merger banks
-
యాక్సిస్ గూటిలో సిటీ రిటైల్
న్యూఢిల్లీ/ముంబై: విదేశీ సంస్థ సిటీబ్యాంకు రిటైల్ బిజినెస్ కొనుగోలు పూర్తయినట్లు ప్రయివేట్ రంగ దేశీ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. దేశీయంగా సంస్థాగత క్లయింట్ల బిజినెస్‌ను మినహాయించిన డీల్ ప్రకారం తుదిగా రూ. 11,603 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. గతేడాది మార్చిలో యాక్సిస్ తొలిసారిగా కొనుగోలు అంశాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా 2.4 మిలియన్ సిటీ కస్టమర్లను యాక్సిస్ పొందింది. డీల్ కుదిరే సమయానికి ఈ సంఖ్య 3 మిలియన్లుగా నమోదైనట్లు యాక్సిస్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌధురి తెలియజేశారు. తమ ఖాతాదారులుగా మారిన సిటీ కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, చెక్ బుక్కులు, ప్రొడక్టు లబ్ధి తదితరాలు యథావిధిగా కొనసాగనున్నట్లు వివరించారు. మొత్తం 8.6 మిలియన్ కార్డులతో నాలుగో పెద్ద క్రెడిట్ కార్డుల సంస్థగా నిలుస్తున్న యాక్సిస్ మరో 2.5 మిలియన్ క్రెడిట్ కార్డులను జత చేసుకుంది. తద్వారా మూడో ర్యాంకుకు చేరింది. రూ. 4 లక్షల కోట్ల రిటైల్ బుక్ కలిగిన యాక్సిస్ సిటీబ్యాంక్ ఇండియాకు చెందిన 3 మిలియన్ కస్టమర్లతోపాటు.. 18 పట్టణాలలోగల 7 కార్యాలయాలు, 21 బ్రాంచీలు, 499 ఏటీఎంలను సొంతం చేసుకుంది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంమేరకు సిటీ బ్రాండును 18 నెలలపాటు యాక్సిస్ బ్యాంక్ వినియోగించుకోనుంది. -
హెచ్డీఎఫ్సీ మెగా విలీనం!
సుమారు ఎనిమిదేళ్లుగా ఊహిస్తున్న అతిపెద్ద కార్పొరేట్ విలీనానికి తాజాగా అడుగు పడింది. ఫైనాన్షియల్ రంగ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ట్విన్స్ ఒక్కటికానున్నాయి. రెరా అమలు తదుపరి ఇటీవల స్పీడందుకున్న గృహ రుణ రంగంలోని అవకాశాలను మరింత సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు రెండు సంస్థలు విలీనానికి తెరతీశాయి. వెరసి హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ) విలీనంకానుంది. సంయుక్త సంస్థ ఆస్తుల విలువ దాదాపు రూ. 18 లక్షల కోట్లుకాగా.. డీల్ విలువ 40 బిలియన్ డాలర్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగంలో నంబర్ వన్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో దేశీయంగా అతిపెద్ద గృహ రుణ కంపెనీ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనంకానుంది. ఇది దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద విలీనంకాగా.. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరింత భారీ రూపాన్ని సంతరించుకోనుంది. 42:25 నిష్పత్తిలో విలీనాన్ని చేపట్టనున్నట్లు రెండు సంస్థలూ వెల్లడించాయి. అంటే హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారుల వద్దగల ప్రతీ 25 షేర్ల స్థానే 42 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు జారీ కానున్నాయి. రెండు సంస్థలు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ డీల్ పూర్తయితే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పబ్లిక్ వాటాదారుల వాటా 100 శాతానికి చేరనుంది. దీనిలో ప్రస్తుత హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులకు 41 శాతం వాటా లభించనుంది. విలీనానికి ఆర్బీఐ తదితర నియంత్రణ సంస్థలనుంచి అనుమతులు లభించవలసి ఉంది. అనుబంధ సంస్థలు హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్, హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్ సైతం విలీనంలో భాగంకానున్నాయి. విలీనం తదుపరి హెచ్డీఎఫ్సీ విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్తగా గృహ రుణ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోనుంది. కస్టమర్ల సంఖ్యను సైతం భారీగా పెంచుకోనుంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ మొత్తం రూ. 6.23 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంది. ఇదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆస్తులు రూ. 19.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 6.8 కోట్ల కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది. దీర్ఘకాలిక రుణాలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన విభిన్న చౌక వ్యయాలతోకూడిన మూలధన అవకాశాలను కలిగి ఉంది. ఈ విలీనంతో బ్యాంకుకు మరింత విలువ చేకూరనున్నట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. భారీ బ్యాలన్స్‌షీట్, నెట్‌వర్త్ ద్వారా బ్యాంక్ లబ్ది పొందనున్నట్లు తెలియజేసింది. మౌలిక రంగం తదితర అతిభారీ రుణాల అండర్రైటింగ్కు వీలు చిక్కడం తోపాటు.. దేశ ఆర్థిక వ్యవస్థలోకి అత్యధికంగా రుణాలు విడుదలయ్యేందుకు దారి ఏర్పడనున్నట్లు అభిప్రాయపడింది. గృహ రుణ విడుదల సులభతరం కానున్నదని, ఇందుకు బ్యాంకుకున్న 6.8 కో ట్ల కస్టమర్ల బేస్ దన్నునివ్వనున్నదని వివరించింది. పలు బ్రాంచీలు మధ్య, అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు మంజూరు చేయడంలో హెచ్డీఎఫ్సీ ఎంతో ముందుంది. అందుబాటు ధరల గృహాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా కంపెనీ పలు రుణాలు విడుదల చేసింది. 6,342 బ్రాంచీల ద్వారా దేశవ్యాప్తంగా 3,000 నగరాలు, పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. విలీనం ద్వారా ఈ పంపిణీ వ్యవస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భాగం కానుండటంతో గృహ రుణ మంజూరీ మరింత విస్తరించనుంది. మార్టిగేజ్ పోర్ట్‌ఫోలియోతోపాటు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పంపిణీ వ్యవస్థ చేజిక్కనుండటంతో బ్యాంక్ భారీగా బలపడనుంది. వెరసి రెండు సంస్థల మధ్య విలీ నం పలు విధాల లబ్ది చేకూర్చనుంది. రూ. 18 లక్షల కోట్లు సంయుక్త సంస్థ బ్యాలన్స్‌షీట్ రూ. 17.87 లక్షల కోట్లకు చేరనున్నట్లు హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. నెట్‌వర్త్ రూ. 3.3 లక్షల కోట్లను తాకనున్నట్లు తెలియజేశారు. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థ(ఎన్బీఎఫ్సీ)ల మధ్య నిబంధనలు క్రమబద్ధీకరించడంతో నియంత్రణ సంస్థల మధ్యవర్తిత్వ అవసరాన్ని తగ్గించినట్లు వివరించారు. ఇది రెండు సంస్థల విలీన నిర్ణయంలో ఒక కీలకాంశంగా నిలిచినట్లు వెల్లడించారు. గత మూడు వారాలుగా విలీన చర్చలు జరుగుతున్నాయని, నిబంధనలకు అనుగుణంగా మొండిబకాయిల గుర్తింపు తదితర పలు అంశాలను సరైన విలువలో మదింపు చేయవలసి వచ్చిందని తెలియజేశారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా ప్రాధాన్యతా రంగ రుణ విడుదల తప్పనిసరికాకపోగా.. లయబిలిటీల కోసం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) లేదా నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని నిర్వహించవలసిన అవసరంకూడా లేదని పేర్కొన్నారు. దీంతో ఆస్తి, అప్పుల సమన్వయానికి ఆర్బీఐ నుంచి గడువును కోరవలసి వచ్చినట్లు వెల్లడించారు. విలీనానికి నియంత్రణ సంస్థలు అనుమతిస్తాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. విలీనంతో హెచ్డీఎఫ్సీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావమూ ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్బీఐ నోటిఫికేషన్‌తో.. ఎనిమిదేళ్ల క్రితమే బీజం ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌తో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మధ్య విలీనానికి దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే బీజం పడినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు, చౌక ధరల గృహాలకు రుణాలు సమకూర్చేందుకు వీలుగా దీర్ఘకాలిక బాండ్ల జారీకి బ్యాంకులను అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ 2014 జూలైలో నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా ఈ మార్గంలో సమీకరించిన నిధులకు బ్యాంకులు ఎస్ఎల్ఆర్ లేదా సీఆర్ఆర్ను నిర్వహించవలసిన అవసరంలేదంటూ పేర్కొంది. అంతేకాకుండా ఈ నిధులను ప్రాధాన్యతా రంగ రు ణ లక్ష్యాలకు తప్పనిసరిగా కేటాయించవలసిన అవస రంలేదని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో హెచ్డీఎఫ్సీ ద్వయం మధ్య విలీన అంశం చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిని రెండు సంస్థల కీలక అధికారులు తోసిపుచ్చారు! అయితే ఎనిమిదేళ్ల అనంతరం ఇది కార్యరూపం దాల్చడం ప్రస్తావించదగ్గ విషయం! 1994 నుంచీ..: హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1994 నుంచీ విడిగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆదిత్య పురీ నేతృత్వంలో బ్యాంక్ కార్యకలాపాలు 1994లో ప్రారంభమయ్యాయి. దీపక్ పరేఖ్ కోరికమేరకు విదేశీ బ్యాంకింగ్ దిగ్గజం సిటీని వీడిన పురీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు పగ్గాలు చేపట్టారు. బ్యాంకులో మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీకి 21% వాటా ఉంది. 2020 అక్టోబర్‌లో శశిధర్ జగదీశన్ బ్యాంక్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బ్యాంక్ నంబర్ టూ ఎస్బీఐ తదుపరి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మదింపు మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకోనున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశీయంగా అతిపెద్ద బ్యాంకుల్లో రెండో ర్యాంకులో నిలవనున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా పేర్కొంది. తొలి స్థానంలో పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) కొనసాగనున్నట్లు తెలియజేసింది. అయితే విలీన సంస్థ మరో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ పరిమాణంకంటే రెట్టింపు స్థాయికి చేరనున్నట్లు వివరించింది. విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. 15 శాతం మార్కెట్ వాటాతోపాటు, డైవర్సిఫైడ్ ఆదాయాన్ని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బ్యాంక్ మార్కెట్ వాటా 11 శాతంగా నమోదైనట్లు తెలిపింది. పోర్ట్‌ఫోలియోలో మార్టిగేజ్ రుణాల వాటా ప్రస్తుత 11 శాతం నుంచి మూడోవంతుకు చేరనున్నట్లు వివరించింది. హెచ్‌డీఎఫ్‌సీకి భారీ సంఖ్యలోగల కస్టమర్ల ద్వారా లబ్ది పొందనున్నట్లు పేర్కొంది. చౌకలో నిధుల సమీకరణకు వీలు చిక్కుతుందని తెలియజేసింది. కాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న రెండో రివర్స్ మెర్జర్ ఇది. ఇంతక్రితం ఐసీఐసీఐ లిమిటెడ్ సైతం ఐసీఐసీఐ బ్యాంకులో విలీనమైంది. 2001 అక్టోబర్‌లో అనుబంధ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకులో మాతృ సంస్థ ఐసీఐసీఐ లిమిటెడ్ కలిసింది. దిగ్గజాల మధ్య... ఇది రెండు సమాన దిగ్గజాల మధ్య జరుగుతున్న విలీనం. హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. రెరా అమలు, గృహ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా, చౌక ధరల గృహాలకు ప్రభుత్వ తోడ్పాటు దీనికి దోహదం చేస్తున్నాయి. –దీపక్ పరేఖ్, చైర్మన్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ గ్లోబల్ స్థాయికి... తాజా విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంతర్జాతీయ ప్రమాణాలతో చూసినా భారీ సంస్థగా ఆవిర్భవించనుంది. తద్వారా బ్యాంకులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులకు మరింత వీలు చిక్కనుంది. రెండు సంస్థల మధ్య విలీనం 12–18 నెలల్లో పూర్తికావచ్చు. –కేకి మిస్త్రీ, వైస్‌చైర్మన్, సీఈవో, హెచ్డీఎఫ్సీ షేర్ల దూకుడు రెండు సంస్థల మధ్య విలీన వార్తల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఊపందుకుంది. ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేరు 9% ఎగసి రూ. 2,676 వద్ద నిలిచింది. ఒక దశలో గరిష్టంగా 19% దూసుకెళ్లి రూ. 2,934ను తాకింది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 10% జంప్‌చేసి రూ. 1,654 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,722 వరకూ ఎగసింది. తద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 9,18,591 లక్షలను కోట్లను తాకగా.. హెచ్డీఎఫ్సీ మార్కెట్ విలువ రూ. 4,85,691 కోట్లను అధిగమించింది. సంయుక్తంగా చూస్తే రూ. 14 లక్షల కోట్లను దాటడం ద్వారా ఆర్ఐఎల్, టీసీఎస్ సరసన చేరింది! -
లక్ష్మీ విలాస్ విలీన స్కీమ్‌పై రగడ
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను (ఎల్వీబీ) డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీనం చేసే అంశం కొత్త మలుపు తిరిగింది. ఈ విలీన స్కీమ్‌పై స్టే విధించాలంటూ ఎల్వీబీ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, వాటాదారైన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ .. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాయి. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, డీబీఎస్ బ్యాంక్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నాయి. అయితే, విలీనంపై స్టే విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది. ‘విలీనంపై స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 14నకు వాయిదా వేస్తున్నాం. అప్పట్లోగా ప్రతివాదులు (ఆర్బీఐ, ఎల్వీబీ, డీబీఎస్ బ్యాంక్ ఇండియా) తమ అఫిడవిట్లు దాఖలు చేయాలి‘ అని జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విలీనంతో తాము రూ. 188 కోట్లు నష్టపోనున్నట్లు కేసు విచారణ సందర్భంగా ఇండియాబుల్స్ వాదించింది. అయితే, ప్రజలు, డిపాజిటర్లు, ఎల్వీబీ ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో విలీన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్బీఐ తరఫు న్యాయవాది రవి కదమ్ తెలిపారు. నవంబర్ 27 నుంచే విలీనం అమల్లోకి రానుండగా, సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, విలీన పథకంలో భాగంగా సుమారు రూ. 320 కోట్ల విలువ చేసే టియర్2 బాండ్లను కూడా రైటాఫ్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. పథకం ఏంటంటే..: విలీనానికి సంబంధించిన తుది స్కీమ్ ప్రకారం ఎల్వీబీ పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తం రైటాఫ్ చేయనున్నారు. దీంతో వాటాదారులకు దక్కేదేమీ లేదన్న నేపథ్యంలోనే తమ పెట్టుబడంతా కోల్పోనున్న ప్రమోటర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా.. చట్టపరమైన చర్యలపై దృష్టి పెట్టారు. ప్రమోటర్ గ్రూప్‌నకు ఎల్‌వీబీలో 6.8% వాటాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ ఆఖరు నాటికి ఎల్‌వీబీలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌కు 4.99%, ప్రొలిఫిక్ ఫిన్‌వెస్ట్‌కు 3.36%, శ్రేయి ఇన్ఫ్రాకు 3.34%, ఎంఎన్ దస్తూర్ అండ్ కో సంస్థకు 1.89%, క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ 1.82%, క్యాప్రి గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్ 2%, బయాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 1.36%, ట్రినిటీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు 1.61% వాటాలు ఉన్నాయి. -
ఐదో అతిపెద్ద బ్యాంక్ యూబీఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనం (అమాల్గమేషన్) తర్వాత దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా యూబీఐ అవతరించిందని ఎండీ అండ్ సీఈఓ రాజ్‌కిరణ్ రాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం యూబీఐకు దేశవ్యాప్తంగా 9,500 బ్రాంచీలు, 13,500 ఏటీఎంలు, 120 మిలియన్ల మంది కస్టమర్లున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్‌ల వినియోగదారులు తమ డెబిట్ కార్డ్‌లను యూబీఐ ఏటీఎంలలో వినియోగించినా సరే ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. కస్టమర్ల ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ పోర్టల్స్‌లో ఎలాం టి మార్పులు ఉండవని.. గతంలో మాదిరిగానే వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. నగదు ఉపసంహరణ, నిల్వ, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి బేసిక్ సర్వీస్‌లను మూడింట్లో ఏ బ్యాంక్‌లోనైనా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. -
దేశీ బ్యాంకింగ్ రంగానికి నవోదయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మెగా విలీనంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దేశీ బ్యాంకింగ్ రంగానికి ఇది నవోదయంగా అభివర్ణించింది. ‘మరింత పటిష్టమైన, భారీ పీఎస్‌బీలు ఇంకా మెరుగైన ప్రత్యేక పథకాలు, మరింత వేగంగా రుణ ప్రాసెసింగ్ సేవలను కస్టమర్లకు అందించగలుగుతాయి. అవసరాలకు అనుగుణంగా ఇంటివద్దకే బ్యాంకింగ్ సేవలను విస్తరించగలుగుతాయి‘ అని ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం.. మ్రైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేసింది. నాలుగు పీఎస్బీల్లో ఆరు పీఎస్‌బీల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా పరమైన లాక్డౌన్ అమలవుతున్న తరుణంలో పీఎస్‌బీల విలీనం యథాప్రకారం అమల్లోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, విలీనం చేసుకున్న యునైటెడ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా ఉన్న శాఖలన్నీ తమ బ్రాంచీలుగా సేవలు అందిస్తున్నాయని పంజాబ్ నేషనల్ బ్యాంకు వెల్లడిం చింది. తమ బ్యాంకుకు ఇకపై 11,000 పైచిలుకు శాఖలు, 13,000 పైగా ఏటీఎంలు, ఒక లక్ష మంది పైగా ఉద్యోగులు, రూ. 18 లక్షల కోట్ల పైచిలుకు వ్యాపారం ఉంటుందని పీఎన్బీ ఎండీ ఎస్ఎస్ మల్లికార్జునరావు తెలిపారు. మెగా విలీనంలో భాగంగా.. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు.. యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు.. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకును విలీనం చేశారు. -
ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం కాదు: రజనీష్
న్యూఢిల్లీ: ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం ప్రసక్తే లేదని, కేవలం దాంట్లో వాటాను కొంటామని ఎస్బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ ప్రతిపాదించిన డ్రాఫ్ట్ స్కీంపై స్పందించేందుకు తమకు సోమవారం వరకు గడువుందన్నారు. మెండిబకాయిలతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన యస్‌బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఆర్బీఐ ప్రతిపాదించిన డ్రాప్ట్ స్కీంపై తమ బ్యాంక్ న్యాయబృందం పనిచేస్తోందన్నారు. ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం ఎట్టిపరిస్థితుల్లో ఉండదని స్పష్టంచేశారు. ‘యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను ఎస్బీఐ కొనుగోలు చేస్తే రూ.2,400కోట్ల పెట్టుబడి అవసరం అవుతోంది. పెట్టుబడి పథకాన్ని చూశాక 23 మంది ఇన్వెస్టర్లు ఎస్బీఐని సంప్రదించారు’ అని చెప్పారు. ‘యస్‌బ్యాంక్‌లో ఎస్బీఐ 49 శాతం కొంటుందా? లేక 26 శాతం తీసుకుంటుందా? అనేది ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. మరికొందరు ఇన్వెస్టర్ల నుండి వచ్చిన ఆసక్తిని పరిశీలిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
వచ్చే నెల 10న బ్యాంక్ యూనియన్ల ధర్నా
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్ 10న పార్లమెంట్ ముందు భైఠాయించాలని బ్యాంక్ యూనియన్లు నిర్ణయించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఈ చర్యతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. ఈ విధంగా విలీనం చేయడం వల్ల స్టేక్ హోల్డర్లకు ఎటువంటి ప్రయోజనం లేదని యూనియన్లు అంటున్నాయి. విలీనం పూర్తయితే నిరుపేదలు సరసమైన బ్యాంకింగ్ సేవలను కచ్చితంగా కోల్పోతారని పేర్కొన్నాయి. -
‘బీమా’ సంగతేంటి..?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) మధ్య మెగా విలీనానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఆయా బ్యాంకులు నిర్వహిస్తున్న బీమా, ఇతర ఆర్థిక వ్యాపారాల పరిస్థితి ఏంటన్న సందేహం తలెత్తుతోంది. 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి 4 మెగా బ్యాంకులుగా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో పలు బ్యాంకులు అనుబంధంగా బీమా వ్యాపార కంపెనీలను నిర్వహిస్తున్నాయి. వీటిని ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్నకు సమాధానాలు లభించాల్సి ఉంది. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నిబంధనలు.. ఒక సంస్థ ఒకటికి మించి బీమా కంపెనీలను నిర్వహించరాదు. ప్రభుత్వరంగ బ్యాంకులు పలు బీమా కంపెనీలకు ప్రమోటర్లుగా ఉండడంతో ఇప్పుడు చిక్కు వచ్చి పడింది. ఉదాహరణకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు స్టార్ యూనియన్ దైచి లైఫ్ ఇన్సూరెన్స్‌లో 25.10 శాతం వాటా ఉంది. అలాగే, తాను విలీనం చేసుకోబోతున్న ఆంధ్రా బ్యాంకుకు ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 30 శాతం వాటా ఉంది. అలాగే, పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు పీఎన్బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో మెజారిటీ వాటా ఉంది. ఇక పీఎన్బీ విలీనం చేసుకోనున్న ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) బ్యాంకుకు కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 23 శాతం వాటా ఉంది. ఇదే హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్‌లో కెనరా బ్యాంకు 51 శాతం వాటా కలిగి ఉంది. అలహాబాద్ బ్యాంకుకు యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్‌లో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల విలీన ప్రణాళికల ప్రకారం... పీఎన్బీ, ఓబీసీ, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విలీనమై పీఎన్బీగా కొనసాగుతాయి. యూనియన్ బ్యాంకు అయితే ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు విలీనం చేసుకోనుంది. సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకు విలీనం చేసుకోనున్నాయి. కన్సాలిడేషన్ తప్పదు.. ‘‘ఓ బీమా కంపెనీలో 15 శాతానికి మించి వాటాలు కలిగి ఉంటే ప్రమోటర్ అవుతారు. 15 శాతం కంటే తక్కువ ఉంటే ఇన్వెస్టర్‌గా పరిగణించడం జరుగుతుంది. రెండు బీమా సంస్థలకు ప్రమోటర్లుగా ఉన్న రెండు బ్యాంకులను విలీనం చేస్తుంటే.. విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకు రెండు బీమా కంపెనీల్లో ప్రమోటర్‌గా కొనసాగడానికి లేదు. కనుక రెండింటిలోనూ తన వాటాలను 15 శాతానికి తగ్గించుకోవడం ద్వారా ఇన్వెస్టర్‌గా కొనసాగాల్సి ఉంటుంది. లేదా ఒక బీమా కంపెనీలో వాటాలను పూర్తిగా విక్రయించి, మరో బీమా కంపెనీలో ప్రమోటర్‌గా కొనసాగొచ్చు’’ అని ఐఆర్డీఏఐ మాజీ సభ్యుడు ఒకరు తెలిపారు. నిపుణులు ఏమంటున్నారు..? ‘‘విలీనానంతర బ్యాంకు ఒకటికి మించిన బీమా కంపెనీలను కలిగి ఉంటే అప్పుడు.. ఒక బీమా సంస్థ ఒప్పందం చేసుకుంటే, రెండోది దాన్ని గౌరవించాల్సి ఉంటుంది. అయితే, దీనిని ఎవరు చేయాలన్నదే ప్రశ్న. బ్యాంకులు పెద్ద ఎత్తున పెట్టుబడులతో బీమా కంపెనీల్లో వాటాలను తీసుకుంటుంటాయి. పాలసీలను విక్రయించడం ద్వారా అవి ఆదాయం సంపాదిస్తాయి’’ అని అశ్విన్ పరేఖ్ అడ్వైజరీ సర్వీసెస్ ఎండీ అశ్విన్ పరేఖ్ అన్నారు. ‘‘బీమా కంపెనీల్లో క్రాస్ హోల్డింగ్స్‌ను పరిష్కరించుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు స్టార్ యూనియన్ దైచీ లైఫ్‌లో యూనియన్ బ్యాంకు తనకున్న వాటాలను విక్రయించొచ్చు. ఎందుకంటే ఆంధ్రా బ్యాంకుకు ఇండియా ఫస్ట్ లైఫ్‌లో ఇంతకంటే అధిక వాటాలు ఉన్నాయి. లేదంటే రెండు బీమా సంస్థల్లోనూ 10 శాతం చొప్పున వాటాలతో ఇన్వెస్టర్‌గా కొనసాగొచ్చు’’ అని ఓ ప్రైవేటు జీవిత బీమా సంస్థ సీఈవో అన్నారు. అయితే, భవిష్యత్తు వ్యాపార అవకాశాల దృష్ట్యా విలీనానంతర బ్యాంకు.. బీమా సంస్థల్లో మైనారిటీ వాటాలను కొనసాగిస్తూ, వాటి ఉత్పత్తులకు పంపిణీదారుగా వ్యవహరించడం సరైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించుకుంటామని యూనియన్ బ్యాంకు ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ తెలిపారు. అయితే, విలీనం తర్వాత వాటాలు కలిగి ఉన్న ఒకటికి మించిన బీమా సంస్థలను విలీనం చేసుకోవచ్చు. కానీ, అవన్నీ ప్రైవేటు బీమా కంపెనీలు. పైగా వాటిల్లో విదేశీ భాగస్వాములు కూడా ఉన్నారు. కనుక విలీనానికి అంగీకారం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. -
ప్రాంతీయత నిలబెట్టేందుకు ప్రాణాలైనా ఇస్తాం
సాక్షి, విజయవాడ : ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగుల ధర్నాతో విజయవాడ వన్‌టౌన్ దద్దరిల్లుతోంది. బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ ఆంధ్రబ్యాంక్ స్థానిక ఉద్యోగుల యూనియన్ విజయవాడలోని వన్ టౌన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బ్యాంక్ విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. కేంద్రం మొండి వైఖరిని వీడకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రాబ్యాంక్‌ను కాపాడి ప్రాంతీయత నిలబెట్టేందుకు ప్రాణాలైనా ఇస్తామంటూ వారు నినాదాలు చేశారు. అదేవిధంగా బడాబాబుల నుంచి మొండి బకాయిలను వసూలు చేసి బ్యాంకును నిలబెట్టాలనేది ప్రతి ఆంధ్రుడి గుండెచప్పుడంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శలైన మధు, రామకృష్ణలు బ్యాంకు ఉద్యోగుల ధర్నాకు మద్దతుగా గళం విప్పి వారికి అండగా నిలిచారు. అదే విధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరహరిశెట్టి నరసింహారావు కూడా శిబిరం వద్దకు వచ్చి ధర్నాకు సంఘీభావం తెలిపారు. -
‘ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేయొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంకును, యూనియన్ బ్యాంకులో విలీనం చేయవద్దంటూ మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా వుందన్నారు. స్వాతంత్ర్యం రాక మునుపే 90 ఏళ్ల క్రితం ఆంధ్ర ప్రాంతానికి చెందిన పట్టాభి రామయ్య ఆంధ్ర బ్యాంకును స్థాపించారన్నారు. ఇంతటి ప్రాచీన చరిత్ర ఉన్న ఆంధ్రా బ్యాంకును వేరే బ్యాంకుతో కలపవద్దని లేఖలో విన్నవించారు. తెలుగు ప్రజల మనోభావాలకు అద్దం పట్టే ఈ సునిశితమైన అంశంపై నిర్మలా సీతారామన్ మరోసారి ఆలోచించాలని కోరారు. అదే విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రా బ్యాంకును విలీనం చేయాల్సి వస్తే.. విలీనమైన బ్యాంకుకు ‘ఆంధ్రా బ్యాంకు’గానే నామకరణం చేయాలని బాలశౌరి ప్రతిపాదించారు. అంతేకాక సదరు బ్యాంకు ప్రధాన కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే ఈ అంశంపై ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్‌తో పాటు బ్యాంకింగ్ సెక్రటరీని కలుస్తానన్నని బాలశౌరి పేర్కొన్నారు. (చదవండి: బ్యాంకింగ్ బాహుబలి!) -
బ్యాంకింగ్ బాహుబలి!
బంపర్ మెజారిటీతో రెండోసారి అధికార పగ్గాలు దక్కించుకున్న మోదీ సర్కారు.. సంస్కరణల మోత మోగిస్తోంది. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఇటీవలే ఉద్దీపనలతో చికిత్స చేసిన కేంద్రం... తాజాగా ‘ఎఫ్‌డీఐ 2.0’ ద్వారా దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బ్యాంకింగ్ రంగంలో మెగా విలీనాలకు తెరతీసింది. మొండి బాకీలతో కునారిల్లుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు దివ్యౌషధం లాంటి చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తం 10 బ్యాంకులను విలీనం చేసి 4 బ్యాంకులకు పరిమితం చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి ఇప్పుడు 12కు చేరనుంది. ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల జాతీయీకరణ జరిగి ఈ ఏడాదికి 50 ఏళ్లు అయిన తరుణంలో ప్రభుత్వ బ్యాంకులను భారీస్థాయిలో విలీనం చేసి వాటి సంఖ్యను పరిమితం చేసేలా కీలక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం చేపట్టడం గమనార్హం. మొత్తం మీద దాదాపు నెల రోజుల వ్యవధిలోనే అటు కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వంటి సంచలన నిర్ణయంతో పాటు ఇటు ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా సాహసోపేతమైన చర్యలు వెలువడటం విశేషం. న్యూఢిల్లీ: ఎస్బీఐ, బీవోబీల్లో ఇతర బ్యాంకుల విలీనాలకు కొనసాగింపుగా మరిన్ని భారీ బ్యాంకులు ఏర్పాటు చేస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏకంగా పది బ్యాంకుల విలీనాన్ని ప్రకటించింది. దీని ప్రకారం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) ఆరు విలీనం కానున్నాయి. దీంతో పీఎస్‌బీల సంఖ్య 12కి తగ్గనుంది. వీటి వ్యాపార పరిమాణం ఏకంగా రూ. 55.81 లక్షల కోట్లుగా ఉండనుంది. 2017లో పీఎస్‌బీల సంఖ్య 27గా ఉండేది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. అలాగే పీఎస్బీల్లో గవర్నెన్స్‌పరమైన పలు సంస్కరణలను కూడా ఆవిష్కరించారు. బోర్డులకు స్వయంప్రతిపత్తి ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘మేనేజ్మెంట్ జవాబుదారీతనాన్ని పెంచే దిశగా.. జీఎం నుంచి ఎండీ దాకా అందరి పనితీరు గురించి జాతీయ బ్యాంకుల బోర్డు కమిటీ మదింపు చేస్తుంది‘ అని ఆమె తెలిపారు. 10 బ్యాంకుల ఖాతాలను పటిష్టంగా మార్చేందుకు రూ. 52,250 కోట్ల మేర నిధులు అందించనున్నట్లు వివరించారు. విలీన ప్రక్రియలో ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్, రాజీవ్ కుమార్ బ్యాంక్‌ల విలీనం నెక్ట్స్‌జెన్ బ్యాంకులతో వృద్ధికి ఊతం .. ‘దేశవ్యాప్తంగా పటిష్టమైన నెట్వర్క్, అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలుండే బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కార్యకలాపాల వృద్ధితో ఆయా బ్యాంకులకు మరిన్ని వనరులు అందుబాటులోకి వస్తాయి. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడానికి అవకాశం ఉంది. నెక్ట్స్‌జనరేషన్ బ్యాంకులను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద పన్ను సర్‌చార్జీల తొలగింపు, బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ పెంచడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. అలాగే, బొగ్గు మైనింగ్ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడి నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఉద్దీపన ప్యాకేజీలాంటిదేమైనా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఇవన్నీ కూడా ఎకానమీని మందగమనం కోరల నుంచి బయటపడేయగలవని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు.. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) లాభదాయకత మెరుగుపడుతోంది. పీఎస్బీల్లో అమలు చేస్తున్న సంస్కరణలు ఫలితాలివ్వడం మొదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 14 బ్యాంకులు లాభాలు నమోదు చేశాయి. ► 2018 డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 8.65 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం స్థూల మొండిబాకీలు 2019 మార్చి ఆఖరు నాటికి రూ. 7.9 లక్షల కోట్లకు తగ్గాయి. ► పాక్షిక రుణ హామీ పథకం అమలుతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), గృహ రుణాల సంస్థల (హెచ్ఎఫ్సీ)కు నిధులపరమైన తోడ్పాటు మెరుగుపడింది. ఇప్పటికే రూ. 3,300 కోట్ల మేర నిధులు అందించగా, మరో రూ. 30,000 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. ► నీరవ్ మోదీ తరహా మోసాలను నివారించేందుకు స్విఫ్ట్ మెసేజింగ్ వ్యవస్థను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌కు (సీబీఎస్)కు అనుసంధానించడం జరిగింది. ► విలీనానంతరం వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆయా బ్యాంకుల బోర్డులు చీఫ్ జనరల్ మేనేజర్లను ఏర్పా టు చేసుకోవచ్చు. చీఫ్ రిస్క్ ఆఫీసర్లను కూడా నియ మించుకోవాల్సి ఉంటుంది. ► సమర్ధులను ఆకర్షించేందుకు మార్కెట్‌కు అనుగుణమైన ప్యాకేజీని ఇవ్వొచ్చు. స్వతంత్ర డైరెక్టర్ల సిటింగ్ ఫీజు నిర్ణయించుకునే వెసులుబాటు బ్యాంకు బోర్డులకు ఉంటుంది. మొత్తం మెగా బ్యాంకులు: 6 ఎస్బీఐ బీవోబీ పీఎన్బీ కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగిలిన చిన్న బ్యాంకులు: 6 బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూకో బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ బందరు బ్యాంకు.. ఇక కనుమరుగు దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించిన మన ఆంధ్రా బ్యాంకు తాజా బ్యాంకుల విలీన ప్రతిపాదనతో ఇక కనుమరుగు కానుంది. మరో నాలుగేళ్లలో వందేళ్లు పూర్తి చేసుకోనుండగా ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. బందరు బ్యాంకు అని కూడా అభిమానంగా పిల్చుకునే ఆంధ్రా బ్యాంకును ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య .. 1923లో మచిలీపట్నంలో ప్రారంభించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌కు ప్రధాన కార్యాలయం మారింది. 1980లలో జరిగిన రెండో విడత బ్యాంకుల జాతీయీకరణతో ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. అయితే, కొన్నాళ్లుగా మొండిబాకీలు పేరుకుపోయి ఆంధ్రాబ్యాంకు అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. మరో బ్యాంకులో విలీనం చేస్తారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో విలీనంతో వాటికి తెరపడింది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్.. ఎస్బీఐలో విలీనం కావడంతో మొత్తానికి తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పనిచేసే రెండు బ్యాంకులు కనుమరుగయినట్లే. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రా బ్యాంకుకు 2,885 దాకా శాఖలు, 3,798 ఏటీఎంల నెట్వర్క్ ఉంది. మొత్తం డిపాజిట్లు రూ. 2,19,853 కోట్లు. రుణాలు రూ. 1,58,848 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 2,54,044 కోట్లు. భారీ బ్యాంకుల సత్తా ఇది.. ‘5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సాధించే దిశగా భారీ బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందన్న విషయం ఈ విలీనాల ప్రతిపాదనలతో తెలుస్తోంది. వేగం గా వృద్ధి చెందుతున్న మనలాంటి దేశం.. రు ణాల అవసరాలను తీర్చేందుకు భారీ బ్యాం కులు మరింత సన్నద్ధంగా ఉంటాయి. పదే పదే ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతం గా నిధులను కూడా సమీకరించుకోగలవు‘ – రజనీష్ కుమార్, చైర్మన్, ఎస్బీఐ వారానికో సంస్కరణ టానిక్.. ‘బ్యాంకుల విలీన ప్రకటన నా వారాంతపు ప్రణాళికలను మార్చేసింది. చేయాల్సిన పని బోలెడంత ఉంది. అయితేనేం.. నేను చాలా ఆశావహంగా ఉన్నాను. విలీన ప్రతిపాదనలు స్వాగతిస్తున్నా. ప్రస్తుతం మనకు ’వారానికో సంస్కరణ’ టానిక్కు కావాల్సిందే‘ – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ ఆలనాటి ఆంధ్రాబ్యాంక్ విలీన బ్యాంకుల సంగతి ఇదీ... కార్పొరేషన్ బ్యాంకు సుమారు 113 ఏళ్ల క్రితం 1906లో కార్పొరేషన్ బ్యాంకు ఏర్పాటైంది. మంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం 2,600 పైచిలుకు సీబీఎస్ బ్రాంచీలు, 3,000 పైగా ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. రూ. 1,84,564 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,21,251 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 2,13,624 కోట్లు. యూనియన్ బ్యాంకు సుమారు 99 ఏళ్ల క్రితం 1919లో ఏర్పాటైంది. ముంబై కేంద్రంగా పనిచేస్తోంది. 4,300 పైగా శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 4,17,505 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 2,98,780 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 4,98,580 కోట్లు. కెనరా బ్యాంకు కెనరా బ్యాంక్ హిందు పర్మనెంట్ ఫండ్‌గా 1906లో ఏర్పాటైన ఈ బ్యాంకు 1910లో కెనరా బ్యాంక్ లిమిటెడ్‌గా మారింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకుకు సుమారు 6,310 శాఖలు, 8,851 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. రూ. 5,99,123 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 4,28,114 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 7,11,783 కోట్లు. సిండికేట్ బ్యాంకు కెనరా ఇండస్ట్రియల్ అండ్ బ్యాంకింగ్ సిండికేట్‌గా 1925లో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత సిండికేట్ బ్యాంక్‌గా మారింది. కర్ణాటకలోని మణిపాల్ కేంద్రంగా పనిచేస్తోంది. సుమారు 4,063 శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,59,883 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 2,05,044 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 3,12,971 కోట్లు. అలహాబాద్ బ్యాంకు సుమారు 154 ఏళ్ల క్రితం 1865లో ఈ బ్యాంకు ఏర్పాటైంది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తోంది. గతేడాది మార్చి నాటి గణాంకాల ప్రకారం సుమారు 3,503 శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,14,330 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,42,212 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 2,49,577 కోట్లు. ఇండియన్ బ్యాంకు దాదాపు 112 ఏళ్ల క్రితం 1907లో ఏర్పాటైంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తోంది. 2,900 దాకా శాఖలు, 2,861 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,42,041 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,81,262 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 2,80,388 కోట్లు. పీఎన్బీ నూట పాతికేళ్ల క్రితం 1894లో పీఎన్బీ ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. గతేడాది అక్టోబర్ దాకా గల గణాంకాల ప్రకారం సుమారు 7,000 పైగా శాఖలు, 10,681 ఏటీఎంల నెట్వర్క్ ఉంది. మొత్తం డిపాజిట్లు రూ. 6,81,874 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 4,62,416 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 7,89,266 కోట్లు. (కన్సాలిడేటెడ్ గణాంకాలు) ఓబీసీ స్వాతంత్య్రం రావడానికి కొన్నాళ్ల ముందుగా 1943లో లాహోర్‌లో ఏర్పాటైంది. ప్రస్తుతం గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దాదాపు 2,700 శాఖలు, 2,621 ఏటీఎంల నెట్వర్క్ ఉంది. మొత్తం డిపాజిట్లు రూ. 2,32,645 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,59,285 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 2,71,910 కోట్లు. యునైటెడ్ బ్యాంక్ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నాలుగు బెంగాలీ బ్యాంకుల విలీనంతో 1950లో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం 1,999 శాఖలు, కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 1,34,983 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 66,955 కోట్లు. మొత్తం అసెట్స్ రూ.1,51,530 కోట్లు. -
రెండేళ్లలో అనుసంధానం పూర్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు విలీనం కాగా, వీటి మధ్య అనుసంధానత రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు బ్యాంకు ఆఫ్ బరోడాలో విలీనమై ఒక్కటిగా మారిన విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అనుసంధానానికే 12 నెలల వరకు సమయం తీసుకోవచ్చని, ఇతర వ్యవస్థల మధ్య అనుసంధానతకు మరో ఏడాది పట్టొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ సమయంలో ఖాతాదారులకు అసౌకర్యాన్ని పరిమితం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విలీనం వల్ల ఏర్పడే అదనపు వ్యయాలను దృష్టిలో ఉంచుకుని, నియంత్రణపరమైన అవసరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5,042 కోట్ల నిధులు సమకూర్చినట్టు ఆ అధికారి తెలిపారు. విలీన ప్రభావం మొదటి త్రైమాసికమైన ఏప్రిల్–జూన్ కాలంలో కార్యకలాపాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు. విలీనానంతర బ్యాంకుకు రూ.8.75 లక్షల కోట్ల డిపాజిట్లు, రూ.6.25 లక్షల కోట్ల రుణ పుస్తకం ఉంటాయి. విలీనం తర్వాత బీవోబీ ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగులు, 12 కోట్ల ఖాతాదారులు బ్యాంకుకు ఉన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్!
సాక్షి, ముంబై: బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. మూడు ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తొమ్మిది బ్యాంకుల కన్సార్షియం ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. డిసెంబరు 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించనున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం తెలిపారు. యూఎప్‌బీయూలోని అన్ని యూనియన్లు సమ్మెలో పాల్గొంటాయని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్ 26న దేశవ్యాప్తంగా సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్లు హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే ఈ మూడు ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయించుకుంది. అలాగే ఆయా బ్యాంకులు బోర్డులు కూడా విలీనానికి అంగీకారం తెలిపాయి. కాగా మూడు (బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్) ప్రభుత్వ బ్యాంకుల విలీనమైతే దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంక్ ఆవిర్భవించనుంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరుసగా ఒకటి, రెండో స్థానాల్లో ఉన్నసంగతి తెలిసిందే. -
30 తరవాత... ఆ చెక్కులు చెల్లవు!
-
30 తరవాత... ఆ చెక్కులు చెల్లవు!
► అనుబంధ బ్యాంకుల చెక్కులపై ఎస్బీఐ స్పష్టీకరణ ► ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా మార్చుకోవాలని వెల్లడి ► చెక్కులే హామీగా... రుణాలిచ్చిన వారిలో ఆందోళన సాక్షి, అమరావతి: స్నేహితుడు శ్రీధర్ రికమెండ్ చేయటంతో వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో రమేశ్‌కు రూ.2 లక్షలు అప్పిచ్చాడు వెంకట్. దానికి హామీగా రమేశ్ పోస్ట్‌డేటెడ్ చెక్కులిచ్చాడు. ప్రతినెలా వడ్డీ కోసం ఆ చెక్కులు బ్యాంకులో వేసుకోవచ్చు. రెండేళ్ల తరవాత అసలు మొత్తాన్ని చెల్లిస్తానంటూ దానిక్కూడా పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చాడు రమేశ్. కాకపోతే రమేశ్‌ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఖాతా. ఆ బ్యాంకు ఇప్పుడు ఎస్బీఐలో విలీనమైపోయింది. రమేశ్ ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిపోయాయి. మరి పాత చెక్కులు చెల్లవు కదా!!. వెంకట్ ఏం చేయాలి? ఇదిప్పుడు వెంకట్ ఒక్కడి సమస్య మాత్రమే కాదు. రుణాలిచ్చి, ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల తాలూకు పోస్ట్‌డేటెడ్ చెక్కులు తీసుకున్న అందరిదీ!!. ఎస్బీఐ కూడా... ఇప్పటిదాకా ఈ చెక్కుల్ని తీసుకున్నా... ఈ నెల 30 తరవాత మాత్రం అనుమతించబోమని కరాఖండిగా చెప్పేసింది. అదీ విషయం. భారతీయ మహిళా బ్యాంకుతో సహా ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తదితర అనుబంధ బ్యాంకులు జారీచేసిన చెక్కులేవీ సెప్టెంబర్ 30 తర్వాత చెల్లబోవని, పాత చెక్కుల స్థానంలో కొత్తవాటిని తీసుకోవాల్సిందేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు స్పష్టంచేసింది. ఎస్బీఐలో విలీనమైన 6 బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్కులు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు సెప్టెంబర్ 30 వరకే పనిచేస్తాయని, ఆ తర్వాత కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్, కొత్త చెక్‌బుక్స్‌ను మాత్రమే అనుమతిస్తామని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఈ ఏడాది మే 27న ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ విలీనమైన సంగతి తెలిసిందే. ఈ విలీనం రోజు నుంచే ఈ బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్ మారినప్పటికీ ఇప్పటి వరకు పాత నంబర్లను కూడా అనుమతించేవారు. ఇప్పుడేమో తాజా ప్రకటన చేశారు. అప్పులిచ్చిన వారిలో ఆందోళన... అప్పులు ఇచ్చిన వారు హామీ కోసం పోస్ట్‌డేటెడ్ చెక్‌లు తీసుకోవటమనేది సర్వ సాధారణం. సెప్టెంబర్ 30 నుంచి విలీన బ్యాంకుల చెక్కులు పనిచేయవని ఎస్బీఐ ప్రకటించడంతో ఆ బ్యాంకు చెక్కులు తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇచ్చిన అప్పులను వసూలు చేసుకోవడం చాలా కష్టమవుతోందని, ఇలాంటి తరుణంలో పాత చెక్కులు కూడా రద్దు అవుతుండటంతో తమ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని కొందరు ఆందోళన వ్యక్తంచేశారు. నాలుగు నెలలుగా తన ఖాతాదారుడొకరు తీసుకున్న అప్పు చెల్లించడం లేదని, ఇప్పుడు కొత్త చెక్ అడిగితే ఫోన్ నంబరే మార్చేశాడని, దీంతో ఇప్పుడు రావాల్సిన బకాయిని రాసి పాత చెక్కును బ్యాంకులో వేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని స్థానిక వడ్డీ వ్యాపారి ఒకరు వాపోయారు. ఈయనే కాదు. చాలామంది వడ్డీ వ్యాపారులదిప్పుడు అదే పరిస్థితి. -
మిగిలేవి నాలుగైదు ప్రభుత్వ బ్యాంకులే..!
♦ భారీ విలీనానికి కేంద్రం కసరత్తు ♦ ఎస్బీఐతో అనుబంధ బ్యాంకుల విలీనం ♦ అనంతరం కీలక ప్రక్రియ ప్రారంభం ♦ ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల తగ్గింపుపైనా దృష్టి న్యూఢిల్లీ: భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27. అయితే ఈ సంఖ్య నాలుగైదుకు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకుల్లో భారీ విలీన ప్రక్రియపై కేంద్రం దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంక్ విలీనానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. అనంతరం మిగిలిన బ్యాంకుల్లో విలీన ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది. ఈ దిశలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఐడీబీఐ బ్యాంక్ నుంచి ప్రస్తుత 80 శాతం నుంచి 60 శాతానికి వాటాల తగ్గింపుపైనా కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఎస్బీఐతో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తవుతుందని కేంద్రం విశ్వసిస్తోంది. గత వారం ఇందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ముందు ట్రేడ్ యూనియన్లతో చర్చలు కాగా ఏకపక్షంగా కాకుండా.. ట్రేడ్ యూనియన్ల అభిప్రాయాలను, సూచనలను కూడా విలీన ప్రక్రియకు ముందు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో ప్రభుత్వ రంగ భారీ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి.