జన బీమా యోజనను ప్రారంభించండి
ముంబై: బీమా పథకాలనూ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీమా నియంత్రణ సంస్థ(ఐఆర్‌డీఏ) పేర్కొంది. బ్యాంకింగ్ సేవల విస్తరణ కోసం ఇటీవలే ప్రారంభించిన జన ధన యోజన మాదిరిగానే ప్రధాన మంత్రి జన బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఐఆర్‌డీఏ చైర్మన్ టీఎస్ విజయన్ ప్రభుత్వానికి సూచించారు. సోమవారమిక్కడ పారిశ్రామిక మండలి ఫీక్కీ 16వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘బ్యాంకింగ్‌లాగే బీమా సేవలు కూడా మారుమూలలకు చేరడం లేదు.
బీమాపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మరిన్ని చర్యలు అవసరం’ అని విజయన్ పేర్కొన్నారు. ఇక బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాలన్న పరిశ్రమ డిమాండ్‌లపై కూడా విజయన్ స్పందించారు. దీనివల్ల పరిశ్రమ వృద్ధి ప్రస్తుత 3.9 శాతం నుంచి 7.2 శాతానికి పెరుగుతుందా అనేది పరిశ్రమే సమాధానం చెప్పాలన్నారు. బీమా రంగంలో అపార వృద్ధి అవకాశాలున్నాయని... అయితే, ఎఫ్‌డీఐల పెంపు వల్ల మొత్తం దేశానికి, అదేవిధంగా పాలసీదారులకు అంతిమంగా ప్రయోజనం దక్కుతుందాలేదా అనేది చూసుకోవాలని విజయన్ అభిప్రాయపడ్డారు.
నాన్-లైఫ్ బీమా విభాగంలో కూడా భారీ అవకాశలున్నాయని.. వాహనాల సంఖ్య ఏటా లక్షల్లో పెరుగుతుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. మరోపక్క, ఏజెంట్లకు నెలకు రూ.10 వేల చొప్పున కనీస వేతనాలను ఇవ్వడంతో పాటు పరిశ్రమలో ఉద్యోగావకాలను కల్పించాల్సిందిగా బీమా కంపెనీలను విజయన్ కోరారు.