ఎల్ అండ్ టీ సాధారణ బీమా...హెచ్డీఎఫ్సీ ఎర్గో చేతికి
♦ సాధారణ బీమా పరిశ్రమలో తొలి టేకోవర్
♦ డీల్ విలువ రూ. 551 కోట్లు
న్యూఢిల్లీ: హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ)కు చెందిన సాధారణ బీమా సంస్థ విభాగం హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనున్నది. ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌ను రూ.551 కోట్లకు, అంతా నగదులోనే కొనుగోలు చేయనున్నామని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. బీమా వ్యాపారంలో వృద్ధి, స్థాయిలను బట్టి చూస్తే స్థిరీకరణ తప్పనిసరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ లావాదేవీతో భారత బీమా రంగంలో స్థిరీకరణ దశ మొదలైనట్లేనని వెల్లడించారు. ఈ టేకోవర్ వల్ల రెండు సంస్థల పరిమాణం, నైపుణ్యం కలగలసి హెచ్‌డీఎఫ్‌సీ పనితీరు మెరుగుపడుతుందని, పాలసీదారులకు, ఇతర వాటాదారులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.
మూడో పెద్ద కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో
108 కార్యాలయాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో రూ.3,467 కోట్ల స్థూల ప్రీమియమ్‌ను, రూ.151 కోట్ల నికర లాభాన్ని సాధించింది. హెచ్‌డీఎఫ్‌సీ, జర్మనీకి చెందిన ఎర్గో ఇంటర్నేషనల్ కంపెనీలు కలసి హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. సాధారణ బీమా రంగంలో ఈ కంపెనీది నాలుగో స్థానం. ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్ టేకోవర్‌తో మూడో స్థానానికి ఎగబాకుతుంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌లో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులను విలీనాంతరం కూడా కొనసాగిస్తామని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రితేశ్ కుమార్ చెప్పారు. ఈ విలీనం కారణంగా తమ ఆదాయం 15 శాతం వృద్ధి చెందుతుందని, ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన రూ.600 కోట్ల ఆస్తులు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో బ్యాలెన్స్ షీట్‌కు జతవుతాయని పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో సంస్థ వాహన, ఆరోగ్య, వ్యక్తిగత యాక్సిడెంట్, గృహ, పంట, తదితర బీమా సర్వీసులను అందిస్తోంది.
స్థిరీకరణలో భారత బీమా రంగం..
సాధారణ బీమా రంగంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థలు-న్యూ ఇండియా అష్యూరెన్స్, యునెటైడ్ ఇండియా, నేషనల్ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగం విషయానికొస్తే, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇఫ్‌కో టోకోయోలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు నేపథ్యంలో భారత భీమా రంగంలో ఇప్పుడు స్థిరీకరణ మొదలైందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎర్గోకు వాటా అమ్మిన హెచ్‌డీఎఫ్‌సీ
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోలో తాజాగా 22.9% వాటాను విదేశీ భాగస్వామికి హెచ్‌డీఎఫ్‌సీ విక్రయించింది. ఈ మేరకు ఒక్కో షేర్‌ను రూ.90.973 చొప్పున 12.33 కోట్ల షేర్ల బదిలీ ప్రక్రియను పూర్తి చేశామని హెచ్‌డీఎఫ్‌సీ మరో ప్రత్యేక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.1,122 కోట్లని పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో లిస్టెడ్ కంపెనీ కాదు. ఈ షేర్ల విక్రయంపై రూ.197 కోట్ల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ షేర్ల విక్రయం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జాయింట్ వెంచర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ వాటా 50.73 శాతంగానూ, ఎర్గో వాటా 48.74 శాతంగానూ ఉన్నాయి. బీమా వెంచర్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ గత ఏడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తాము ఏర్పాటు చేసిన పలు జాయింట్ వెంచర్లలో వాటాను విదేశీ బీమా సంస్థలు పెంచుకుంటున్నాయి.