TS Vijayan
-
బీమాపై జీఎస్టీ ప్రభావం అంతంతే..
♦ పర్సనలైజ్డ్ పథకాలపై సంస్థల దృష్టి ♦ బీమా సదస్సులో ఐఆర్డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలో ప్రతిపాదిత శ్లాబ్‌తో బీమా ప్రీమియంలు స్వల్పంగా పెరగొచ్చని, అయితే మొత్తం మీద ఇన్సూరెన్స్ రంగంపై మాత్రం ప్రభావం పెద్దగా ఉండబోదని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్ చెప్పారు. గతంలోలాగానే ప్రస్తుతం కూడా పన్ను రేట్ల పెంపు ప్రభావాలకు బీమా పరిశ్రమ సర్దుకోగలదని ఆయన వివరించారు. మంగళవారమిక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ల సమాఖ్య ఫ్యాప్సీ .. ఇన్సూరెన్స్ రంగంలో కొత్త పోకడలపై నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా విజయన్ ఈ విషయాలు చెప్పారు. ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలపై ప్రస్తుతం 15 శాతంగా ఉన్న ట్యాక్స్ రేటు జీఎస్టీ విధానంలో 18 శాతానికి పెరగనున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగ వృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వివిధ రీఇన్సూరెన్స్ కంపెనీలు కూడా భారత్‌లో శాఖలు ప్రారంభిస్తున్నాయని విజయన్ తెలిపారు. రిస్కు ప్రొఫైల్ ఆధారంగా పర్సనలైజ్డ్ పథకాలు అందించడంపై బీమా కంపెనీలు దృష్టి పెడుతున్నాయన్నారు. ఇందుకోసం డేటా అనలిటిక్స్ మొదలైన టెక్నాలజీ ఉపయోగపడుతోందని తెలిపారు. అలాగే వివిధ రకాల బీమా కవరేజీని ఒకే పాలసీలో అందించేలా కాంబీ ప్రోడక్ట్స్‌పైనా ఇన్సూరెన్స్ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయని విజయన్ చెప్పారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ తరహా పాలసీలు కొన్ని అందిస్తున్నాయని తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల పోర్టబిలిటీని ప్రవేశపెట్టే అంశం ఇంకా చర్చల దశలోనే ఉందన్నారు. అటు దేశవ్యాప్తంగా పాతికవేల పైగా ఆస్పత్రులు, చికిత్స ఖర్చులు మొదలైన వాటితో డేటాబేస్‌ను రూపొందించడం ద్వారా చికిత్స వ్యయాలకు సంబంధించి ప్రామాణిక స్థాయిలను నిర్దేశించే ప్రక్రియ కొనసాగుతోందని విజయన్ చెప్పారు. డిజిటల్ సాంకేతికత కారణంగా రాబోయే రోజుల్లో పాలసీల రూపకల్పన, విక్రయాలు, క్లెయిమ్‌లు, ప్రీమియంల నిర్ధారణ మొదలైన ప్రక్రియల్లో విప్లవాత్మకమైన మార్పులు రాగలవన్నారు. పెరగనున్న విలీనాల డీల్స్.. దేశీయంగా బీమాపై అవగాహనతో పాటు కవరేజీ కూడా పెరుగుతోందని సెమినార్లో పాల్గొన్న న్యూ ఇండియా అష్యూరెన్స్ సీఎండీ జి.శ్రీనివాసన్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ పెరగడంతో పాటు బీమా ప్రక్రియలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు. భారత్ రీఇన్సూరెన్స్ హబ్‌గా ఎదిగేందుకు పుష్కలమైన వనరులు ఉన్నాయన్నారు. 2025 నాటికి జనరల్ ఇన్సూరెన్స్ విభాగ పరిమాణం రూ. 2.5 లక్షల కోట్లకు చేరగలదని ఐసీఐసీఐ లాంబార్డ్ సీఈవో భార్గవ్ దాస్ గుప్తా చెప్పారు. టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటివి బీమా రంగంలో కీలక పాత్ర పోషించగలవన్నారు. ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
బీమా రంగానికి టెక్నాలజీ ఊతం
♦ అప్పుడే చౌకగా పాలసీలు సాధ్యం ♦ ఐఆర్డీఏ చైర్మన్ టీఎస్ విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించడం ద్వారా దేశీయంగా అందరికీ బీమా ప్రయోజనాలను చౌకగా అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్ చెప్పారు. బీమాకు కూడా ఆధార్‌ను అనుసంధానిస్తే ఇది మరింత సులభసాధ్యం కాగలదని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రేట్‌మేకింగ్ ఫోరం ఆఫ్ ఏషియా (ఐఐఆర్‌ఎఫ్‌ఏ) 2016 సదస్సులో పాల్గొన్న సందర్భంగా విజయన్ ఈ విషయాలు వివరించారు. ప్రధానంగా ఆరోగ్య బీమా, వాహన బీమాపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మరోవైపు, దేశీయంగా ఇంకా అత్యధిక శాతం మందికి బీమా కవరేజీ లేని నేపథ్యంలో దీనిపై అవగాహన పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా కంపెనీలు చేతులు కలపాలని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ) సీఈవో ఆర్ రాఘవన్ అభిప్రాయపడ్డారు. అలాగే, వ్యవసాయ బీమా పథకాలను కూడా తక్కువ వ్యయాలతో అందుబాటులోకి తేవడంలో నూ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటికి గణాంకాలు, వాటి విశ్లేషణ కీలకమని రాఘవన్ చెప్పారు. భారత్ సహా ఐఐఆర్ఎఫ్ఏలో ఏడు సభ్య దేశాలకు చెందిన 200 మంది పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. రేట్‌మేకింగ్.. అనలిటిక్స్, కొంగ్రొత్త టెక్నాలజీలు మొదలైన వాటిపై ఇందులో చర్చించారు. -
జన బీమా యోజనను ప్రారంభించండి
ముంబై: బీమా పథకాలనూ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీమా నియంత్రణ సంస్థ(ఐఆర్డీఏ) పేర్కొంది. బ్యాంకింగ్ సేవల విస్తరణ కోసం ఇటీవలే ప్రారంభించిన జన ధన యోజన మాదిరిగానే ప్రధాన మంత్రి జన బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఐఆర్డీఏ చైర్మన్ టీఎస్ విజయన్ ప్రభుత్వానికి సూచించారు. సోమవారమిక్కడ పారిశ్రామిక మండలి ఫీక్కీ 16వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘బ్యాంకింగ్లాగే బీమా సేవలు కూడా మారుమూలలకు చేరడం లేదు. బీమాపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మరిన్ని చర్యలు అవసరం’ అని విజయన్ పేర్కొన్నారు. ఇక బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాలన్న పరిశ్రమ డిమాండ్లపై కూడా విజయన్ స్పందించారు. దీనివల్ల పరిశ్రమ వృద్ధి ప్రస్తుత 3.9 శాతం నుంచి 7.2 శాతానికి పెరుగుతుందా అనేది పరిశ్రమే సమాధానం చెప్పాలన్నారు. బీమా రంగంలో అపార వృద్ధి అవకాశాలున్నాయని... అయితే, ఎఫ్‌డీఐల పెంపు వల్ల మొత్తం దేశానికి, అదేవిధంగా పాలసీదారులకు అంతిమంగా ప్రయోజనం దక్కుతుందాలేదా అనేది చూసుకోవాలని విజయన్ అభిప్రాయపడ్డారు. నాన్-లైఫ్ బీమా విభాగంలో కూడా భారీ అవకాశలున్నాయని.. వాహనాల సంఖ్య ఏటా లక్షల్లో పెరుగుతుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. మరోపక్క, ఏజెంట్లకు నెలకు రూ.10 వేల చొప్పున కనీస వేతనాలను ఇవ్వడంతో పాటు పరిశ్రమలో ఉద్యోగావకాలను కల్పించాల్సిందిగా బీమా కంపెనీలను విజయన్ కోరారు.