల పోర్టళ్ల నుంచి నేరుగా ఈ పాలసీని పొందవచ్చు. మొబిక్‌విక్‌ లేదా టాఫీ ఇన్సూరెన్స్‌ వంటి అగ్రిగేటర్ల ద్వారా కూడా ఈ తరహా పాలసీ తీసుకోవచ్చు. మొబిక్‌విక్‌ సంస్థ మ్యాక్స్‌బూపాకు చెందిన మస్కిటో ఇన్సూరెన్స్‌ కవర్‌ను ఆఫర్‌ చేస్తోంది. రూ.10,000 సమ్‌ ఇన్సూర్డ్‌కు రూ.49ను ఏడాదికి చార్జ్‌ చేస్తోంది. అదే బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నుంచి మీరు ఇంతే మొత్తానికి ఏడాది కోసం రూ.160 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సమ్‌ ఇన్సూర్డ్‌ ఇంకా అధికంగా ఉండాలని కోరుకుంటే ఆ మేరకు అదనపు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. డెంగ్యూ వ్యాధుల నుంచి ఆర్థిక రక్షణ దిశలో ఈ తరహా పాలసీలు ఎంతో మంచివనడంలో సందేహం లేదు.

ఇంటికి సైతం కొన్ని రోజులకే కవరేజీ..?
సంప్రదాయ హోమ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ 30 రోజులు, ఏడాది, 20 ఏళ్ల కాలానికి లభిస్తోంది. ఇంత కంటే ఇంకా తక్కువ వ్యవధికే పాలసీ తీసుకునే వీలు కూడా ఉండడం సానుకూలం. ఉదాహరణకు ఐదు రోజుల పాటు ఊరెళుతూ, అన్ని రోజులకే మీ ఇంటికి బీమా రక్షణ తీసుకోవాలనుకుంటే అది సాధ్యమే. కనీసం రూ.2లక్షల బీమా కవరేజీకి కనీస ప్రీమియం రూ.200గా ఉంది. ఎన్ని రోజుల పాటు పర్యటనకు వెళుతున్నారు, నివసించే ఇల్లు రకం (భవనమా లేక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటా), ఏ అంతస్తులో ఉంటున్నారనే అంశాల ఆధారంగా తీసుకునే బీమా మొత్తం, ప్రీమియం మారిపోవచ్చు. ఇంట్లోని వస్తువులకు ఒక్క రోజుకు కూడా బీమా కవరేజీ తీసుకోవచ్చు. దొంగతనాలు, దోపిడీలు, ప్రకృతి విపత్తుల కారణంగా కలిగే నష్టానికి ఈ పాలసీ రక్షణనిస్తుంది. బీమా మొత్తంలో గరిష్టంగా 20 శాతం వరకు ఇంట్లో ఉంచిన ఆభరణాలకూ కవరేజీ పొందొచ్చు. అలాగే, రూ.50,000 వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీకి కూడా అవకాశం ఉంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు, పరిమితులు ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement