న్యూఢిల్లీ: కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల మోటారు బీమా ప్రతిపాదనను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) తీసుకొచ్చింది. థర్డ్ పార్టీ (ఇతరులకు వాటిల్లే నష్టానికి), ఓన్ డ్యామేజ్ (సొంత వాహనం నష్టానికి)కు సంబంధించి దీర్ఘకాల మోటార్ బీమా ఉత్పత్తుల ప్రతిపాదనతో ముసాయిదాను విడుదల చేసింది.
దీని ప్రకారం అన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మూడేళ్లు, ఐదేళ్ల కాల వ్యవధితో కార్లకు, ద్విచక్ర వాహనాలకు బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయవచ్చు. ప్రీమియం మొత్తం వాహనం విక్రయం సమయంలోనే వసూలు చేస్తారు. ప్రస్తుతం ఏడాది కాల ఓన్ డ్యామేజ్ ప్లాన్లపై అందిస్తున్న నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సీబీ) ప్రయోజనాన్ని దీర్ఘకాల ఉత్పత్తులకూ అందించొచ్చని ఐఆర్‌డీఏఐ పేర్కొంది.
రెన్యువల్ సమయంలో ఈ ఎన్‌సీబీ అమల్లోకి వస్తుంది. ఇక అగ్ని ప్రమాదాలకు సంబంధించి కూడా దీర్ఘకాలిక బీమా ఉత్పత్తులపై ఒక ముసాయిదాను విడుదల చేసింది. ఇళ్లకు 30 ఏళ్ల బీమా కవరేజీ అందించడం ఇందులో ఒక ప్రతిపాదనగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment