మిగిలేవి నాలుగైదు ప్రభుత్వ బ్యాంకులే..!
♦ భారీ విలీనానికి కేంద్రం కసరత్తు
♦ ఎస్‌బీఐతో అనుబంధ బ్యాంకుల విలీనం
♦ అనంతరం కీలక ప్రక్రియ ప్రారంభం
♦ ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల తగ్గింపుపైనా దృష్టి
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27. అయితే ఈ సంఖ్య నాలుగైదుకు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకుల్లో భారీ విలీన ప్రక్రియపై కేంద్రం దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంక్ విలీనానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. అనంతరం మిగిలిన బ్యాంకుల్లో విలీన ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది. ఈ దిశలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఐడీబీఐ బ్యాంక్ నుంచి ప్రస్తుత 80 శాతం నుంచి 60 శాతానికి వాటాల తగ్గింపుపైనా కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఎస్‌బీఐతో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తవుతుందని కేంద్రం విశ్వసిస్తోంది. గత వారం ఇందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
ముందు ట్రేడ్ యూనియన్లతో చర్చలు
కాగా ఏకపక్షంగా కాకుండా.. ట్రేడ్ యూనియన్ల అభిప్రాయాలను, సూచనలను కూడా విలీన ప్రక్రియకు ముందు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో ప్రభుత్వ రంగ భారీ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి.