![Declining share of women in life insurance policies - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/21/LIC-WOMEN.jpg.webp?itok=GoLXljSH)
సాక్షి, అమరావతి: ఆకాశంలో సగం, అవకాశాల్లో సమం అంటున్నా బతుకు భద్రతకు సంబంధించిన బీమా పాలసీలు చేయించడంలో మహిళల శాతం నానాటికీ తగ్గుముఖం పట్టినట్టు ఐఆర్‌డీఏఐ ఇటీవలి వార్షిక నివేదికను బట్టి తేలింది. గత రెండేళ్లలోనే మహిళా పాలసీదారుల శాతం గణనీయంగా తగ్గింది. 2018–19లో 36 శాతంగా ఉన్న మహిళల ఇన్సూరెన్స్ పాలసీలు 2019–20 నాటికి 32 శాతానికి తగ్గడం గమనార్హం. పాలసీలు తీసుకుంటున్నప్పటికీ వాటి కొనసాగింపు పెద్ద సమస్యగా తయారైంది. తొలి ఏడాది ప్రీమియం చెల్లిస్తున్నా ఆ తర్వాత చెల్లింపుల్లో తరుగుదల కనిపిస్తున్నట్టు 2019–20 నివేదికలో ఐఆర్‌డీఏఐ పేర్కొంది. 2019–20లో మొత్తం 2.88 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించారు.
వాటి మొత్తం విలువ రూ.1.02 లక్షల కోట్లు. మొత్తం పాలసీల్లో మహిళల వాటా కేవలం 93 లక్షలుగా ఉంది. ఈ పాలసీల మొత్తం విలువ రూ.34,737 కోట్లు. మహిళా పాలసీలు తగ్గడానికి కారణాలు ఏమిటన్న దానిపై బీమా రంగ నిపుణులు దృష్టి సారించారు. పాలసీలు తీసుకునే వారిలో ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేవారే. అయితే ఇటీవలి కాలంలో మహిళా ఉద్యోగులు జీవిత బీమా కన్నా ఆరోగ్య బీమా, ఇతర పథకాలలో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారన్నది నిపుణుల అంచనా. ఫలితంగా ఈ సంఖ్య తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మహిళా శ్రామికులు, ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. 2019కి ముందు 30 శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి ఇప్పుడు 21 శాతానికి తగ్గింది.
ఏపీలో పర్వాలేదు : 93 లక్షల మహిళల జీవిత బీమా పాలసీల్లో మూడో వంతు మూడు రాష్ట్రాలు.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాలలో కేరళ, ఆంధ్రప్రదేశ్, మిజోరం, పుదుచ్చేరి, తమిళనాడు ఉన్నాయి. చివరి ఐదు స్థానాలలో డామన్‌డయ్యూ, దాద్రానగర్ హవేలీ, లడక్, హరియాణా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి. మొత్తం పాలసీల్లో ఏపీ వాటా గణనీయంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment