న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) మధ్య మెగా విలీనానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఆయా బ్యాంకులు నిర్వహిస్తున్న బీమా, ఇతర ఆర్థిక వ్యాపారాల పరిస్థితి ఏంటన్న సందేహం తలెత్తుతోంది. 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి 4 మెగా బ్యాంకులుగా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో పలు బ్యాంకులు అనుబంధంగా బీమా వ్యాపార కంపెనీలను నిర్వహిస్తున్నాయి. వీటిని ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్నకు సమాధానాలు లభించాల్సి ఉంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..
బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) నిబంధనలు.. ఒక సంస్థ ఒకటికి మించి బీమా కంపెనీలను నిర్వహించరాదు. ప్రభుత్వరంగ బ్యాంకులు పలు బీమా కంపెనీలకు ప్రమోటర్లుగా ఉండడంతో ఇప్పుడు చిక్కు వచ్చి పడింది. ఉదాహరణకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు స్టార్ యూనియన్ దైచి లైఫ్ ఇన్సూరెన్స్‌లో 25.10 శాతం వాటా ఉంది. అలాగే, తాను విలీనం చేసుకోబోతున్న ఆంధ్రా బ్యాంకుకు ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 30 శాతం వాటా ఉంది. అలాగే, పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)కు పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో మెజారిటీ వాటా ఉంది.
ఇక పీఎన్‌బీ విలీనం చేసుకోనున్న ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) బ్యాంకుకు కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 23 శాతం వాటా ఉంది. ఇదే హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్‌లో కెనరా బ్యాంకు 51 శాతం వాటా కలిగి ఉంది. అలహాబాద్ బ్యాంకుకు యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్‌లో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల విలీన ప్రణాళికల ప్రకారం... పీఎన్‌బీ, ఓబీసీ, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విలీనమై పీఎన్‌బీగా కొనసాగుతాయి. యూనియన్ బ్యాంకు అయితే ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు విలీనం చేసుకోనుంది. సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకు విలీనం చేసుకోనున్నాయి.
కన్సాలిడేషన్ తప్పదు..
‘‘ఓ బీమా కంపెనీలో 15 శాతానికి మించి వాటాలు కలిగి ఉంటే ప్రమోటర్ అవుతారు. 15 శాతం కంటే తక్కువ ఉంటే ఇన్వెస్టర్‌గా పరిగణించడం జరుగుతుంది. రెండు బీమా సంస్థలకు ప్రమోటర్లుగా ఉన్న రెండు బ్యాంకులను విలీనం చేస్తుంటే.. విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకు రెండు బీమా కంపెనీల్లో ప్రమోటర్‌గా కొనసాగడానికి లేదు. కనుక రెండింటిలోనూ తన వాటాలను 15 శాతానికి తగ్గించుకోవడం ద్వారా ఇన్వెస్టర్‌గా కొనసాగాల్సి ఉంటుంది. లేదా ఒక బీమా కంపెనీలో వాటాలను పూర్తిగా విక్రయించి, మరో బీమా కంపెనీలో ప్రమోటర్‌గా కొనసాగొచ్చు’’ అని ఐఆర్‌డీఏఐ మాజీ సభ్యుడు ఒకరు తెలిపారు.
నిపుణులు ఏమంటున్నారు..?
‘‘విలీనానంతర బ్యాంకు ఒకటికి మించిన బీమా కంపెనీలను కలిగి ఉంటే అప్పుడు.. ఒక బీమా సంస్థ ఒప్పందం చేసుకుంటే, రెండోది దాన్ని గౌరవించాల్సి ఉంటుంది. అయితే, దీనిని ఎవరు చేయాలన్నదే ప్రశ్న. బ్యాంకులు పెద్ద ఎత్తున పెట్టుబడులతో బీమా కంపెనీల్లో వాటాలను తీసుకుంటుంటాయి. పాలసీలను విక్రయించడం ద్వారా అవి ఆదాయం సంపాదిస్తాయి’’ అని అశ్విన్ పరేఖ్ అడ్వైజరీ సర్వీసెస్ ఎండీ అశ్విన్ పరేఖ్ అన్నారు. ‘‘బీమా కంపెనీల్లో క్రాస్ హోల్డింగ్స్‌ను పరిష్కరించుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు స్టార్ యూనియన్ దైచీ లైఫ్‌లో యూనియన్ బ్యాంకు తనకున్న వాటాలను విక్రయించొచ్చు. ఎందుకంటే ఆంధ్రా బ్యాంకుకు ఇండియా ఫస్ట్ లైఫ్‌లో ఇంతకంటే అధిక వాటాలు ఉన్నాయి.
లేదంటే రెండు బీమా సంస్థల్లోనూ 10 శాతం చొప్పున వాటాలతో ఇన్వెస్టర్‌గా కొనసాగొచ్చు’’ అని ఓ ప్రైవేటు జీవిత బీమా సంస్థ సీఈవో అన్నారు. అయితే, భవిష్యత్తు వ్యాపార అవకాశాల దృష్ట్యా విలీనానంతర బ్యాంకు.. బీమా సంస్థల్లో మైనారిటీ వాటాలను కొనసాగిస్తూ, వాటి ఉత్పత్తులకు పంపిణీదారుగా వ్యవహరించడం సరైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించుకుంటామని యూనియన్ బ్యాంకు ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ తెలిపారు. అయితే, విలీనం తర్వాత వాటాలు కలిగి ఉన్న ఒకటికి మించిన బీమా సంస్థలను విలీనం చేసుకోవచ్చు. కానీ, అవన్నీ ప్రైవేటు బీమా కంపెనీలు. పైగా వాటిల్లో విదేశీ భాగస్వాములు కూడా ఉన్నారు. కనుక విలీనానికి అంగీకారం కష్టమేనన్న అభిప్రాయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment