ఏజెంట్ల తప్పులకు బీమా సంస్థలదే బాధ్యత
న్యూఢిల్లీ: ఏజెంట్లు చేసే తప్పొప్పులన్నింటికీ బీమా కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ స్పష్టం చేసింది. ఒకవేళ ఏజెంట్లు నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో బీమా కంపెనీ రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి మంగళవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఐఆర్‌డీఏ ఈ విషయాలు పేర్కొంది. ఈ మార్గదర్శకాల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా బీమా ఏజెంట్ల కింద వ్యవహరించే వ్యక్తులపై రూ. 10,000 దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ఎవరైనా సరే జీవిత బీమా, సాధారణ బీమా, వైద్య బీమా విషయంలో ఒకటికి మించి కంపెనీలకు ఏజెంట్లుగా వ్యవహరించకూడదు. బీమా కంపెనీలు నియమించుకున్న ఏజెంట్లందరి వివరాలతో కూడిన ఒక జాబితా ఉండాల్సిన అవసరం ఉంది.