ముంబై: హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ప్రవేశించేందుకు జీవిత బీమా కంపెనీలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలను హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి తిరిగి అనుమతించే అంశాన్ని బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) సానుకూలంగా పరిశీలిస్తుండడం వాటిల్లో ఉత్సాహానికి కారణం. ఎల్‌ఐసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు 2016లో ఐఆర్‌డీఏఐ నిషేధం విధించే వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించినవే.
ఐఆర్‌డీఏఐ ఆదేశాలతో నాటి నుంచి ఇవి కేవలం ఫిక్స్‌డ్ బెనిఫిట్ హెల్త్ ప్లాన్లకు పరిమితం అయ్యాయి. ఇండెమ్నిటీ (హాస్పిటల్‌లో చేరినప్పుడు చెల్లించేవి) పాలసీలను విక్రయించేందుకు అనుమతి లేదు. జీవిత బీమా కంపెనీలను తిరిగి హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి అనుమతించడానికి ఇది సరైన తరుణమని, లాభ, నష్టాలను పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవలే ఐఆర్‌డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా సంకేతం ఇవ్వడం లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో తిరిగి ఆశావహ పరిస్థితికి దారితీసిందని చెప్పుకోవాలి. 2030 నాటి కి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను చేరువ చేయాలన్న లక్ష్యంతో మరిన్ని సంస్థలను ఈ విభాగంలోకి అనుమతించాలన్నది ఐఆర్‌డీఏఐ యోచనగా ఉంది.
సిద్ధంగా ఉన్నాం..
హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్టు ఎల్‌ఐసీ పేర్కొంది. లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారానికి హెల్త్ ఇన్సూరెన్స్ సమన్వయంగా ఉంటుందని తెలిపింది. ‘‘మేము ఇప్పటికే దీర్ఘకాల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను, గ్యారంటీడ్ హెల్త్ ప్లాన్లను విక్రయిస్తున్నాం. ఐఆర్‌డీఏఐ చేసిన సూచనను పరిశీస్తున్నాం’’అని ఎల్‌ఐసీ చైర్మన్ ఎంటీ కుమార్ తెలిపారు. అచ్చమైన హెల్త్ ప్లాన్ల విక్రయం తమకు కష్టమేమీ కాదని, ఇప్పటికే తాము కొన్ని రకాల హెల్త్ ప్లాన్లను (ఫిక్స్‌డ్ బెనిఫిట్) ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు 24.50 లక్షల మంది ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లు 3.60 లక్షలకు మించి లేరు.
లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలను సైతం హెల్త్ ఇన్సూరెన్స్‌కు అనుమతిస్తే అప్పుడు భారీగా ఏజెంట్లు ఆయా ఉత్పత్తులను కస్టమర్లకు చేరువ చేయగలరన్న అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలను ఒకే సంస్థ మార్కెట్ చేసుకునే విధానం ఉందని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇప్పటికీ 2.63 లక్షల మంది కస్టమర్లకు ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్‌కవరేజీని అందిస్తోంది. 2016లో నిషేధం తర్వాత మిగిలిన కస్టమర్లు పోర్ట్ పెట్టుకుని వెళ్లిపోగా, వీరు ఇంకా మిగిలే ఉన్నారు. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వద్ద కూడా ఇలాంటి కస్టమర్లు కొందరు మిగిలే ఉన్నారు. అందుకనే ఈ సంస్థలు మళ్లీ హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సైతం తాము హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ప్రకటించింది. తమకు ఈ విభాగంలో ఎంతో అనుభవం ఉన్నట్టు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment