క్యాష్‌లెస్‌ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్‌డీఏఐ ఆదేశాలు | IRDAI made some major changes in the regulatory norms for health insurance policies | Sakshi
Sakshi News home page

క్యాష్‌లెస్‌ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్‌డీఏఐ ఆదేశాలు

Published Thu, May 30 2024 12:56 PM | Last Updated on Thu, May 30 2024 3:13 PM

IRDAI made some major changes in the regulatory norms for health insurance policies

ఆరోగ్య బీమా పాలసీదారు క్లెయిమ్‌ చేసిన గంటలోపే నగదు రహిత చికిత్సపై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి తుది బిల్లు వచ్చాక మూడు గంటల్లోపు అనుమతి ఇవ్వాలని తెలియజేసింది. బుధవారం ఈమేరకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) మాస్టర్‌ సర్క్యులర్‌ విడుదల చేసింది. ఆరోగ్య బీమా ఉత్పత్తులపై ఉన్న 55కు పైగా ఆదేశాలను క్రోడీకరించి దీన్ని రూపొందించినట్లు పేర్కొంది.

సర్క్యూలర్‌లోని వివరాల ప్రకారం..క్లెయిమ్‌ పరిష్కారాల కోసం పాలసీదారులు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. బీమా సంస్థలు, థర్డ్‌పార్టీ ఏజెన్సీలు తమకు అవసరమైన పత్రాలను పాలసీదారుల నుంచి కాకుండా నేరుగా ఆసుపత్రుల నుంచే సేకరించాలి. వయసు, ప్రాంతం, ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా బీమా పాలసీని అందించాలి. అవసరాన్ని బట్టి కొత్త పాలసీలను తీసుకొచ్చే అవకాశం బీమా సంస్థలకు ఉంది.

ఐఆర్‌డీఏఐ చేసిన కొన్ని మార్పులు..

  • డిశ్చార్జీకి మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం జరిగి ఆసుపత్రి ఏదైనా అదనపు ఛార్జీలు విధిస్తే ఆ మొత్తాన్ని కూడా బీమా సంస్థ భరిస్తుంది.

  • చికిత్స సమయంలో పాలసీదారుడు మరణిస్తే వెంటనే క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి. తక్షణమే ఆసుపత్రి నుంచి మృత దేహాన్ని తమ బంధువులకు అప్పగించాలి.

  • పాలసీదారుల​కు సహాయం చేయడానికి బీమా కంపెనీలు ఆసుపత్రిలో ఫిజికల్ మోడ్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయవచ్చు.

  • ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్న పాలసీదారులు తమకు ఆమోదయోగ్యమైన క్లెయిమ్ పొందగలిగే పాలసీని ఎంచుకోవచ్చు.

  • పాలసీ తీసుకునేందుకూ, పాలసీ పునరుద్ధరణ, సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితరాల కోసం అవసరమైన సాంకేతిక సేవలను అందించాలి.

  • బీమా కంపెనీలు పాలసీ డాక్యుమెంట్‌తో పాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్‌)ని కూడా అందించాలి. బీమా పాలసీ రకం, బీమా మొత్తం, కవరేజీ వివరాలు, మినహాయింపులు.. వంటివి సులభ పదాల్లో తెలియజేయాలి.

  • పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే వారికి నో క్లెయిమ్ బోనస్‌ లేదా ప్రీమియం తగ్గించే అవకాశాన్ని కల్పించవచ్చు.

ఇదీ చదవండి: పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్‌లు

ఇటీవల లోకల్ సర్కిల్‌ చేసిన సర్వేలో 43 శాతం బీమా పాలసీదారులు గత మూడేళ్లలో తమ బీమా క్లెయిమ్‌లను ప్రాసెస్‌ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. చాలామంది పాలసీదారులు ఆసుపత్రిలో చేరిన చివరి రోజు వరకు తమ క్లెయిమ్‌ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సర్వే తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement