HDFC ergo
-
పేటీఎంపై రూ.30కే రూ.10వేల కవరేజీ
ముంబై: పేటీఎం పేరిట చెల్లింపులు, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ సహా సమగ్ర ఆర్థిక సేవల్లోని వన్97 కమ్యూనికేషన్స్.. హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ‘పేటీఎం పేమెంట్ ప్రొటెక్ట్’ ఉత్పత్తిని విడుదల చేసింది. ఇది గ్రూపు ఇన్సూరెన్స్ ప్లాన్. యూపీఐ ద్వారా యాప్‌లు, వ్యాలెట్ల నుంచి నిర్వహించే అన్ని రకాల లావాదేవీలకు ఇది రక్షణ కల్పిస్తుందని పేటీఎం తెలిపింది. ఏడాదికి కేవలం రూ.30 చెల్లించడం ద్వారా.. రూ.10,000 వరకు కవరేజీ పొందొచ్చని పేర్కొంది. యూపీఐ లావాదేవీల్లో మోసాల వల్ల నష్టపోయిన వారికి ఈ ప్లాన్ కింద గరిష్టంగా రూ.10వేల పరిహారం లభించనుంది. త్వరలోనే ఇదే ప్లాన్ కింద రూ.లక్ష వరకు రక్షణ కవరేజీని ఆఫర్ చేయనున్నట్టు పేటీఎం తెలిపింది. పరిశ్రమలో ఈ తరహా ఉత్పత్తి ఇదే మొదటిది అని, డిజిటల్ చెల్లింపుల పట్ల నమ్మకాన్ని పెంచడంతోపాటు, డిజిటల్ చెల్లింపులను మరింత మందికి చేరువ చేయడం ఈ ఉత్పత్తి లక్ష్యమని పేర్కొంది. -
కరోనా కవచ్... బీమా కంపెనీల కొత్త పాలసీలు
కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఖర్చులను చెల్లించే హెల్త్ పాలసీలను ‘కరోనా కవచ్’ పేరుతో బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక స్వల్పకాలిక పాలసీలను (గరిష్టంగా 11 నెలల కాలంతో) జూలై 10 నాటికి తీసుకురావాలంటూ బీమా నియంత్రణ సంస్థ.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ )గడువు పెట్టడంతో.. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ జనరల్, మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్ తదితర బీమా సంస్థలు ఇటువంటి పాలసీలను ప్రవేశపెట్టాయి. మ్యాక్స్‌బూపా మ్యాక్స్ బూపా సంస్థ తక్కువ ప్రీమియానికే కరోనా కవచ్ పాలసీని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. రూ.2.5 లక్షల కవరేజీ కోసం 31–55 ఏళ్ల వయసు వారు రూ.2,200 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని.. అదే ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కోసం రూ.2.5 లక్షల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం రూ.4,700గా ఉంటుందని తెలిపింది. హెచ్డీఎఫ్సీ ఎర్గో కరోనా కారణంగా వ్యక్తులు ఆస్పత్రిలో చేరి చికిత్సలు తీసుకుంటే పరిహారం చెల్లించే సదుపాయంతో హెచ్డీఎఫ్సీ ఎర్గో సంస్థ కరోనా కవచ్ పాలసీని విడుదల చేసింది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేసిన పరీక్షతో పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటే అందుకయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. అంతేకాదు కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఇచ్చే కోమార్బిడిటీ చికిత్సలకు కూడా ఈ పరిహారం అందుతుంది. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలను కోమార్బిడిటీగా చెబుతారు. అంబులెన్స్ చార్జీలను కూడా చెల్లిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఉండి చికిత్సలు తీసుకున్నా కానీ, 14 రోజుల కాలానికి అయ్యే ఖర్చులను భరిస్తుండడం ఈ పాలసీలోని అనుకూలాంశం. అల్లోపతితోపాటు ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యాలకు కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇదే విధమైన పాలసీని ప్రవేశపెట్టింది. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల కవరేజీకి ప్రీమియం రూ.447–5,630 మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీనికి జీఎస్టీ చార్జీలు అదనం. హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ ఎంచుకుంటే ప్రీమియం రూ.3,620 మధ్య ఉంటుంది. 0–35 ఏళ్ల మధ్యనున్న వారు మూడున్నర నెలలకు రూ.50వేల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం కింద రూ.447తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. -
మహిళలకు ‘మై హెల్త్ ఉమెన్ సురక్షా’ ప్లాన్
మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర వైద్య బీమా పథకం ‘మై హెల్త్ ఉమెన్ సురక్షా’ను ప్రముఖ బీమా సంస్థ హెచ్డీఎఫ్సీ ఎర్గో ఆవిష్కరించింది. మహిళల జీవితంలో వైద్య పరంగా అత్యవసర పరిస్థితులు, అనారోగ్య సమస్యల సమయంలో ఆర్థిక సాయంతో అదుకునేలా ఈ పాలసీని కంపెనీ రూపొందించింది. పాలసీ రెన్యువల్ సమయంలో మహిళల ఫిట్నెస్ (శారీరక, మానసిక ధృడత్వం) ఆధారంగా తగ్గింపు ఇస్తుంది.వ్యాధి నిరోధక ముందస్తు వైద్య పరీక్షలు, హెల్త్ కోచింగ్, పోషకాహారం, సరైన స్థాయిలో బరువు ఉండేలా చూడడం తదితర అంశాల్లో వివరాలు అందిస్తుంది. ఫార్మసీ కొనుగోళ్లపైనా తగ్గింపులు ఇస్తుంది. గర్భధారణ సమ యంలో కౌన్సెలింగ్, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం.. ఇలా ఎన్నో అంశాల్లో హెచ్డీ ఎఫ్‌సీ ఎర్గో ‘మై హెల్త్ ఉమెన్ సురక్షా’ పాలసీ దారులకు చేదోడుగా ఉంటుంది. 18–65 సంవత్సరాల వయసు లోని వారు పాలసీకి అర్హులు. ‘‘మహిళలు భిన్న వయసుల్లో ఎన్నో రిస్క్‌లను ఎదుర్కొం టున్నారు. వీటిల్లో కేన్సర్, గుండె జబ్బులు, గర్భధారణ సమయంలో ప్రాణ ప్రమాదం ఇలా ఎన్నో అవసరాల్లో మద్దతుగా నిలిచేలా మై హెల్త్ ఉమెన్ సురక్షా ప్లాన్ ను రూపొం దించాం’’ అని హెచ్డీఎఫ్సీ ఎర్గో ఎండీ, సీఈవో రితేష్ కుమార్ తెలిపారు. -
ఎల్ అండ్ టీ సాధారణ బీమా...హెచ్డీఎఫ్సీ ఎర్గో చేతికి
♦ సాధారణ బీమా పరిశ్రమలో తొలి టేకోవర్ ♦ డీల్ విలువ రూ. 551 కోట్లు న్యూఢిల్లీ: హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ)కు చెందిన సాధారణ బీమా సంస్థ విభాగం హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనున్నది. ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌ను రూ.551 కోట్లకు, అంతా నగదులోనే కొనుగోలు చేయనున్నామని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. బీమా వ్యాపారంలో వృద్ధి, స్థాయిలను బట్టి చూస్తే స్థిరీకరణ తప్పనిసరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ లావాదేవీతో భారత బీమా రంగంలో స్థిరీకరణ దశ మొదలైనట్లేనని వెల్లడించారు. ఈ టేకోవర్ వల్ల రెండు సంస్థల పరిమాణం, నైపుణ్యం కలగలసి హెచ్డీఎఫ్సీ పనితీరు మెరుగుపడుతుందని, పాలసీదారులకు, ఇతర వాటాదారులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మూడో పెద్ద కంపెనీగా హెచ్డీఎఫ్సీ ఎర్గో 108 కార్యాలయాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్డీఎఫ్సీ ఎర్గో రూ.3,467 కోట్ల స్థూల ప్రీమియమ్‌ను, రూ.151 కోట్ల నికర లాభాన్ని సాధించింది. హెచ్డీఎఫ్సీ, జర్మనీకి చెందిన ఎర్గో ఇంటర్నేషనల్ కంపెనీలు కలసి హెచ్డీఎఫ్సీ ఎర్గో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. సాధారణ బీమా రంగంలో ఈ కంపెనీది నాలుగో స్థానం. ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్ టేకోవర్‌తో మూడో స్థానానికి ఎగబాకుతుంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌లో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులను విలీనాంతరం కూడా కొనసాగిస్తామని హెచ్డీఎఫ్సీ ఎర్గో ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రితేశ్ కుమార్ చెప్పారు. ఈ విలీనం కారణంగా తమ ఆదాయం 15 శాతం వృద్ధి చెందుతుందని, ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన రూ.600 కోట్ల ఆస్తులు హెచ్డీఎఫ్సీ ఎర్గో బ్యాలెన్స్ షీట్‌కు జతవుతాయని పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ ఎర్గో సంస్థ వాహన, ఆరోగ్య, వ్యక్తిగత యాక్సిడెంట్, గృహ, పంట, తదితర బీమా సర్వీసులను అందిస్తోంది. స్థిరీకరణలో భారత బీమా రంగం.. సాధారణ బీమా రంగంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థలు-న్యూ ఇండియా అష్యూరెన్స్, యునెటైడ్ ఇండియా, నేషనల్ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగం విషయానికొస్తే, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇఫ్కో టోకోయోలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు నేపథ్యంలో భారత భీమా రంగంలో ఇప్పుడు స్థిరీకరణ మొదలైందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎర్గోకు వాటా అమ్మిన హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ ఎర్గోలో తాజాగా 22.9% వాటాను విదేశీ భాగస్వామికి హెచ్డీఎఫ్సీ విక్రయించింది. ఈ మేరకు ఒక్కో షేర్‌ను రూ.90.973 చొప్పున 12.33 కోట్ల షేర్ల బదిలీ ప్రక్రియను పూర్తి చేశామని హెచ్డీఎఫ్సీ మరో ప్రత్యేక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.1,122 కోట్లని పేర్కొంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో లిస్టెడ్ కంపెనీ కాదు. ఈ షేర్ల విక్రయంపై రూ.197 కోట్ల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ షేర్ల విక్రయం తర్వాత హెచ్డీఎఫ్సీ ఎర్గో జాయింట్ వెంచర్లో హెచ్డీఎఫ్సీ వాటా 50.73 శాతంగానూ, ఎర్గో వాటా 48.74 శాతంగానూ ఉన్నాయి. బీమా వెంచర్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ గత ఏడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తాము ఏర్పాటు చేసిన పలు జాయింట్ వెంచర్లలో వాటాను విదేశీ బీమా సంస్థలు పెంచుకుంటున్నాయి.