ముంబై: దేశంలో బీమా రక్షణ మరింత మంది ప్రజలను చేరుకునేందుకు వీలుగా ఏటా రూ.50,000 కోట్ల పెట్టుబడులు అవసరమని బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) చైర్మన్ దేవాశిష్‌పాండా అన్నారు. అప్పుడే వచ్చే ఐదేళ్లలో రెట్టింపు జనాభాను చేరుకోవచ్చని చెప్పారు. బీమా రంగంలోకి పెట్టబడులు తీసుకురావాలని వ్యాపార దిగ్గజాలను ఆయన కోరారు.
జీవిత బీమా కంపెనీల రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఈక్విటీపై రాబడి) 14 శాతంగా ఉంటే, నాన్ లైఫ్ కంపెనీలకు 16 శాతంగా ఉన్నట్టు చెప్పారు. మొదటి ఐదు కంపెనీలకు ఇది 20 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. బీమా రంగంలో రెండు డజనుల జీవిత బీమా కంపెనీలు, 30కి పైగా జీవితేతర బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. అయినప్పటికీ 2020–21 చివరికి దేశంలో బీమా విస్తరణ 4.2 శాతంగానే ఉండడం గమనార్హం. ముంబైలో సీఐఐ నిర్వహించి బీమా, పెన్షన్ వార్షిక సదస్సును ఉద్దేశించి పాండా మాట్లాడారు.
జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ప్రస్తుతం విస్తరణ తదితర అంశాల ఆధారంగా ఏటా 50వేల కోట్ల పెట్టుబడులు కావాలన్న విశ్లేషణకు వచ్చినట్టు చెప్పారు. దీనికి సంబంధించి కార్యాచరణ కోసం మార్చి తర్వాత బీమా సంస్థల అధినేతలతో సమావేశం కానున్నట్టు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో బీమాను రెట్టింపు సంఖ్యలో ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామంటూ.. 2047 నాటి కి (స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు) అందరికీ బీమా లక్ష్యం సాధ్యమేనన్నారు. ప్రస్తుతం బీమా రంగంలో భారత్ పదో అతిపెద్ద మార్కెట్‌గా ఉంటే, 2032 నాటికి ఆరో స్థానానికి చేరుకుంటుందని తెలిపారు.
ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి..
బీమా రంగం సంప్రదాయ లేదా పాత తరహా ఉత్పత్తులనే అందిస్తోందని, నూతన అవసరాలను విశ్లేషించి, పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు తీసుకురావాలని దేవాశిష్ పాండా కోరారు. గృహ రంగ నియంత్రణ సంస్థను కలసి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ (హౌస్ ఇన్సూరెన్స్) తప్పనిసరిగా తీసుకోవడం అమల్లోకి తేవాలని సూచించారు. లేదంటే కేంద్ర గృహ నిర్మాణ శాఖతో కలసి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలియజేయాలని కోరారు. వాణిజ్య బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని బీమా ఉత్పత్తులను విక్రయించడానికే పరిమితం కావద్దని.. నాన్ బ్యాంక్ రుణదాతలు, ఎన్‌బీఎఫ్‌సీలు, కోపరేటివ్ బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లతోనూ చేతులు కలపాలని పాండా సూచించారు.
మెరుగైన యాన్యూటీలను తేవాలి
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పీఎఫ్‌ఆర్‌డీఏ శాశ్వత సభ్యుడు మనోజ్ ఆనంద్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి వ్యక్తులను రక్షించే (మెరుగైన రాబడులతో కూడిన) యాన్యూటీ ప్లాన్లను తీసుకురావాలని బీమా సంస్థలకు సూచించారు. వచ్చే ఐదేళ్లలో బీమా సంస్థలు నిర్వహించే యాన్యూటీ ప్లాన్లలోకి రూ.11,000 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాను వ్యక్తం చేశారు. నూతన పెన్షన్ విధానమే ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలిగిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment