సాక్షి, హైదరాబాద్: బీమా.. వ్యక్తిగతమైనా, సామూహికమైనా ప్రస్తుత జీవన విధానంలో అత్యవసరమైన పొదుపు సాధనం. కుటుంబ యజమాని లేక ఇతర సభ్యులు ప్రమాదవశాత్తు చనిపోయినా, గాయపడినా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. లేదంటే సాధారణం నుంచి అసాధారణ వ్యాధుల వరకు చికిత్స పొందేందుకు బీమా పద్ధతి విస్తృత ప్రయోజనాలను కల్పిస్తుంది.
ఈ బీమా అనేది దేశంలో ఎప్పటినుంచో ఉన్నా ఆరోగ్య బీమా మాత్రం గత ఐదేళ్లలో చాలా విస్తృతమైందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను వెల్లడించిన తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం 2014–15లో దేశవ్యాప్తంగా ఆరోగ్యబీమా కింద చెల్లించిన ప్రీమియం మొత్తం రూ.20,096 కోట్లు కాగా, 2018–19లో అది రూ.44,873 కోట్లు.. అంటే దాదాపు 120 శాతం పెరిగిందన్న మాట. ఇందులో కూడా గత మూడేళ్లలోనే రూ.20 వేల కోట్ల మేర ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు పెరగటం గమనార్హం.
దేశంలో 47 కోట్ల మందికి బీమా
ఐఆర్‌డీఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోని 130 కోట్ల మందికి పైగా జనాభాలో 2018–19లో 47 కోట్ల మంది ఆరోగ్య బీమా చేయించుకున్నారు. మొత్తం 2.07 కోట్ల పాలసీల ద్వారా వీరు బీమా పరిధిలోకి వచ్చారు. ఇందులో మూడో వంతు మంది ప్రభుత్వ సంస్థల ద్వారా బీమా పరిధిలోనికి రాగా, ఒకటో వంతు మంది సామూహిక, వ్యక్తిగత బీమాలు చేయించుకున్నారు.
ఈ బీమా పాలసీల ద్వారా ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో 2018–19 లో రూ.5,672 కోట్లు ప్రీమియం కట్టగా, సామూహిక బీమా కింద రూ.21,676 కోట్లు, వ్యక్తిగతంగా రూ.17,525 కోట్ల ప్రీమియం కట్టారు. మొత్తం ఆరోగ్య బీమా ప్రీమి యందారుల్లో 31 శాతం మంది మహారాష్ట్రలోనే ఉండగా, తమిళనాడు 11%, కర్ణాటక 10%, ఢిల్లీ 8%, గుజరాత్ 6 శాతం మంది ఉన్నారు. ఈ 5 రాష్ట్రాలు పోను మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 31% బీమా ప్రీమియం చెల్లించాయి.
ఆరోగ్య బీమా.. అసలైన ధీమా!
Published Mon, Mar 23 2020 1:56 AM | Last Updated on Mon, Mar 23 2020 1:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment