కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఖర్చులను చెల్లించే హెల్త్ పాలసీలను ‘కరోనా కవచ్’ పేరుతో బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక స్వల్పకాలిక పాలసీలను (గరిష్టంగా 11 నెలల కాలంతో) జూలై 10 నాటికి తీసుకురావాలంటూ బీమా నియంత్రణ సంస్థ.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ )గడువు పెట్టడంతో.. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ జనరల్, మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్ తదితర బీమా సంస్థలు ఇటువంటి పాలసీలను ప్రవేశపెట్టాయి.
మ్యాక్స్‌బూపా
మ్యాక్స్ బూపా సంస్థ తక్కువ ప్రీమియానికే కరోనా కవచ్ పాలసీని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. రూ.2.5 లక్షల కవరేజీ కోసం 31–55 ఏళ్ల వయసు వారు రూ.2,200 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని.. అదే ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కోసం రూ.2.5 లక్షల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం రూ.4,700గా ఉంటుందని తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో
కరోనా కారణంగా వ్యక్తులు ఆస్పత్రిలో చేరి చికిత్సలు తీసుకుంటే పరిహారం చెల్లించే సదుపాయంతో హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో సంస్థ కరోనా కవచ్ పాలసీని విడుదల చేసింది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేసిన పరీక్షతో పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటే అందుకయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. అంతేకాదు కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఇచ్చే కోమార్బిడిటీ చికిత్సలకు కూడా ఈ పరిహారం అందుతుంది. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలను కోమార్బిడిటీగా చెబుతారు. అంబులెన్స్ చార్జీలను కూడా చెల్లిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఉండి చికిత్సలు తీసుకున్నా కానీ, 14 రోజుల కాలానికి అయ్యే ఖర్చులను భరిస్తుండడం ఈ పాలసీలోని అనుకూలాంశం. అల్లోపతితోపాటు ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యాలకు కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు.
బజాజ్ అలియాంజ్
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇదే విధమైన పాలసీని ప్రవేశపెట్టింది. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల కవరేజీకి ప్రీమియం రూ.447–5,630 మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీనికి జీఎస్టీ చార్జీలు అదనం. హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ ఎంచుకుంటే ప్రీమియం రూ.3,620 మధ్య ఉంటుంది. 0–35 ఏళ్ల మధ్యనున్న వారు మూడున్నర నెలలకు రూ.50వేల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం కింద రూ.447తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.
కరోనా కవచ్... బీమా కంపెనీల కొత్త పాలసీలు
Published Sat, Jul 11 2020 4:40 AM | Last Updated on Sat, Jul 11 2020 4:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment